Thursday, December 26, 2024

రాజ్యాంగ ప్రతినిధుల మధ్య రగడ

- Advertisement -
- Advertisement -

కొన్ని రాష్ట్రాల్లో గవర్నర్లు, ముఖ్యమంత్రుల మధ్య సంఘర్షణ వైఖరి కొనసాగుతుండడం పాలనా వ్యవహారాలకు ప్రతిబంధకమవుతోంది. కేరళ, తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలకు రాజకీయ ప్రత్యర్థులుగా గవర్నర్లు వ్యవహరించడం చివరకు సుప్రీం కోర్టు జోక్యం చేసుకుని మందలించడం ఇవన్నీ తెలిసినవే. అయితే ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో గవర్నర్ సివి ఆనందబోస్‌కు, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మధ్య చాలా విషయాల్లో తీవ్ర ప్రతిఘటన కొనసాగుతోంది. ఈ వైరుధ్యం చిచ్చు ఇంకా ఆరడం లేదు. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.

గవర్నర్ మారే వరకు రాజ్‌భవన్‌కు వెళ్లబోనని మమతా బెనర్జీ శపథం చేశారు. అలాగే రాజ్‌భవన్‌లో తనకు భద్రత లేదని గవర్నర్ ఆరోపిస్తున్నారు. ఇటీవల రాజ్‌భవన్ వద్ద విధులు నిర్వహిస్తున్న ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు తన పట్ల అక్రమంగా ప్రవర్తిస్తున్నారని వారిపై క్రమశిక్షణ చర్య తీసుకోడానికి గవర్నర్ ఉపక్రమించారు. రాష్ట్రప్రభుత్వం నుంచి ఆ పోలీస్ అధికారులపై నివేదిక కోరడం రగడగామారింది. ఇది రాజ్‌భవన్‌కు, ముఖ్యమంత్రి కార్యాలయానికి మధ్య విభేదాల అగాధాన్ని మరింత పెంచుతోంది. కోల్‌కతా సిటీ పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్, డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఇందిరా ముఖర్జీ తన పట్ల అక్రమంగా ప్రవర్తిస్తున్నారని గవర్నర్ ఆనంద బోస్ తీవ్ర ఆరోపణలు చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

రాజ్‌భవన్‌లోని మహిళా ఉద్యోగిని గవర్నర్ వేధించినట్టు ఫిర్యాదు రాగా, దానికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడడం, రాజ్‌భవన్‌లో మహిళా ఉద్యోగులకు భద్రత లేదనడం, దీనిపై దర్యాప్తు అవసరమని ఆ పోలీస్ అధికారులు పదేపదే బహిరంగంగా వ్యాఖ్యానించడం ఇవన్నీ గవర్నర్‌కు మనస్తాపం కలిగించాయి.రాజ్యాంగంలోని ఆర్టికల్ 361 ప్రకారం గవర్నర్‌పై ఎలాంటి ఫిర్యాదు వచ్చినా చర్య తీసుకునే అవకాశం లేదు. అయినప్పటికీ ఇది తీవ్రంగా గవర్నర్ పరిగణిస్తున్నారు. గతంలో అప్పటి రాజస్థాన్ గవర్నర్ కల్యాణ్ సింగ్ పైన, 2017లో మేఘాలయ గవర్నర్ షణ్ముగనాథన్ పైన వేధింపుల ఫిర్యాదులు వచ్చాయి. అయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.అదే విధంగా ఇప్పుడు ఎలాంటి దర్యాప్తునకు వీలు కాకపోయినా, దాని గురించే ఆ పోలీస్ ఆఫీసర్లు మాట్లాడడం ప్రవర్తనా నియమాలను ఉల్లంఘించినట్టేనని గవర్నర్ ఆనంద్ బోస్ ఆగ్రహిస్తున్నారు.

ఇంతేకాకుండా ఎన్నికల తరువాత జరిగిన హింసాత్మక సంఘటనల బాధితులు తనను కలియడానికి ప్రయత్నిస్తే ఆ పోలీస్ ఆఫీసర్లు అడ్డుకున్నారని గవర్నర్ మండిపడుతున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల నడిరోడ్డుపై ఒక మహిళను చావబాదిన సంఘటనతో పాటు ఇతర సామూహిక హింసాత్మక సంఘటనల గురించి కూడా నివేదిక కావాలని గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. వాస్తవానికి ఆర్టికల్ 167 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమాచారాన్ని కోరే అధికారం గవర్నర్‌కు ఉంది. రాష్ట్ర ప్రభుత్వ అజమాయిషీలో పని చేసే కేంద్ర సర్వీస్ అధికారులపై క్రమశిక్షణా చర్యలు గవర్నర్ లేదా కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు చర్యలు తీసుకుంటారన్నది వేరే ప్రశ్న. తనపై వచ్చిన వేధింపుల ఫిర్యాదు పోలీస్‌లు కల్పించిన, ప్రేరేపించిన ఆరోపణగా గవర్నర్ వాదిస్తున్నారు. సంబంధిత పోలీస్‌లపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ పట్టుపట్టడం, ఇది మరింత రచ్చకెక్కడం ఎవరికీ ఆసక్తి కలిగించకపోవచ్చు.

కానీ అదే సమయంలో గవర్నర్‌కు, ముఖ్యమంత్రికి మధ్య వ్యక్తిగత గొడవలు, వ్యవస్థాపరమైన సంఘర్షణలు పెరిగిపోతుండడం ఎవరికీ మంచిది కాదు. ఈ పరిణామాలు చూస్తుంటే రాజ్‌భవన్ రాజకీయ ఘర్షణగా తయారై ఎన్నికైన ప్రజాప్రభుత్వాన్ని అణగదొక్కే పరిస్థితిగా మారుతున్నట్టు కనిపిస్తోంది. ఇలా రెండు పక్షాలు నిరంతరం సంఘర్షణలో చిక్కుకుంటున్నాయి. ఇది కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య విరోధానికి అద్దం పడుతోంది. బిల్లులు మంజూరు చేసే విషయంలోనూ సంఘర్షణ తప్పడం లేదు. ఇటీవల కొత్తగా ఎన్నికైన శాసన సభ్యుల ప్రమాణ స్వీకారం కూడా వివాదాస్పదమైంది. రాజ్‌భవన్‌ను తనను అవమానిస్తూ వ్యాఖ్యలు చేశారని ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై గవర్నర్ పరువు నష్టం దావా వేశారు. రాజ్యాంగ ప్రతినిధులు రాజకీయ రగడగా మారకూడదని రాజకీయ నీతిజ్ఞులు, వివిధ వర్గాల ప్రముఖులు సూచిస్తున్నారు. సంఘర్షణ అంచు నుండి ఈ రాజ్యాంగ ప్రతినిధులు వెనక్కు తగ్గితేనే పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో సజావుగా పాలనా వ్యవహారాలు సాగుతాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News