Sunday, December 22, 2024

మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో అయ్యేనా?

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కా వొస్తున్నా మంత్రివర్గ విస్తరణకు మాత్రం ఇప్పటిదాకా మోక్షం లభించలేదు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అవుతున్న సందర్భంగా ఈ నెల 14 నుంచి ప్రభు త్వం విజయోత్సవాలకు సన్నద్ధం అవుతోంది. వచ్చే నెల డిసెంబర్ 9 వరకు ఈ ఉత్సవాలు కొనసాగనున్నాయి. కనీసం ఆలోగా అయినా మంత్రివర్గ విస్తరణ ఉం టుందా? అని మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లభించని జిల్లాలు, మంత్రిపదవి ఆశిస్తున్న ఆశావాహులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వ చ్చినప్పటి నంచి మంత్రివర్గ విస్తరణ రేపు, మాపు అంటూ ప్రభుత్వ పెద్దలు, పార్టీ కీలక నేతలు అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ కోసం ఢిల్లీ  చుట్టూ చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. కానీ అధిష్ఠానం మాత్రం ప్రతీసారి ఏదో ఒక వంకతో ఎప్పటికప్పుడు వాయిదా వేయడంతో ఆశావాహులు నిరాశలో కూరుకుపోయారు. మొదట్లో పార్లమెంట్ ఎన్నికల తర్వాత అని, ఆ తర్వాత రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గడ్ ఎన్నికల ముగిసాక అని అధిష్ఠానం ఊరిస్తూ వచ్చింది.

కానీఆ ఎన్నికలు కూడా ముగిశాక పీసీసీకి కొత్త అధినేత, మంత్రివర్గ విస్తరణ రెండూ ఒకేసారి ఉండే అవకాశం ఉందని అధిష్ఠానం సంకేతాలు ఇచ్చింది. చివరకు పీసీసీకి కొత్త అధ్యక్షునిగా మహేశ్‌కుమార్‌గౌడ్ నియామకమై (6సెప్టెంబరు) రెండు నెలలు దాటినా మంత్రివర్గ విస్తరణపై అధిష్ఠానం నుంచి ఉలుకు- పలుకు లేదు. అయితే పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ఇటీవల ఢిల్లీలో అధిష్ఠానపెద్దలను కలిసిన త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని మీడియాకు వెల్లడించారు. కానీ ఆ దిశగా అధిష్ఠానం నుంచి ఎలాంటి కదలికలు లేవు. పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ కులగణన కార్యక్రమంపై మేధావివర్గాలతో చర్చించడానికి ఇటీవల హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. ఆ సందర్భంగా అయినా మంత్రివర్గ విస్తరణపై గ్రీన్ సిగ్నల్ ఇచ్చి వెళ్తారేమో అని ఆశావాహులు అంచనా వేసారు. కానీ వారి ఆశలను వమ్ము చేస్తూ రాహుల్‌గాంధీ తన పర్యటనలో అసలు ఆ ఊసే ఎత్తలేదని ఆ పార్టీ వర్గాల సమాచారం.

ఈ అంశాన్ని మంత్రిపదవి ఆశిస్తున్న నేతలు రాష్ట్ర పార్టీ పెద్దలను ఆరా తీయగా, మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు, వయనాడ్ ఉప ఎన్నికలలో ప్రియాంక గాంధీ బరిలో నిలువడంతో పార్టీ పెద్దలు బిజీగా ఉండటంతో వారు తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై దృష్టిసారించలేకపోతున్నారని, ఆ ఎన్నికలు ముగిసిన తర్వాత మంత్రివర్గ విస్తరణకు అవకాశం ఉంటుందని చెప్పినట్టు సమాచారం. ఇలా ఎప్పటికప్పుడు మంత్రివర్గ విస్తరణకు ఏదో ఒక వంకతో అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా దాటవేస్తుందని మంత్రిపదవి ఆశిస్తున్న నాయకుడు ఒకరు వాపోయారు. అయితే మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు, వయనాడ్ ఉప ఎన్నికల ఫలితాలు ఈ నెల 23న వెలువడనున్నాయి. కనీసం ఆ తర్వాత అయినా మంత్రివర్గ విస్తరణ ఉంటుందేమోనని ఆశావాహులు గంపెడాశతో ఉండగా, మరికొందరు మళ్లీ అప్పుడేం సాకు చెబుతారేమో అనిపెదవి విరుస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా నిర్వహించే వేడుకలు డిసెంబర్ 9 దాకా కొనసాగనుండటంతో ఆలోగా అయినా మంత్రివర్గ విస్తరణ ఉండవచ్చని మరి కొందరు అంచనా వేస్తున్నారు.

ప్రాతినిధ్యం లేని జిల్లాలు
రాష్ట్ర మంత్రివర్గంలో ముఖ్యమంత్రితో కలిపి 18 మందికి అవకాశం ఉండగా ప్రస్తుతం 12 మంది మాత్రమే ఉండటంతో ఆరు బెర్త్‌లు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుత మంత్రివర్గంలో నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ నాలుగు ఉమ్మడి జిల్లాలకు ప్రాతినిథ్యం కల్పించలేదు. ఏడాది కిందట ప్రభుత్వం ఏర్పడినప్పుడు హైదరాబాద్ నగరం నుంచి కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు. అయితే ఆ తర్వాత సికింద్రాబాద్ కంటోన్మెంట్‌కు జరిగిన ఉప ఎన్నికలలో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే గెలుపొందిన విషయం తెలిసిందే. కాగా పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ఇవ్వనున్నట్టు సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా ప్రకటించగా, ఇదే ఎన్నికల సందర్భంగా భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే,

తనకు మంత్రిపదవి ఇస్తానని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చినట్టు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పలు సందర్భాలలో వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే రాజగోపాల్‌రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మంత్రివర్గంలో కొనసాగుతుండటంతో రాజగోపాల్‌రెడ్డికి అవకాశాలు తక్కువేనని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాగా ఖాళీగా ఉన్న ఆరు మంత్రి పదవులలో సీఎం తన మాట నిలబెట్టుకొని వాకిటి శ్రీహరికి అవకాశం కల్పించే పక్షంలో మిగతా ఐదు మంత్రి పదవుల రేసులో మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్‌రెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రేమ్‌సాగర్‌రావు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మల్‌రెడ్డి రంగారెడ్డి ఉన్నారు. అలాగే మంత్రివర్గంలో మైనార్టీలకు ప్రాతినిధ్యం లేకపోవడంతో హైదరాబాద్ కోటాలో అవకాశం కల్పించే అవకాశం లేకపోలేదన్న ప్రచారం కూడా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News