Monday, January 20, 2025

2028 వరకూ ఉచిత బియ్యం

- Advertisement -
- Advertisement -

పండగల సీజన్‌లో నరేంద్రమోడీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2028 డిసెంబర్ వరకు ఉచిత బియ్యం పంపిణీ పథకాలకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దేశ వ్యాప్తంగా ఆహార భద్రతలో భాగంగా ఉచితంగా బియ్యం/ఆహార ధాన్యాలను అందించేందుకు ఉద్దేశించిన పీఎం కల్యాణ్ అన్నయోజన (పీఎంజీకెఎవై)ను మరో నాలుగేళ్లు పొడిగిస్తున్నామని , ఇందువల్ల ప్రభుత్వానికి రూ.17,052 కోట్ల ఖర్చు అవుతుందని తెలియజేసింది. ఈ మొత్తం కేంద్రమే భరిస్తుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం నాడు మీడియాకు వెల్లడించారు. ఫోర్టిఫైడ్ రైస్ నాణ్యతను పరీక్షించేందుకు 27 ఎన్‌ఏబీఎల్ ల్యాబ్స్‌ను వినియోగిస్తామని , విటమిన్ మినరల్ ప్రీమిక్స్ టెస్టింగ్ కోసం 11 ఎన్‌ఏబీఎల్ ల్యాబ్‌లు అందుబాటు లోకి తెస్తామని చెప్పారు. ఇందుకు అవసరమైన సప్లై చైన్ డెవలప్‌మెంట్ కోసం రూ. 11,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని మంత్రి తెలిపారు.

ఇదిలా ఉండగా గుజరాత్ లోని లోథాల్‌లో నేషనల్ హెరిటేజ్ కాంప్లెక్స్ అభివృద్ధికి కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు చెప్పారు. ఇందువల్ల 22 వేల ఉద్యోగాల సృష్టి జరుగుతుందన్నారు. వివిధ దశల్లో ఈ ఎన్‌ఎం హెచ్‌సీని అభివృద్ధి చేస్తామని చెప్పారు. రాజస్థాన్, పంజాబ్ సరిహద్దు ప్రాంతాల్లో 2280 కిలో మీటర్ల మేర రోడ్ల నిర్మాణానికి సైతం కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపినట్టు అశ్విని వైష్ణవ్ తెలిపారు. దీనికి రూ. 4406 కోట్లు ఖర్చవుతుందని చెప్పారు. ఎన్‌ఎంహెచ్‌సి ప్రాజెక్టును అభివృద్ధి చేయడానికి నిర్ణయించారు. దీనివల్ల ప్రత్యక్షంగా 15000, పరోక్షంగా 7000 ఉద్యోగాలు లభిస్తాయి. లైట్‌హౌస్ మ్యూజియం నిర్మాణానికి కూడా ఆమోదించారు. దీని మొదటి దశ నిర్మాణం 2025 నాటికి పూర్తవుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News