న్యూఢిల్లీ : యువత అభివృద్ధికి ఉద్ధేశించిన ‘మేరా యువ భారత్ (మై భారత్ ) స్వయం ప్రతిపత్తి సంస్థ ఏర్పాటు నిర్ణయానికి కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఇందులో తీసుకున్న నిర్ణయాలను సమాచార ప్రసారాల మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆ తరువాత విలేకరులకు తెలిపారు. సాంకేతికతతో యువజన అభివృద్ధి, యువజన కేంద్రీకృత అభివృద్ధి ప్రాతిపాదికన యువతకు సరైన వ్యవస్థ ఏర్పాటు దిశలో ఈ మై భారత్ సంస్థ ఏర్పాటు జరిగినట్లు మంత్రి వివరించారు.
యువతరం ఆకాంక్షలకు అనుగుణంగా , వారి కలలను నెరవేర్చేందుకు వారికి అవసరం అయిన సమాన అనుసంధాన ప్రక్రియ ఈ సేవలతో ఏర్పాటు అవుతుందని చెప్పారు. తద్వారా ప్రభుత్వ పరిధిలో ఇప్పుడు చేపడుతున్న ప్రగతి భారత్ దిశలో ఇది మరో ముందడుగు అవుతుందని తెలిపారు. మొత్తం ప్రభుత్వ వేదికను యువజన అభ్యున్నతి దిశలోకి తీసుకువచ్చే ప్రధాన లక్షంలో భాగంగా ఈ సంస్థ ఏర్పాటు జరిగింది. ఈ సంస్థను జాతికి ఈ నెల 31వ తేదీన సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి నేపథ్యంలో జాతికి అంకితం చేస్తారు.
లిథియం ఇతర కీలక ఖనిజాలకు రాయాల్టీ రేట్లు
లిథియం, నియోబియమ్ ఖనిజాలకు 3 శాతం చొప్పున రాయల్టీ, అరుదైన భూ ఖనిజాలు మూలకాల(ఆర్‌ఇఇ)పై 1 శాతం రాయల్టీ అందిస్తారు. ఈ మేరకు తీసుకున్న నిర్ణయానికి కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇప్పుడు తీసుకున్న నిర్ణయంతో ఇక కేంద్ర ప్రభుత్వానికి లిథియం ఇతర ఖనిజాల వేలానికి వీలు కల్పిస్తుంది. రాయల్టీ రేట్ల ఖరారు సంబంధిత ఖనిజాల వేలం దశలో ఈ రాయల్టీల ఖరారు కీలకం అవుతుంది. దీనిని పరిగణనలోకి తీసుకునే బిడ్స్‌కు ముందుకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. దేశ ఆర్థిక ప్రగతి, జాతీయ భద్రతకు అత్యంత కీలకమైన మినరల్స్ అత్యవసరంగా మారాయి. దేశంలో తలపెట్టిన ఇంధన రంగ మార్పులు, 2070నాటికి కార్బన్ ఉద్గారాల కట్టడి లక్షాల సాధనకు అరుదైన ఖనిజాల వాడకం అత్యవసరం అయింది.