Friday, December 20, 2024

మోడీ సౌర సైరన్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశంలో సౌరవిద్యుత్ ఉత్పత్తితో అనుసంధానం చేస్తూ కోటి కుటుంబాలకు నెలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను కేంద్ర ప్రభుత్వం సరఫరా చేయనుంది. ఈ మేరకు గురువారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రి మండలి సమావేశంలో కీలక నిర్ణయానికి ఆమోదం దక్కింది. ఇళ్ల పై కప్పులపై సౌర యూనిట్ల పథకం ‘ పిఎం సూర్యఘర్ ః ముఫ్త్ బిజిలీ యోజన’ పథకాన్ని రూ 75,201 కోట్ల వ్యయ అంచనాలతో కేంద్ర మంత్రి మండలి ఆమోదించింది. కోటి కుటుంబాలను ఈ పథకం లబ్ధిదారులుగా ఎంపిక చేస్తారు. నిర్ణీత లబ్ధిదారులకు సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ఒక్కంటికి రూ 78,000 సబ్సిడీగా ఇస్తారు. అంతేకాకుండా ఈ కోటి కుటుంబాలకు ప్రతి నెలా 300 కోట్ల మేర విద్యుత్‌ను ఉచితంగా వారే వాడుకునే అవకాశం కల్పిస్తారు. ఇదే ఈ సూర్య శక్తి పథకం అసలు ఉద్ధేశం. లోక్‌సభ ఎన్నికలకు ముందు బిజెపి సారధ్యపు కేంద్ర ప్రభుత్వం పలు వర్గాలను ఆకట్టుకునే రీతిలో ఇతరత్రా కూడా పలు నిర్ణయాలు తీసుకుంది.

కాగా ఎన్నికల షెడ్యూల్ ముందు కేంద్ర మంత్రి మండలి ప్రత్యేక సమావేశం మార్చి 3వ తేదీన జరుగుతుంది. దీనికి ముందు గురువారం ఇప్పుడు జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు ఇతరత్రా కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. కేబినెట్ భేటీ తరువాత కేంద్ర సమాచార ప్రసారాల మంత్రి అనురాగ్ ఠాకూర్ విలేకరుల సమావేశంలో కేబినెట్ నిర్ణయాలను ప్రకటించారు. దేశంలో ఇంధన వనరుల రంగంలో ఇతోధిక స్వయం సమృద్ధికి అనువుగా సౌరశక్తి పథకం ప్రధాని మోడీ ఆలోచనల ఆవిష్కరణ క్రమంలో తీసుకువచ్చినట్లు, దీని లబ్థిదారులకు ఉచిత విద్యుత్ వాడకపు అవకాశం కూడా కల్పించినట్లు తెలిపారు. దీని వల్ల దేశంలో సౌర విద్యుత్ విప్లవం తలెత్తడంతో పాటు, సామాన్య మధ్యతరగతి కుటుంబాలు ఇంధన సమృద్ధి దిశలో దేశ పయనంలో నిర్మాణాత్మక భాగస్వాములు అవుతారని వివరించారు. ఫిబ్రవరి 13వ తేదీన ప్రధాని ఈ స్కీంను లాంఛనంగా ఆరంభించిన విషయాన్ని గుర్తు చేశారు.

పథకం వివరాలు సబ్సిడీ లెక్కలు
ఇప్పుడు అధికారికంగా కోటి కుటుంబాల ప్రమేయంతో అమలులోకి వచ్చే ఈ పథకం రెండు రకాల యూనిట్ల సౌర విద్యుత్ ఉత్పాదన యూనిట్లను ఖరారు చేశారు. 2 కెడబ్లు సామర్థపు సౌర శక్తి ఉత్పాదన యూనిట్‌కు కేంద్రం తరఫున ఇచ్చే ఆర్థిక సాయం (సిఎఫ్‌ఎ) 60 శాతం వరకూ ఉంటుంది. కాగా 3 కిలోవాట్ల వరకే ఈ సిఎఫ్‌ఎను వర్తింపచేస్తారు. 1 కెడబ్లు సిస్టమ్‌కు రూ 30000 సబ్సిడీ ఉంటుంది. రెండు యూనిట్ల వారికి రూ 60వేలు, దీనికి మించి ఉత్పత్తి సామర్థపు సౌరశక్తి యూనిట్లకు రూ 78,000 సబ్సిడీ ఉంటుందని మంత్రి తెలిపారు. నేషనల్ పోర్టల్ ద్వారా కుటుంబాల వారు సబ్సిడీకి దరఖాస్తు చేసుకుంటే , అర్హులను ఎంపిక చేసుకుని వారి ఇండ్లపై సోలార్ టవర్స్ ఏర్పాటుకు వీలేర్పడుతుంది. ఇక సోలార్ ప్లాంట్ల ఏర్పాటు విషయంలో సాంకేతిక సాయాన్ని కూడా ఈ పోర్టల్ అందిస్తుంది.

ప్లాంట్ల ఏర్పాటుకు అవసరం అయ్యే పనిముట్లకు సంబంధించి కూడా జమానత్ లేని విధంగా తక్కువ వడ్డీతో కూడిన రుణాలు మంజూరు చేస్తారు. ఇది దాదాపు 7 శాతం వరకూ ఉంటుంది. ఈ స్కీంలో భాగంగా ప్రతి జిల్లాలో ఓ ఆదర్శ సౌర గ్రామం ఏర్పాటు చేసుకునేందుకు ప్రోత్సాహం అందిస్తారు. గ్రామీణ ప్రాంతాలలో మరింత ఎక్కువ సంఖ్యలో ఇటువంటి ప్లాంట్లు ఏర్పాటుకు దీని వల్ల వీలేర్పడుతుందని మంత్రి ఈ పథకం వివరాలను తెలిపారు. ఆయా ప్రాంతాలలో ఏర్పాటు అయ్యే సౌర విద్యుత్ కేంద్రాల వల్ల పట్టణ స్థానిక సంస్థలు, పంచాయతీరాజ్ విభాగాలు కూడా ఈ సౌరశక్తిని తగు విధంగా వాడుకునేందుకు వీలేర్పడుతుంది. ఆయా సంస్థలు కూడా తమతమ ప్రాంతాలలో సోలార్ ప్లాంట్ల ఏర్పాట్లకు తగు విధంగా ప్రజలలో చైతన్యం కల్పించేందుకు అవకాశం ఏర్పడుతుంది.

అన్నదాతలకు ఎరువుల సబ్సిడీ.. డిఎపి ఎరువు ఇకపై కూడా రూ 1350కే

దేశంలోని వ్యవసాయదారులను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఎరువు సబ్సిడీ నిర్ణయం కూడా తీసుకుంది. మంత్రి మండలి ఆమోదించిన వాటిలో ఖరీఫ్ సీజన్‌కు ఫాస్పేట్, పొటాసియం (పికె) ఎరువులకు రూ 24,420 కోట్ల మేర సబ్సిడీని ఖరారు చేసే నిర్ణయానికి ఆమోదం తెలిపారు. ఇక భూసార పౌష్టికంగా వాడే డిఎపి ఇకపై కూడా క్వింటాలుకు రూ 1,350గా కొనసాగుతుంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ఠాకూర్ విలేకరులకు చెప్పారు. డిఎపితో పాటు ఇతరత్రా పికె ఎరువులకు కూడా ఇప్పటి ధరలే ఉంటాయి. 202425 ఖరీఫ్ పంటకాలం అంటే ఎప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకూ ఈ ధరల వర్తింపు కొనసాగుతుంది. ఇప్పుడు 50 కిలోల డిఎపి ఎరువు మార్కెట్‌లో రూ 1350కే విక్రయిస్తున్నారు. ఈ ధరలే కొనసాగుతాయి. తమ ప్రభుత్వం పూర్తిగా రైతు మిత్రత్వ పద్థతినే పాటిస్తుందని దీనికి అనుగుణంగానే రైతులకు పోటాషియం ఇతరత్రా ఎరువులను తక్కువ ధరలకే విక్రయించడం జరుగుతుందని మంత్రి తెలిపారు.

రూ 1.26 లక్షల కోట్ల మేర చిప్ తయారీ యూనిట్లు
దేశంలో మూడు సెమికండక్టర్ యూనిట్ల ఏర్పాటుకు సంబంధించిన నిర్ణయానికి కూడా కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా పలు సంస్థలు సాంకేతిక వినూత్నతకు ఉపకరించే చిప్‌ల తయారీకి దిగుతాయి. ఈ విధంగా దేశవ్యాప్తంగా మొత్తం విలువ రూ 1.26 లక్షల కోట్ల విలువైన చిప్ యూనిట్ల తయారీకి వీలేర్పడుతుంది. ఇప్పుడు ఈ చిప్ తయారీకి దిగే సంస్థలలో టాటా గ్రూప్, జపాన్‌కు చెందిన రెనెసస్ కూడా ఉన్నాయి. మొత్తం మూడు యూనిట్ల పెట్టుబడి విలువ రూ 1.26 లక్షల కోట్లు వరకూ ఉంటుంది. చిప్‌ల అవసరాలు పెరుగుతూ ఉండటంతో ఇతరదేశాలపై ఆధారపడటం తగ్గించుకునే క్రమంలోనే ఈ చిప్‌ల యూనిట్లకు ప్రాధాన్యత ఇచ్చినట్లు కేంద్ర మంత్రి తెలిపారు.

మూడు యూనిట్లు ప్రధానంగా డిఫెన్స్, టెలికం రంగాలకు సబంధించి చిప్‌లను రూపొందించాల్సి ఉంటుంది. నిర్మాణ ఉత్పత్తి లక్షం 100 రోజులుగా ఖరారు చేశారని మంత్రి తెలిపారు. ఈ మూడు యూనిట్లను దేశంలోని సెమికండక్టర్ల అభివృద్ధి ఇతరత్రా కార్యక్రమాల పరిధిలో ప్రారంభిస్తారు. కాగా ఈ యూనిట్లకు ప్రభుత్వం నుంచి రూ76,000 కోట్ల మేర సాయం ఉంటుంది. టాటాకు చెందిన టిసాట్ అసోంలోని మోరిగాన్‌లో ఓ యూనిట్‌ను ఆరంభిస్తుంది. కాటా టాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేటు లిమిటెడ్ సెమికండక్టర్ ఫ్యాబ్‌ను తైవాన్ కంపెనీ సహకారంతో గుజరాత్‌లోని ఢొలేరాలో చేపడుతుంది. ఇక మూడో యూనిట్‌ను ధాయ్‌లాండ్‌కు చెందిన స్టార్స్ మైక్రోఎలక్ట్రానిక్స్ సంస్థ గుజరాత్‌లోనే సనంద్‌లో ప్రారంభిస్తుంది.

పులుల సంరక్షణకు ఐబిసిఎ ఏర్పాటు
పులులు ఇతరత్రా చిరుత జాతి వన్యప్రాణుల పరిరక్షణకు ప్రపంచస్థాయి వ్యవస్థ అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలయెన్స్ ( ఐబిసిఎ) ఏర్పాటుకు కేంద్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. భారతదేశం ప్రధాన కేంద్రంగా ఉండే ఈ బిగ్‌క్యాట్ అలయెన్స్ బహుళజాతి , బహుళ సంస్థల ప్రాతినిధ్యపు సంస్థగా ఉంటుంది. పులుల సంఖ్య ఎక్కువగానే ఉండే మొత్తం 96 దేశాల కూటమిగా ఈ వ్యవస్థ పనిచేస్తుంది. ఈ ప్రాణులను కాపాడేందుకు అవసరం అయిన ఉమ్మడి వేదికగా పనిచేస్తుందని కేంద్ర మంత్రి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News