శివసాగర్ (అసోం): బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ అసోం విభజనకు ప్రయత్నిస్తున్నాయని, తమ పార్టీ అసోం ఒప్పందం లోని ప్రతి అంశాన్ని పరిరక్షిస్తుందని, తమకు అధికారమిస్తే అసోం రాష్ట్రంలో ఎప్పటికీ పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) అమలు కానీయమని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. మార్చిఏప్రిల్‌లో అసోంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాహుల్ ఆదివారం నాడు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. శివసాగర్‌లో నిర్వహించిన తొలి బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ప్రజల వాణిని వినగలిగే స్వంత ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అవసరమని, నాగపూర్, ఢిల్లీ చెప్పినట్టు నడుచుకునే వ్యక్తి కాకూడదని వ్యాఖ్యానించారు. అసోం ఒప్పందం శాంతిని నెలకొల్పింది. అది రాష్ట్రానికి రక్షణ కవచంలా ఉంటుంది. అలాంటి ఒప్పందం లోని ప్రతి సూత్రాన్ని తాను, తమ పార్టీ కార్యకర్తలు పరిరక్షిస్తామని, అందులోని ఏ నిబంధనను అతిక్రమించబోమని రాహుల్ స్పష్టం చేశారు.
అసోం కానీ విడిపోతే ప్రధాని నరేంద్రమోడీకి కానీ, హోం మంత్రి అమిత్‌షాకు కానీ ఎలాంటి నష్టం జరగదని, అసోం ప్రజలు, మిగతా ప్రాంతాలు బాగా నష్టపోతాయని రాహుల్ పేర్కొన్నారు. ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్‌షాలపై ధ్వజమెత్తుతూ వారిద్దరికీ వ్యాపార వేత్తలు చాలా సన్నిహితులని, రాష్ట్రం లోని సహజ వనరులను, ప్రభుత్వ సంస్థలను ఇద్దరు ప్రముఖ వ్యాపారవేత్తలకు అమ్మకానికి పెట్టేస్తారని విమర్శించారు. కరోనా మహమ్మారి సమయంలో మోడీ ప్రభుత్వం ప్రజాధనాన్ని లూటీ చేసి, తమ మిత్రులైన ఇద్దరు వ్యాపారవేత్తల రుణాలను మాత్రం భారీ ఎత్తున మాఫీ చేసిందని ఆరోపించారు. రాష్ట్రం లోని హింసా శకానికి మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ నేతృత్వం లోని కాంగ్రెస్ ప్రభుత్వం ముగింపు పలికి శాంతిని నెలకొల్పినట్టు రాహుల్ పేర్కొన్నారు.