Friday, November 22, 2024

రేపు కేబినేట్ భేటీ.. కీలక విషయాలపై చర్చ

- Advertisement -
- Advertisement -

గవర్నర్ తిప్పి పంపిన బిల్లులపై తదుపరి కార్యాచరణ
మెట్రోరైల్ ఫేజ్ -2కు అనుమతి, పలు కీలక బిల్లులపై చర్చించనున్న రాష్ట్ర మంత్రిమండలి
మానవీయకోణంలో తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలకు భద్రత కల్పించేలా కొత్త పాలసీకి ఆమోదం?

హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ భేటీ జరగనుంది. పలు కీలక బిల్లులకు ఆమోదం తెలపడంతో పాటు గవర్నర్ తిప్పి పంపిన నాలుగు బిల్లులు, వాటి విషయంలో తదుపరి కార్యాచరణ ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో.. అందుకు సన్నాహక ప్రణాళికపైనా కేబినెట్‌లో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లడం, సమర్థంగా పథకాలు, కార్యక్రమాలు అమలు చేసి..లబ్ది చేకూర్చడం వంటి వాటిపై మంత్రులకు సిఎం మార్గనిర్దేశం చేయనున్నట్లు సమాచారం. బుద్వేల్‌లోని ప్రభుత్వ భూమిని వేలం వేసేందుకు హెచ్‌ఎండిఎకు అనుమతి, ఒఆర్‌ఆర్ వెంట మెట్రోరైలు, మరో 5 కొత్త మెట్రోలైన్ కారిడార్లకు సూత్రప్రాయంగా ఆమోదించనున్నట్లు తెలిసింది. అలాగే మెట్రో ఫేజ్ 2 బిహెచ్‌ఇఎల్ నుంచి లకిడికపూల్ వరకు, నాగోల్ నుంచి ఎల్‌బి నగర్ మెట్రోరైలు పొడిగింపుపై చర్చించనున్నట్లు సమాచారం.

మహబూబాబాద్‌లోని మల్యాలలో హార్టికల్చర్ కళాశాల మంజూరుకు కేబినెట్ తెలపనున్నట్లు తెలిసింది. నిమ్స్ అంచనా వ్యయం రూ.1571 కోట్ల నుండి రూ.1698 కోట్లకు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర రుణం తీసుకోవడానికి కేబినెట్‌లో చర్చించి ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. వరంగల్ నగర శివార్‌లో ఉన్న మమ్నూర్ విమానాశ్రయం అభివృద్ధి టెర్మినల్ భవనం నిర్మాణం కోసం అదనపు భూములను సేకరించడం, ప్రస్తుత రన్‌వే పొడిగింపునకు కేబినెట్‌లో చర్చించనున్నట్లు తెలిసింది. కొత్త మండలాలు, గ్రామపంచాయతీలు, మునిసిపాలిటీలకు అనుమతిపై చర్చించనున్నట్లు తెలిసింది. గచ్చిబౌలిలోని వసంత ప్రాజెకట్స్ ప్రైవేట్ లిమిటెడ్ జాయింట్ వెంచర్ ప్రాజెక్ట్‌పై క్యాబినెట్ సబ్ కమిటీ సిఫార్సుల అమలుపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నట్లు తెలిసింది. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ క్వార్టర్స్, గెస్ట్‌హౌస్, ఫెలిసిటేషన్ సెంటర్ నిర్మాణానికి మార్కెట్ విలువ ప్రకారం చదరపు గజానికి రూ.1.50 లక్షల చొప్పున షేక్‌పేటలోని 1000 చదరపు గజాల భూమిని కేటాయింపుపై చర్చించనున్నట్లు తెలిసింది. విద్యుత్ కొనుగోలు బకాయిలు, లోన్లకు రూ.5 వేల కోట్లకు ప్రభుత్వం హామీ ఉండటం తదితర అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు.
భారీ వర్షాలు, ప్రభుత్వలపై సమీక్ష
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలు, సంబంధిత అంశాలు, ప్రభుత్వ చర్యలపై మంత్రివర్గం సమీక్షించనుంది. అకాల వర్షాల నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ రంగంలో తలెత్తిన పరిస్థితులపై అంచనా వేస్తూ.. అనుసరించాల్సిన ప్రత్యామ్నాయ వ్యవసాయ విధానాలపై కూడా కేబినెట్ చర్చించనుంది. రాష్ట్రంలో ఉద్ధృతంగా వాగులు, వంకలు పొంగిపొర్లి రోడ్లు తెగిపోవడం, రవాణా మార్గాలకు జరిగిన నష్టంపై కూడా మంత్రివర్గం అంచనా వేయనుంది. యుద్ధ ప్రాతిపదికన రోడ్లను తిరిగి పునరుద్ధరించడం కోసం చేపట్టనున్న చర్యలపై మంత్రివర్గం చర్చించనుంది. అలాగే టిఎస్‌ఆర్‌టిసికి సంబంధించిన అంశాలపై కేబినేట్‌లో చర్చించనున్నారు. ఆర్‌టిసి ఉద్యోగులకు జీతభత్యాల పెంపు, ఇతర తదితర అంశాలపై చర్చించి మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, పురోగతి, తీసుకోవాల్సిన చర్యలు, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, రాజకీయపరమైన అంశాలు సహా ఇతర అంశాలపై చర్చ జరగనుంది.
వైద్య బిల్లులపై చర్చ
రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాల్లో తెలంగాణ అల్లోపతిక్ హెచ్‌డబ్లూ అండ్ ఎఫ్‌డబ్లూ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ (రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యులేషన్) చట్టం, 2002 (2002 చట్టం 13) రద్దు కోసం బిల్లును ప్రవేశపెట్టడానికి అనుమతి, తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హెచ్‌డబ్లూ అండ్ ఎఫ్‌డబ్లూ చట్టం, 2022 కోసం బిల్లును ప్రవేశపెట్టడానికి అనుమతి-పై మంత్రిమండలి సమావేశంలో చర్చించనున్నారు.
అనాథ పిల్లల కోసం కొత్త పాలసీ
రాష్ట్రంలో అనాథ పిల్లల జీవన ప్రమాణాల మెరుగుపరిచి, వారి భవిష్యత్‌కు భద్రత కల్పించాలనే సంకల్పంతో ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకురానున్నట్లు తెలిసింది. మానవీయకోణంలో తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలను ఆర్థికంగా బలోపేతం చేసి, వారి పెళ్లిళ్లు కూడా ప్రభుత్వమే చేసేలా కొత్త పాలసీని తీసుకువచ్చే అంశంపై రాష్ట్ర మంత్రిమండలి చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News