Monday, January 20, 2025

‘లోటు’ చూపిస్తే గ్రాంట్లు దక్కేవి?

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ :  రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, ఖజానాకు వచ్చే ఆదాయాన్ని భారీగా పెంచుకోవాలని ఒకవైపు విశ్వప్రయత్నాలు చేస్తూనే మరోవైపు బడ్జెట్‌లో మాత్రం ‘రెవెన్యూ మిగులు’ను ప్రవేశపెట్టడంపై ఆర్థిక నిపుణుల్లోనే కాకుండా రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధికశాఖలోని కొందరు సీనియర్ అధికారుల్లో సైతం చర్చోపచర్చలు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 2024-25వ ఆర్థిక సంవత్సరానికి అసెంబ్లీ, శాసనమండలిలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై నిపుణుల్లో ఇదెక్కడి లాజిక్కో… అర్ధంకావడం లేద ని వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధికశాఖలోని కొందరు సీనియర్ అధికారులు వ్యవహరిస్తున్న తీరు, 2024-25వ ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనలు హేతుబద్దంగా లేవ నే వ్యాఖ్యానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడానికి సుమారు 54 వేల కోట్ల రూపాయల నిధులు అదనంగా అవసరమవుతాయని ఒకవైపు చెబుతూనే, మరోవైపు ఖజానాకు వస్తున్న ఆదాయం కూడా సరిపోవడంలేదని, కార్పోరేషన్ల పేరుతో అప్పులు చేయకూడదని కఠోర నిర్ణయం తీసుకొని, ఎఫ్‌ఆర్‌బిఎం పరిధికి లోబడే రుణాలు సేకరించాలని, అయినప్పటికీ నిధులు సరిపోవడంలేదు గనుక ఖజానాకు ఆదాయాన్ని తీసుకొచ్చే శాఖల్లోని లోపాలు, లొసుగులు తొలగించి కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క లు ఉన్నతస్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నప్పటి కీ బడ్జెట్‌లో మాత్రం రెవెన్యూ మిగులుగా 4,454 కోట్ల రూపాయలను ప్రతిపాదించడం వెనుకనున్న ఆంతర్యమేమిటో అర్ధంకావడంలేదని వ్యాఖ్యానిస్తున్నారు.

వాస్తవానికి ఆరు గ్యారెంటీల్లోని సబ్సిడీ వంటగ్యాస్ సిలిండర్, ఉచిత గృహ విద్యుత్తు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాల పథకాలకు అయ్యే ఖర్చులను రెవెన్యూ వ్యయంలో చూపిస్తే రెవెన్యూ మిగులుకు బదులుగా రెవెన్యూలోటు కనీసం 10 వేల నుంచి12 వేల కోట్ల రూపాయల వరకూ ఉండేదని అంటున్నారు. అలా రెవెన్యూలోటుగా బడ్జెట్‌లో ప్రతిపాదనలు చేసినట్లయితే కేంద్ర ప్రభు త్వం నుంచి రెవెన్యూ లోటు నిధులు రాష్ట్ర ఖజానాకు వచ్చేవని ఆర్ధిక నిపుణులే కాకుండా కొందరు సీనియర్ అధికారులు సైతం వ్యాఖ్యానించారు. ఎందుకంటే రెవెన్యూలోటు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన రాష్ట్రాలన్నింటికీ రెవెన్యూలోటును భర్తీ చేసేందుకు గ్రాంట్ల రూపంలోనే కేంద్రం ఆర్థిక సహాయం చేస్తోందని, అలా దేశంలోని 14 రాష్ట్రాలు రెవెన్యూలోటు కింద కేంద్రం నుంచి 2022-23వ ఆర్ధిక సంవత్సరం నవంబర్ వరకూ ఏకంగా 86,201 కోట్ల రూపాయల నిధులను గ్రాంట్ల రూపంలో కేంద్రం నుంచి పొందాయని వివరించారు. ఒకవేళ తెలంగాణ రాష్ట్రం కూడా రెవెన్యూ లోటుగా కనీసం 10 వేల నుంచి 12 వేల కోట్ల రూపాయలను బడ్జెట్‌లో ప్రతిపాదించుకొన్నట్లయితే కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలోనే ఆ లోటు భర్తీ అయ్యేదని వివరించారు. అంతటి సదవకాశాన్ని తెలంగాణ రాష్ట్రం కోల్పోవడం వెనుక ఆంతర్యమేమిటో అర్ధం కావడంలేదని వ్యాఖ్యానిస్తున్నారు. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెవెన్యూలోటు భర్తీకి గ్రాంట్ల రూపంలో గత నవంబర్ నెల వరకూ 4032 కోట్ల 67 లక్షల రూపాయల నిధులు వచ్చాయని, అస్సాం రాష్ట్రానికి 3,260 కోట్ల రూపాయలు వచ్చాయని ఆ అధికారులు వివరించారు. అదే విధంగా కేరళ రాష్ట్రానికి 8782 కోట్ల 67 లక్షల రూపాయలు, మణిపూర్ రాష్ట్రానికి 1540 కోట్లు, మేఘాలయకు 688.67 కోట్లు, మిజోరాం రాష్ట్రానికి 1076.67 కోట్లు, నాగాలాండ్ రాష్ట్రానికి 3020 కోట్లు, పంజాబ్ రాష్ట్రానికి 5516 కోట్లు, రాజస్థాన్ రాష్ట్రానికి 3241.33 కోట్లు, సిక్కింకు 293.33 కోట్లు, త్రిపురకు 2948.67 కోట్లు, ఉత్తరాఖాండ్ రాష్ట్రానికి 4758 కోట్లు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి 9058 కోట్ల రూపాయల నిధులను కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ల రూపంలో ఆర్థిక సహాయం చేసిందని వివరించారు. ఇలా 2015-16వ సంవత్సరం నుంచీ కేంద్రం రాష్ట్రాలకు రెవెన్యూలోటును భర్తీ చేస్తూ గ్రాంట్‌గా నిధులు ఇస్తోందని వివరించారు. గత పాలకులు తెలంగాణ రాష్ట్రాన్ని ధనిక రాష్ట్రంగా చెప్పుకొని గొప్పలకు పోయి వాస్తవాలను కప్పిపుచ్చి రెవెన్యూ లోటుకు బదులుగా రెవెన్యూ మిగులుగా బడ్జెట్‌లను ప్రతిపాదిస్తూ వచ్చారని, అందుచేతనే రెవెన్యూలోటును భర్తీ చేసే కేంద్ర ప్రభుత్వ జాబితాలో తెలంగాణ రాష్ట్రానికి చోటు లభించలేదని వివరించారు. గత చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటి ప్రభుత్వమైనా రెవెన్యూలోటు బడ్జెట్‌ను ప్రవేశపెడితే కేంద్రం నుంచి లోటు భర్తీకి గ్రాంట్స్ వస్తాయని ఆశించామని, కానీ అది జరగకపోవడంలోని ఆంతర్యమేమిటో తమకు బోధపడటంలేదని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వం మారినప్పటికీ ఆర్ధికశాఖలోని కొందరు సీనియర్ అధికారులకు పాత పద్దతులు, పాత వాసనలు పోలేదని, ఇంకా పాత ధోరణులతోనే బడ్జెట్‌ను రూపొందించినట్లుగా ఉన్నారని, ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి, ఆర్ధికశాఖా మంత్రి కూడా అయిన భట్టి విక్రమార్కలను తమ అధికారులు తప్పుదారి పట్టించినట్లుగా ఉందని ఆ అధికారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కనీసం జూన్-జూలై నెలల్లో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టబోయే పూర్తిస్థాయి బడ్జెట్‌లోనైనా రెవెన్యూ మిగులుకు బదులుగా రెవెన్యూలోటుగా ప్రవేశపెడితే తప్పకుండా రాష్ట్రానికి వేల కోట్ల రూపాయల నిధులు గ్రాంట్ల రూపంలో వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అలా కాకుండా గొప్పలకు పోయి రెవెన్యూ మిగులుగానే బడ్జెట్ ప్రతిపాదనలు యధావిధిగా కొనసాగితే రాష్ట్రమే వేలాది కోట్ల రూపాయల నిధులను అకారణంగా నష్టపోవాల్సి ఉంటుందని, ఇకనైనా తమ ఉన్నతాధికారులు పద్దతిని మార్చుకోవాలని కోరుతున్నారు. అంతేగాక రాష్ట్రాల బడ్జెట్‌లలోని రెవెన్యూ లోటును కేంద్ర ప్రభుత్వం గ్రాంట్స్ రూపంలో నిధులను మంజూరు చేస్తూ ఆర్థికంగా ఆదుకుంటోందనే విషయాన్ని బహుశా ఆర్ధికశాఖ ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులకు తెలియజేసి ఉండకపోవచ్చునని, లేకుంటే సిఎం, డిప్యూటీ సిఎంలు తప్పకుండా రెవెన్యూ లోటుతోనే బడ్జెట్‌ను తయారుచేయించి ఉండేవారని అధికారులు అంటున్నారు. లేకుంటే ఎలాంటి ఆర్ధిక ఇబ్బందుల్లేనటువంటి బడ్జెట్ తయారయ్యి ఉండేదని వివరించారు. ఈ విషయంలో తప్పకుండా మార్పులు వస్తాయని, రాష్ట్రానికి మేలు జరిగే బడ్జెట్‌ను తయారు చేస్తారనే ఆశాభావాన్ని వ్యక్తంచేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News