బెంగాల్ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా
కోల్‌కతా : దేశంలో కొవిడ్ టీకా ప్రక్రియ ముగిసిన తర్వాత పౌరసత్వ చట్టం అమలు మొదలవుతుందని కేంద్ర మంత్రి అమిత్ షా చెప్పారు. పశ్చిమ బెంగాల్‌లో వలస వచ్చిన హిందువులకు చెందిన ఒక కులం (మతువా)వారికి అమిత్ షా ఈ హామీ ఇచ్చారు. 2015కు ముందు బంగ్లాదేశ్, పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్‌నుంచి వలసవచ్చిన ఇతర ముస్లిమేతరులతో పాటుగా మతువా కులానికి కూడా ఈ పౌరసత్వ సవరణ చట్టం (కా) అమలు వల్ల ప్రయోజనం చేకూరుతుందని ఆయన చెప్పారు. ఈ చట్ట అమలు వల్ల దేశంలోని ముస్తిం మైనారిటీల పౌరసత్వంపై ఎలాంటి ప్రభావం ఉండదని అమిత్ షా చెప్పారు. అయితే దేశంలో మొట్టమొదటి సారిగా భారతీయ పౌరసత్వానికి మతాన్ని ఒక అర్హతగా చేస్తున్న ఈ చట్టంపై ప్రతిపక్షాలు ముస్లింలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆయన విమర్శించారు.
కొత్త పౌరసత్వ చట్టాన్ని తీసుకు వస్తామని మోడీ ప్రభుత్వం 2018లో హామీ ఇచ్చిందని, 2019లో బిజజెపి తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని నిలబెట్టుకుందని అమిత్ షా చెప్పారు. అయితే 2020లో కరోనా మహమ్మారి కారణంగా దేశంలో ఈ చట్టం అమలును వాయిదా వేయాల్సి వచ్చిందన్నారు.‘ మేము తప్పుడు హామీ ఇచ్చామని మమతా దీదీ అంటున్నారు. దీన్ని ఎప్పటికీ అనుమతించబేమని చెప్పడం ద్వారా ఆమె దీన్ని వ్యతిరేకించడం మొదలుపెట్టారు. బిజెపి తాను చేసిన హామీలను ఎప్పుడూ నిలబెట్టుకుంటుంది.
మేము ఈ చట్టాన్ని తీసుకు వచ్చాం. దీనివల్ల శరణార్థులకు పౌరసత్వం లభిస్తుంది. కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయిన వెంటనే పౌరసత్వ సవరణ చట్టం( కా) కింద పౌరసత్వం మంజూరు ప్రక్రియ మొదలవుతుంది’ అని గురువారం మతువా తెగవారు అధిక సంఖ్యలో ఉన్న పశ్చిమ బెంగాల్‌లోని ఠాకూర్‌నగర్‌లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ అమిత్ షా చెప్పారు. పశ్చిమ బెంగాల్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అమిత్ షా ఈ ప్రకటన చేయడం గమనార్హం.