వాషింగ్టన్ : 2026 ఆఖరికి భూతాపం 48 శాతం వరకు అత్యధిక స్థాయిలో పెరిగిపోతుందని, పారిశ్రామికీకరణ యుగం ముందటి వాతావరణ ఉష్ణోగ్రత కన్నా 1.5 డిగ్రీల సెల్సియస్ ( 2.7 డిగ్రీల ఫారన్ హీట్)ఎక్కువగా పెరుగుతుందని ప్రపంచ వాతావరణ శాస్త్రవేత్తల బృందం అంచనా వేసింది. ఒకవైపు మానవ కల్పిత వాతావరణ మార్పు కొనసాగుతూ మరో వైపు క్రమంగా వాతావరణం వేడెక్కడం పెరుగుతుందని పేర్కొంది. ప్రపంచం మొత్తం మీద 11 వివిధ వాతావరణ హెచ్చరికల కేంద్రాలకు చెందిన శాస్త్రవేత్తల బృందం ఈమేరకు అంచనా వేసింది. థర్మామీటర్‌తో ఉష్ణోగ్రతల్లో అసమానతలు పెరిగిపోతున్నాయి. దశాబ్దం క్రితం ఉష్ణోగ్రతల అసమానతలు 10 శాతం వరకు ఉండగా, గత ఏడాది 40 శాతానికి చేరువయ్యాయని ఇదే వాతావరణ శాస్త్రవేత్తలు గత ఏడాది హెచ్చరించారు. వచ్చే ఐదేళ్లలో అంటే 2022 నుంచి 2026 లోగా ఏదొక సమయంలో 93 శాతం వరకు అత్యంత వేడి సంవత్సరంగా రికార్డు అవుతుందని వివరించారు.
బ్రిటన్ వాతావరణ కార్యాలయం సమన్వయంతో ఈ వాతావరణ శాస్త్రవేత్తల బృందం రానున్న ఐదేళ్ల వాతావరణ పరిస్థితులను సమీక్షించింది. అమెరికా నైరుతి ప్రాంతంలో కరవు ప్రాంతాలపై కూడా అంచనాలు వెలువడ్డాయి. కార్చిచ్చు తదితర వినాశకర అగ్నిపీడిత ప్రాంతాల్లో భయంకరమైన దుర్భిక్షం కొనసాగుతూనే ఉంటుందని ఈ బృందం అంచనాగా చెప్పింది. 2015 లో పారిస్ వాతావరణ సదస్సు భూతాపం మరింత 1.5 డిగ్రీల సెల్సియస్‌కు చేరకుండా నిరోధించాలని తీర్మానించిందని, అదే విధంగా 2018 లో యునైటెడ్ నేషన్స్ సైన్స్ నివేదిక 1.5 డిగ్రీల స్థాయి దాటితే అనేక విపరీత పరిణామాలు ఏర్పడతాయని హెచ్చరించిందని, కానీ ఇప్పటికే భూతాపం 1.1 డిగ్రీల సెల్సియస్‌కు పెరిగిందని శాస్త్రవేత్తల కూటమి పేర్కొంది. ఇది ఒక్క సంవత్సరంతో సరిపోదని, 20 నుంచి 30 ఏళ్లవరకు కొనసాగుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. రానున్న సంవత్సరాల్లో సంభవింంచే సరాసరి ఉష్ణస్థాయిపై హెచ్చరిక మాత్రమేనని పేర్కొన్నారు.