Monday, December 23, 2024

పిఎం విద్యాలక్ష్మి పథకానికి కేంద్రం ఆమోదం

- Advertisement -
- Advertisement -

ప్రతిభావంతులైన విద్యార్థులకు కేంద్రం శుభవార్త చెప్పింది. పిఎం విద్యాలక్ష్మి పథకానికి కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోద ముద్ర వేసింది. నాణ్యమైన ఉన్నత విద్య అభ్యసించడంలో ఆర్థిక వనరుల కొరత విద్యార్థులను అడ్డుకోకుండా చూసేందుకు వారికి ఆర్థిక సహాయం అందజేయడం పథకం లక్షమని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఈ పథకం కింద నాణ్యమైన ఉన్నత విద్యా సంస్థల (క్యుహెచ్‌ఇఐలు)లో ప్రవేశం పొందే ఎవరైనా కోర్సుకు సంబంధించిన ట్యూషన్ ఫీజు, ఇతర ఖర్చుల పూర్తి మొత్తానికి బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి హామీ రహిత, గ్యారంటర్ రహిత రుణాలు పొందేందుకు అర్హులు అవుతారు. ‘నాణ్యమైన ఉన్నత విద్య అభ్యసనకు దేశంలోని ఏ యువతనూ ఆర్థిక ఇబ్బందులు నిరోధించకుండా చూసేందుకు ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక సహాయం అందజేసే పిఎం విద్యాలక్ష్మి పథకాన్ని మంత్రివర్గం ఆమోదించింది

’ అని వైష్ణవ్ ఢిల్లీలో విలేకరుల గోష్ఠిలో తెలియజేశారు. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 860 విద్యా సంస్థల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు కేంద్రం హామీతో రూ. 7.50 లక్షల వరకు రుణం లభించనున్నది. రుణంలో 75 శాతం వరకు బ్యాంకులకు కేంద్ర గ్యారంటీ ఇవ్వనున్నది. ఎఫ్‌సిఐలో మూల ధనం అవసరాలకు రూ. 10700 కోట్లు కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు మంత్రి చెప్పారు. పిఎం విద్యాలక్ష్మి పథకం ద్వారా ఏటా 22 లక్షల మందికి పైగా ప్రతిభావంతులైన విద్యార్థులకు లబ్ధి చేకూరనున్నది. ఇది సరళమైన, పారదర్శకమైన విద్యార్థి హిత ప్రక్రియ అని మంత్రి తెలిపారు. రూ. 8 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న వారికి ఈ పథకం వర్తింపచేయనున్నారు. రూ. 10 లక్షల లోపు వరకు రుణాలపై 3 శాతం వడ్డీ రాయితీ కల్పించనున్నారు. ఏదైనా ప్రభుత్వ స్కాలర్‌షిప్ లబ్ధిదారులు ఈ పథకానికి అనర్హులు. విద్యార్థులు పిఎంవిద్యాలక్ష్మి వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News