Sunday, December 22, 2024

ఇండియా కూటమి ప్రభుత్వం వస్తే సిఎఎ రద్దు: చిదంబరం

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం: ఇండియా కూటమి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత పార్లమెంట్ తొలి సెషన్‌లోనే వివాదాస్పద సిఎఎను రద్దు చేస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం ఆదివారం చెప్పారు. చిదంబరం తిరువనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ మేనిఫెస్టోలో సిఎఎ రద్దు ప్రస్తావన లేకపోయినప్పటికీ పార్టీ ఉద్దేశం ఆ చట్టం రద్దేనని స్పష్టం చేశారు. పార్టీ మేనిఫెస్టోలో సిఎఎ గురించిన ప్రస్తావన లేనందుకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నుంచి, సిపిఐ(ఎం) నుంచి కాంగ్రెస్ విమర్శలు ఎదుర్కొంటున్నది. ‘మేనిఫెస్టో సుదీర్ఘంగా ఉన్నందున’ సిఎఎ గురించి ప్రస్తావించలేదని చిదంబరం వివరించారు. పది సంవత్సరాల బిజెపి పాలన దేశానికి అపార నష్టం కలిగించిందని, పార్లమెంట్‌లో ‘దారుణ ఆధిక్యాన్ని’ ఆ పార్టీ దుర్వినియోగం చేసిందని ఆయన ఆరోపించారు.

‘చట్టాల సుదీర్ఘ జాబితా ఉంది. వాటిలో ఐదు చట్టాలను పూర్తిగా రద్దు చేస్తాం. నేను మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌ను. దానిలో ప్రతి పదాన్నీ రాశాను. ఉద్దేశం ఏమిటీ నాకు తెలుసు. సిఎఎ సవరణ కాకుండా రద్దు జరుగుతుంది. మేము ఆ విషయం స్పష్టం చేశాం’ అని చిదంబరం చెప్పారు. ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు పార్లమెంట్ తొలి సెషన్‌లోనే సిఎఎను రద్దు చేస్తుందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ఆ చట్టాన్ని వ్యతిరేకించలేదన్న విజయన్ వ్యాఖ్యలను చిదంబరం తోసిపుచ్చుతూ, తిరువనంతపురం ఎంపి శశి థరూర్ పార్లమెంట్‌లో సిఎఎకు వ్యతిరేకంగా మాట్లాడారని తెలియజేశారు. అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ అంశం ఎన్నికల్లో ప్రభావం చూపుతుందా అన్న ప్రశ్నకు లేదని తాను ఆశిస్తున్నట్లు చిదంబరం సమాధానం ఇచ్చారు.

‘అయోధ్యలో ఇప్పుడు ఒక ఆలయం ఉంది. మేము ఆనందించాం. జనం గుడి కోరుకున్నారు. గుడి వచ్చింది. అంతటితో ఆ కథ ముగిసింది. అయోధ్యలో ఆలయం రాజకీయాల్లో లేదా ఎన్నికల్లో ఎందుకు పాత్ర పోపించాలి? దేశాన్ని ఎవరు పాలించాలో అన్నది ఎందుకు తేల్చాలి? దానికి అసలు ఏ పాత్రా లేదు’ అని చిదంబరం అన్నారు. దేశ సరిహద్దు భద్రత అంశంపై చిదంబరం మాట్లాడుతూ.. ‘వేలాది చదరపు కిలో మీటర్ల భారత భూభాగాన్ని చైనా దళాలు ఆక్రమించుకున్నాయన్న’ నిజాన్ని దేశ ప్రజల నుంచి బిజెపి ప్రభుత్వం దాస్తోందని ఆరోపించారు. బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వాన్ని కూడా చిదంబరం దుయ్యబట్టుతూ.. అది ఇక ఎంత మాత్రం జాతీయ పార్టీ కాదని, కాని ప్రధాని నరేంద్ర మోడీని ఆరాధించే ఒక తెగగా మారిందని ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News