న్యూఢిల్లీ: ఒలింపిక్ పతక విజేతలకు ఎడ్యుటెక్ స్టార్టప్ బైజూస్ భారీ నజరానా ప్రకటించింది. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు బంగారు పతకాన్ని అందించిన నీరజ్ చోప్రాకు రూ.2 కోట్లు ప్రకటించగా, పతకాలు అందించిన మిగతా ఆరుగురు క్రీడాకారులకు తలా కోటి రూపాయలు చొప్పున నగదు బహుమతి ప్రకటించింది. జాతి నిర్మాణంలో క్రీడలు ప్రముఖ పాత్ర పోషిస్తాయని బైజూస్ వ్యవస్థాపకుడు, సిఇఓ బైజు రవీంద్రన్ పేర్కొన్నారు. బెంగళూరుకు చెందిన ఎయిర్‌లైన్స్ సంస్థ స్టార్ ఎయిర్ టోక్యో ఒలింపిక్స్ పతక విజేతలకు జీవితకాలం ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. మన ఒలింపిక్స్ విజేతలకు కృతజ్ఞతలు తెలుపుకోవాలని, కృషి, అంకితభావం ఉంటే పర్వతాలను కూడా కదిలించవచ్చని వారు గుర్తు చేశారని స్టార్ ఎయిర్ సిఇఓ సిమ్రన్‌సింగ్ తివానా అన్నారు. వారికి జీవితకాలం తమ విమానంలో ఉచిత ప్రయాణం కల్పించడం తమకు దక్కిన గౌరవంగా భావిస్తామన్నారు. మరో ఎయిర్‌లైన్స్ ఇండిగో ఎయిర్‌లైన్స్ కూడా ఇలాంటి ప్రకటనే చేసింది. దేశానికి స్వర్ణం అందించిన నీరజ్ చోప్రాకు ఏడాది పాటు అపరిమితంగా ఉచితంగా టికెట్లను అందించనున్నట్లు ప్రకటించింది.