ఆదిలో రూ. 1600 కోట్ల పెట్టుబడితో 2025 2026 కాలంలో ప్రధాన్ మంత్రి కృషి సించాయి యోజన (పిఎంకెఎస్‌వై) ఉప పథకంగా ఆయకట్టు ప్రాంత అభివృద్ధి, నీటి నిర్వహణ ఆధునికీకరణకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలియజేసింది. ఒక నిర్దేశిత క్లస్టర్‌లో ప్రస్తుత కాలువలు లేదా ఇతర వనరుల నుంచి సాగు నీటి సరఫరాకు నీటిపారుదల నెట్‌వర్క్ ఆధునికీకరణ ఈ పథకం లక్షం. ఒక అధికార ప్రకటన ప్రకారం, ఇది భూగర్భంలో ఒత్తిడితో కూడిన పైపులతో నీటిపారుదలో ఒక హెక్టార్ వరకు వ్యవసాయ భూములకు నిర్ధారిత వనరు నుంచి రైతుల ద్వారా సూక్ష్మనీటిపారుదల కోసం పటిష్ఠమైన బ్యాక్‌ఎండ్ మౌలిక వసతుల కల్పనకు దోహదం చేస్తుంది.
నీటిపారుదల వనరుల నిర్వహణ కోసం నీటి వినియోగదారు సొసైటీ (డబ్లుయుఎస్)కి సాగునీటి యాజమాన్య బదలీ (ఐఎంటి) ద్వారా ప్రాజెక్టులకు స్థిరత్వం తీసుకురానున్నట్లు ప్రకటన వివరించింది. ఐదు సంవత్సరాల పాటు ఎఫ్‌పిఒ లేదా పిఎసిఎస్ వంటి ప్రస్తుత ఆర్థిక సంస్థలతో అనుసంధానం కోసం జలవినియోగదారు సంస్థలకు స్థిరమైన భరోసా ఇవ్వనున్నారు. ఆధునిక నీటిపారుదల పద్ధతిని అనుసరించేందుకు వ్యవసాయానికి యువజనులు కూడా ఆకర్షితులు అవుతారని ప్రకటన సూచించింది. రాష్ట్రాలకు సవాలిక నిధుల ద్వారా దేశంలో వివిధ వ్యవసాయ వాతావరణ మండలాల వ్యాప్తంగా పైలట్ ప్రాజెక్టులు చేపట్టడం కోసమే ఈ ప్రాథమిక అనుమతి. ఆ ప్రాజెక్టుల రూపకల్పన, నిర్మాణంలో కలిగిన అనుభవాల ఆధారంగా ఆయకట్టు ప్రాంత అభివృద్ధి, నీటి నిర్వహణకు జాతీయ ప్రణాళికను 16వ ఆర్థిక సంఘం కాలానికి 2026 ఏప్రిల్‌లో ప్రారంభించనున్నట్లు ప్రకటన తెలియజేసింది.
తిరుపతి పాకాల కాట్పాడి సెక్షన్ డబ్లింగ్‌కు క్యాబినెట్ ఆమోదం
ఇది ఇలా ఉండగా, సుమారు రూ. 1332 కోట్ల వ్యయంతో ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడులో 104 కిమీ నిడివి గల తిరుపతి పాకాల కాట్పాడి సింగిల్ రైలు మార్గం సెక్షన్‌ను జంట మార్గాలుగా చేసే పథకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సిసిఇఎ) ఆమోదించిందని ప్రభుత్వం బుధవారం వెల్లడించింది. జంట రైలు మార్గాల వల్ల రవాణా సౌకర్యం పెరిగి, భారతీయ రైల్వేలకు ఇతోధిక సామర్థం, సర్వీస్ విశ్వసనీయత సమకూరుతుంది. బహుళ మార్గాల ప్రతిపాదన వల్ల సర్వీసుల నిర్వహణ మెరుగుపడుతుందని, రద్డీ తగ్గుతుందని, భారతీయ రైల్వేల వ్యాప్తంగా అత్యంత బిజీ సెక్షన్లలో మౌలిక వసతుల అభివృద్ధి జరుగుతుందని ప్రభుత్వం వివరించింది.
‘మల్టీ మోడల్ అనుసంధానత కోసం పిఎం గతి శక్తి జాతీయ బృహత్ ప్రణాళిక ఫలితమే ఈ ప్రాజెక్టు. సమీకృత ప్రణాళిక రచనతో ఇది సాధ్యమైంది. ఇది ప్రజలు, సరకులు, సర్వీసుల రవాణాకు సాఫీగా అనుసంధానం కల్పిస్తుంది’ అని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలియజేసింది. రెండు రాష్ట్రాలు ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడులోని మూడు జిల్లాలకు వర్తించే ఈ ప్రాజెక్టు భారతీయ రైల్వేల ప్రస్తుత నెట్‌వర్క్‌ను దాదాపు 113 కిమీ మేర పెంచుతుందని ప్రభుత్వం తెలిపింది. పర్యాటక రంగానికి సంబంధించి ఈ ప్రాజెక్టు ప్రాముఖ్యత గురించి ప్రధానంగా ప్రస్తావించిన ప్రభుత్వం, దేశవ్యాప్తంగా భక్తులు, పర్యాటకులను ఆకర్షిస్తూ తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి అనుసంధానతతో పాటు శ్రీకాళహస్తి శివాలయం, కాణిపాకం వినాయక ఆలయం, చంద్రగిరి కోట వంటి ప్రముఖ ప్రదేశాలకు రైలు సదుపాయం కల్పిస్తుందని వివరించింది. ‘ఈ బహుళ మార్గాల ప్రాజెక్టు సుమారు 400 గ్రామాలు, దాదాపు 14 లక్షల జనాభాకు అనుసంధానతను పెంచుతుంది’ అని ప్రభుత్వం తెలిపింది.