Monday, December 23, 2024

దూరాలను చేరువ చేస్తూ

- Advertisement -
- Advertisement -

డా. సి. నారాయణరెడ్డి గారు తమ ప్రతి జన్మదినోత్సవానికి ఒక కవితా సంపుటిని ప్రచురించి సాహిత్యోత్సవం జరుపుకొనేవారు. వారి తదనంతరం వారి కుమార్తె శ్రీమతి సి. గంగ, తెలంగాణ సారస్వత పరిషత్తు కార్యదర్శి డా. జె. చెన్నయ్యలు వారి అసంకలిత రచనలను ప్రచురించడం ద్వారా ఆ ప్రతిభామూర్తికి నివాళులు సమర్పిస్తున్నారు. ఈసారి వారి పన్నెండు సాహిత్య వ్యాసాలను ‘సమన్వయం’ పేరుతో వెలుగులోకి తెచ్చారు. ‘పాత కొత్తల మేలు కలయిక’ను నమ్మిన వారు కావటంతో పింగళి సూరన మొదలు దివాకర్ల వారి దాకా వున్న సాహితీ వేత్తలను గూర్చిన తొమ్మిది వ్యాసాలు ఇందులో కనిపిస్తాయి. వీటిని వ్యక్తి ఆశ్రిత సాహితీ వ్యాసాలుగా భావించవచ్చు. ‘కుతుబ్ షాహీల నాటి తెలుగు కవిత్వం’ అన్న వ్యాసం వారి లౌకిక వ్యక్తిత్వానికి, ‘తెలుగు భాషా సంస్కృతుల విశిష్టత’, ‘భారత సమైక్య భావన తెలుగు కవిత’ అన్న వ్యాసాలు సినారె విమర్శక వ్యక్తిత్వానికి నిదర్శనంగా నిలుస్తాయి.

‘ఆధునికాంధ్ర కవిత్వం: సంప్రదాయములు ప్రయోగములు’ అన్న సినారే సిద్ధాంత గ్రంథం తెలుగులో అసమాన పరిశోధనకు ప్రసిద్ధి చెందింది. అదే స్ఫూర్తిని వారి దీపాలుగా వెలిగిస్తూ అప్పుడప్పుడు రాస్తూ వచ్చిన వ్యాసాలివి. ‘కుతుబ్ షాహీల నాటి తెలుగు కవిత్వం’ అన్న వ్యాసంలో మల్కిభరాముని దగ్గర నుండి తానీషా కాలం వరకు అనేక కావ్యాలు రచించిన చరిగొండ ధర్మన, కందుకూరి రుద్రకవి, అద్దంకి గంగాధర కవి, పొన్నిగంటి తెలగన, రామదాసు వంటి కవీశ్వరులు మెప్పించిన కావ్యాల వివరాలను పేర్కొన్నారు. ముఖ్యంగా ఆ ముస్లిం పాలకులు తెలుగు వారి కావ్యాలను అంకితం తీసుకుంటూ ప్రకటించిన మతాతీత సౌహార్దం సినారెను బాగా ఆకర్షించింది.

సరోజినీ నాయుడు ఆరంభ దశలో రాసిన కవిత్వం మీద ఇంగ్లీషు రొమాంటిక్ కవుల ప్రభావం వుండేదని, ఎడ్మండ్ రాస్ అనే ఆంగ్ల కవి సూచన మేరకు భారతీయ వాతావరణ చిత్రణకు పూనుకొన్నారని సినారె అంటున్నారు. అందుకే చేనేత వాళ్ళను గూర్చి, గాజుల వాళ్ళను గూర్చి, పల్లకీ బోయీలను గూర్చి రాసిన కవితల్లో ఎంతో దేశీయత చోటు చేసుకుందన్నది సినారె పరిశీలన. గోరించాకు, విసుర్రాయి వంటి కవితల్లో జానపద కవిత్వపు ఛాయలున్నాయని కూడా సినారె గమనించారు. ఒక బుజ్జి అనాథ పాప ‘ఓ చుక్కా! నాకు నువ్వు అమ్మవవుతావా? ఓ గాలీ! నువ్వు నాకు అన్నవవుతావా?’ అంటూ జాలిగా బేలగా ప్రశ్నించటంతో కరుణరసా విష్కరణ జరిగిందన్నది సినారె అభిప్రాయం.
సరోజినీ నాయుడు స్వాతంత్య్రోద్యమంలో పాల్గొని అన్ని ముఖ్య ఘట్టాలలో తన ఉనికి చాటుకొన్న వీర వనిత. ‘మేలుకో నా తల్లి’, ‘ఒకే హృదయం’ వంటి గీతాలు ఆమె మీద వున్న జాతీయోద్యమ ప్రభావాన్ని చాటుతున్నాయని సినారె వ్యాఖ్యానించారు.

కట్టమంచి రామలింగారెడ్డిని గూర్చిన ‘కవి, విమర్శకుడు కట్టమంచి’ అన్న వ్యాసంలో సినారె చాలా విషయాలను గుదిగ్రుచ్చారు. తమ పందొమ్మిదవ ఏటనే కట్టమంచి రాసిన ‘ముసలమ్మ మరణము’ అన్న కొత్త స్పర్శ వున్న కావ్యం, ‘కళాపూర్ణోదయం’ అన్న ఆధునిక దృక్కోణం నుంచి రాసిన తొలి వ్యాసం వెలుగులోకి వచ్చాయంటున్నారు. కళాపూర్ణోదయ వ్యాసమే ఆ తర్వాత 1916లో ‘కవిత్వ తత్వ విచారము’ అన్న గ్రంథంగా రూపొందింది. అష్టాదశ వర్ణనలు, హద్దు మీరిన శృంగారం, సమాస భూయిష్టమైన భాష వంటి ప్రబంధ లక్షణాలను కాదని, కవిత్వానికి ‘భావనాశక్తి’ ముఖ్యమని కట్టమంచి ప్రతిపాదించారన్నది సినారె అనుశీలన. ఆంగ్ల ఆంధ్ర సాహిత్యాలను తులనాత్మకంగా అధ్యయనం చేసిన వారు కావడం వల్ల, ఆధునిక దృష్టితో పరిశోధన చేసి, ప్రధానంగా తెలుగు సాహిత్య విమర్శకు కట్టమంచి కొత్తదారులు వేశారని సాదరంగా ప్రస్తావించారు సినారె.

‘విశ్వనాథ గేయ రచనలు’ ఒక లఘు వ్యాసం. ఒక జ్ఞానపీఠ పురస్కార గ్రహీత మరో జ్ఞానపీఠ పురస్కార గ్రహీత మీద రాసిన వ్యాసంగా ఆసక్తిని కలిగిస్తుంది. ‘కిన్నెరసాని’, ‘కోకిలమ్మపెళ్ళి’, ‘పాముపాట’ అన్న మూడు గేయకృతుల మీద గచ్ఛత్ వ్యాఖ్యలు కనిపిస్తాయి. ‘కిన్నెరసాని పాటల్లోని ప్రాణభూతమైన శ్రుతులు, భావాలు, పరిశీలనాశక్తి పరిణతంగా వున్న ఛందస్సు ఇన్ని సుగుణాలు సముచితంగా, సమున్నతంగా సమ్మేళనం పొందడం వల్లనే ఇంతటి రస వత్కృత వెలువడిందంటున్నారు సినారె. ఈ ఒకే ఒక వాక్యం ఆ కావ్య గరిమను చాటే వ్యాఖ్య. దాశరథి కూడా ‘కిన్నెసారి తర్వాతనే రామాయణ కల్పవృక్షం’ అన్నారంటే అదెంత ఉత్కృష్ట రచనో అర్థం చేసుకోవచ్చు. తక్కిన రెండు గేయ కావ్యాల వ్యాఖ్యానం కూడా ఇదే పద్ధతిలో సాగుతుంది.

‘ఉన్నతాశయ సాధకుడు సురవరం ప్రతాపరెడ్డి’ వ్యాసం ఆ బహుముఖ ప్రజ్ఞాశాలి మూర్తిమత్వాన్ని కాగడా పట్టి చూపుతుంది. మొదట్లో కవిత్వం, కథలు వంటి కాల్పనిక రచనల మీద దృష్టి సారించినా, రానురాను సురవరం దృష్టి వాస్తవికత మీద కేంద్రీకృతమైందన్న సినారె అభిప్రాయం బహుళ విమర్శకామోదం పొందింది. ‘పుక్కిటి పురాణాలను కాదని యథార్థ చారిత్రక సత్యాలను సహేతుకంగా తవ్విపోయాలనే నిశిత దృక్పథం’ వారిలో రోజురోజుకు పెరుగుతూ వచ్చింది. ఫలితంగా రామాయణ విశేషాలు, హిందువుల పండుగలు, ఆంధ్రుల సాంఘిక చరిత్ర అన్న అమూల్యమైన పరిశోధనాత్మక గ్రంథాలు వెలువడ్డాయి. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పిన వారు సురవరం ప్రతాపరెడ్డేనన్నది తిరుగులేని సత్యం. ‘అల్లావుద్దీన్ ఖల్జీ,

ఔరంగజేబు, ఆసఫ్‌జాల చరిత్రల కంటే మన చరిత్రలు మాత్రం తక్కువయినవా’? అన్నప్పుడు సురవరం వారి చారిత్రక దృష్టి, ప్రాచీన తెలుగు కవుల కవిత్వంలోని అలనాటి సమకాలీన సమాజాన్ని వెతికి తీసినప్పుడు వారి సాంఘిక దృష్టి, ఎవరో ‘తెలంగాణమున కవులు లేరు’ అని తూలగా, తెలంగాణములోని పల్లెపల్లెకూ తిరిగి 354 మంది కవుల సంస్కృతాంధ్ర రచనలను సేకరించి ‘గోలకొండ కవుల సంచిక’గా ప్రకటించటంలో వారి సాహిత్య దృష్టి ప్రకటనమైందని సగర్వంగా చాటి చెప్పారు సినారె. గోలకొండ పత్రిక ద్వారా సురవరం వారు తెలంగాణ వ్యాప్తంగా వెలిగించిన చైతన్య దీథితులను గూర్చి కూడా సినారె ప్రస్తావించారు. సినారె రాసిన ప్రతి వ్యాసంలో విశ్లేషణ, పరిశీలనలు పోటీపడి కనిపిస్తాయి. సాహిత్య విద్యార్థులకే పుస్తకం ఉపయుక్త గ్రంథం.

డా. అమ్మంగి వేణుగోపాల్
9441054637

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News