ఖాళీగా ఉన్న ఒక్కపోస్టును భర్తీ చేసే అవకాశం
గంప గోవర్ధన్, పట్నం మహేందర్ రెడ్డిల్లో ఒకరికి ఛాన్స్?
మన తెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ మంగళవారం చేపట్టే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. తెలంగాణ అ సెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్ర భుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. మాజీ మం త్రి ఈటల రాజేందర్ బర్తరఫ్‌తో మంత్రివర్గంలో ఖాళీ అయిన స్థానాన్ని భర్తీ చేసే అవకాశం ఉంది. మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, కామారెడ్డి నుంచి ముఖ్యమంత్రి కోసం సీటు త్యాగం చేసిన గంప గోవర్ధన్‌కు కేబినెట్‌లో చోటుదక్కనున్నట్లు తె లుస్తోంది.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే బిఆర్‌ఎస్ అభ్యర్థులను సోమవారం ప్రకటించిన ముఖ్యమంత్రి కెసిఆర్ మంత్రివర్గ విస్తరణకు చేపట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. మాజీ మం త్రి పట్నం మహేందర్ రెడ్డి సోమవారం ముఖ్యమంత్రి కెసిఆర్ కలవడం సర్వత్రా చర్చనీయాంశమయ్యింది. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ప్రభుత్వ వర్గాలు గవర్నర్ తమిళిసై రంగరాజన్ అపాయింట్‌మెంట్ కోరగా, ఆమె సోమవారం పాండిచ్చేరి నుంచి హైదరాబాద్‌కు వచ్చినట్లు తెలిసింది. గవర్నర్ సమయాన్ని బట్టి మంగళవారం లేదా బుధవారం మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉంది.అంతా అనుకున్నట్లుగా జరిగితే మంగళవారం లేదా బుధవారం పట్నం మహేందర్ రెడ్డి మంత్రిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది.