మన తెలంగాణ/హైదరాబాద్: సెప్టెంబర్ 17ను తెలంగాణ జాతీయ సమైక్యతా దినంగా పాటించాలని రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో జాతీయ సమైక్యత వజ్రోత్స వేడుకలను మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించాలని తలపెట్టింది. శనివారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ అంశంపై ప్రత్యేకంగా చర్చించింది. రాచరిక వ్యవస్థ నుండి ప్రజాస్వామిక వ్యవస్థలోకి జరిగిన తెలంగాణ సమాజ పరిణామక్రమం ఈ నెల 17వ తేదీ నాటికి 75 సంవత్సరాల్లోకి అడుగుపెడుతోంది. ఇందులో భాగంగా ఈ నెల 16, 17, 18 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలను వైభవంగా జరపాలని నిర్ణయించింది.
కాగా 16వ తేదీన రాష్ట్రంలోని అన్ని నియోజక వర్గ కేంద్రాల్లో విద్యార్థులు, యువతీ యువకులు, మహిళలతో భారీ ర్యాలీలు నిర్వహించాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. 17వ తేదీన నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్‌లో సిఎం కెసిఆర్ జాతీయ జండా ఆవిష్కరణాన్ని జిల్లా కేంద్రాల్లో మంత్రులు, మున్సిపాలిటి, పంచాయితీ కేంద్రాల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సంబంధిత అధికారులు ప్రజా ప్రతినిధులు జాతీయ జండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించింది. అదే రోజున బంజారా ఆదివాసీ భవన్‌లను సిఎం కెసిఆర్ ప్రారంభోత్సవం చేసిన అనంతరం నెక్లస్ రోడ్డు నుంచి అంబేద్కర్ విగ్రహం మీదుగా ఎన్టీఆర్ స్టేడియం వరకు భారీ ఊరేగింపు జరపాలని తలపెట్టింది. అక్కడే బహిరంగ సభ నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది. ఈ సభకు సిఎం కెసిఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తారు. ఇక 18వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో స్వాతంత్య్ర సమరయోధులకు సన్మాన కార్యక్రమాలను చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇందులో భాగంగా కవులు, కళాకారులను గుర్తించి సత్కరించాలని ఆదేశించింది. అలాగే తెలంగాణ స్పూర్తిని ఘనంగా చాటేలా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించింది.
Cabinet decided Telangana Integrated day on Sept 17