న్యూఢిల్లీ: రూ. 14,903 కోట్లతో డిజిటల్ ఇండియా ప్రాజెక్టును విస్తరించడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి అశ్వినీవైష్ణవ్ తెలిపారు. ఈ ప్రాజెక్టు వల్ల ప్రస్తుతం ఉన్న దాదాపు 5.25 లక్షల మంది ఐటి ఉద్యోగుల నైపుణ్యాన్ని మరింత పెంపొందించేలా శిక్షణ కల్పించడానికి వీలవుతుంది. వీరితోపాటు ఈ రంగం లోని మరో 2.65 లక్షల మందికి సమగ్రమైన శిక్షణ కల్పిస్తారు. ఈ పథకంలో చెప్పుకోతగిన మరో అంశం నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ (ఎన్‌సిఎం) కింద అదనంగా తొమ్మిది సూపర్ కంప్యూటర్‌లను చేర్చుకుంటారు.
దీంతో ఎన్‌సిఎం కింద ఉన్న సూపర్ కంప్యూటర్ల సంఖ్య 27కు పెరుగుతుంది. దీనివల్ల కంప్యూటరింగ్‌లో అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం విస్తరిస్తుంది. సైంటిఫిక్, టెక్నలాజికల్ ఆవిష్కరణలు వేగవంతం అవుతాయి. సాంకేతిక మౌలిక సౌకర్యాలు , నైపుణ్యాలు ఇంకా అభివృద్ధి చెందడానికి దోహదం కలుగుతుంది. ఇప్పటికే ఈ పథకం కింద 18 సూపర్ కంప్యూటర్లను చేర్చడమైందని మంత్రి తెలిపారు. పరిశోధన, సాంకేతిక ఆవిష్కరణ, డేటాతో కూడిన అంశాలు వివిధ పరిశ్రమలు, సంస్థల్లో విస్తరించాయి.