Sunday, January 19, 2025

ఆరు గ్యారంటీలపై కసరత్తు

- Advertisement -
- Advertisement -

ప్రజాపాలనపై ప్రత్యేక వెబ్ సైట్ ఆవిష్కరణ

నెల రోజుల కాంగ్రెస్ పరిపాలన, ఆరు గ్యారంటీల అమలు,
లబ్ధిదారుల ఎంపిక, అర్హులకు సాయం అందించడంపై చర్చ

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నెల రోజులు పూర్తయిన సందర్భంగా నేడు కేబినెట్ భేటీ జరుగనుంది. ముఖ్యంగా నెల రోజుల కాంగ్రెస్ పరిపాలన, ఆరు గ్యారంటీల అమలుపై ఈ సమావేశంలో చర్చ జరుగనుంది. ఆరు గ్యారెంటీల్లోని రెండు గ్యారెంటీల అమలుపై ఈ భేటీలో ప్రధాన అజెండాగా చర్చించున్నట్టుగా సమాచారం. అదేవిధంగా పలు కీలక అంశాలు ఈ భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. శనివారంతో ప్రజా పాలన కార్యక్రమం ముగియడం, 5 గ్యారంటీలకు పెద్ద ఎత్తున దరఖాస్తులు రావడం, 100 రోజుల్లోనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని రేవంత్ ప్రభుత్వం ప్రకటన చేయడంతో ఈ కేబినేట్ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. అర్హులైన లబ్ధిదారులకే ఆరు గ్యారంటీలను ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే త్వరలోనే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభించి అర్హులకు సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఆదాయం, అప్పుల గురించి….
ఇప్పటికే రాజకీయాలకు అతీతంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అందులో భాగంగా అర్హుల ఎంపికకు చేపట్టాల్సిన పలు అంశాల గురించి కూడా ఈ భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. దీంతోపాటు జాబ్ క్యాలెండర్‌పైనా కేబినెట్ మీటింగ్‌లో చర్చించే అవకాశం ఉన్నట్టుగా సమాచారం.

ఈ డిసెంబర్ నెలాఖరులోగా రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలన్న కృతనిశ్చయంతో ఉన్న ప్రభుత్వం  ఫిబ్రవరి నెలాఖరులోగా దాదాపు 20 వేలకు పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేయాలని భావించడం, దీనికి తోడు టిఎస్‌పిఎస్సీ చైర్మన్‌తో పాటు నూతన సభ్యులను నియమించడం లాంటి ప్రక్రియలకు సంబంధించి ఈ భేటీలో చర్చించనున్నట్టుగా తెలిసింది. దీంతోపాటు కార్పొరేషన్ పదవుల భర్తీ, కేబినెట్ విస్తరణకు సంబంధించిన విషయాలతో పాటు ఈ నెలరోజుల్లో ప్రభుత్వం చేపట్టిన రెండు పథకాలు వాటి అమలుతీరు, రానున్న రోజుల్లో ప్రభుత్వం నడవడానికి కావాల్సిన నిధుల గురించి, ప్రభుత్వానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులను ఎలా రాష్ట్రానికి తీసుకురావాలన్న దానిపై చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. వీటితో పాటు మంత్రుల శాఖలో ఉన్న ఇబ్బందులు, రాబడులు, ఆదాయంపై ఈ భేటీలో చర్చించే అవకాశం ఉన్నట్టుగా సమాచారం.

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News