లీటరుకు రూ 1.47 పైసలు పెంపు
న్యూఢిల్లీ : దేశంలో చక్కెర అనుబంధ ఉత్తత్పి అయిన ఇథనాల్ ధరలను లీటరుకు రూ 1.47 పైసలు పెంచే నిర్ణయానికి కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. పెట్రోలులో కలిపేందుకు ఈ ఇథనాల్‌ను వాడుతారు. డిసెంబర్ నుంచి ఆరంభం అయ్యే 2021 21 మార్కెటింగ్ ఇయర్‌కు సంబంధించి ఈ పెరుగుదల వర్తిస్తుంది. ఇథనాల్ ఉత్పత్తికి దిగే చెరకు రైతులకు ఈ పెరుగుదల రేటు అందుతుంది. పెట్రోలులో ఇథనాల్ మిశ్రమంతో రూపొందే ఇంధన ప్రక్రియతో దేశానికి ప్రతి ఏటా పెట్రోలు డీజిల్ దిగుమతుల కోటా కొంత మేరకు తగ్గుతుంది.
ఈ మేరకు చమురు దిగుమతుల భారం, విదేశీమారకద్రవ్యం శాతం తగ్గుతుంది. దేశంలో 2025 నాటికి ఇథనాల్ మిశ్రిత ఇంధన వాడకాన్ని కనీసం 20 శాతానికి తీసుకురావాలని ఇంధన మంత్రిత్వశాఖ లక్షంగా పెట్టుకుంది. పెరిగిన రేట్లకే ఇథనాల్‌ను ఇప్పుడు చమురు పంపిణీ కంపెనీలు (ఒఎంసి) ఖరీదు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఇథనాల్ ధర ఇప్పుడున్న లీటర్ రై 62.65 పైసలు నుంచి రూ 63.45 పైసలకు పెరుగుతుంది. ఇక సి హెవీ మోలాసెస్ రకపు ఇథనాల్ రేటు ఇంతకు ముందు రూ 45.69 పైసలు కాగా ఇప్పుడు రూ 46.66 పైసలకు చేరుతుంది. బి హెవీ మెలాసెస్ ఉత్పత్తి రకపు ఇథనాల్ రేటు రూ 57.61 పైసలు నుంచి రూ 59.08 పైసలకు పెరుగుతుంది.