Sunday, January 19, 2025

పోచారం శ్రీనివాస రెడ్డికి కేబినెట్ హోదా

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం
తెలంగాణ డెయిరీ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ చైర్మన్‌గా గుత్తా అమిత్‌రెడ్డి
తెలంగాణలో ఆరుగురు ఐఎఎస్ అధికారుల బదిలీ
జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఆమ్రపాలికి పూర్తి బాధ్యతలు
ఆమ్రపాలికి అదనపు బాధ్యతలు తొలగింపు
మూసీ రివర్ డెవలప్ మెంట్ ఎండీగా దాన కిషోర్
హెచ్‌ఎండిఏ మేనేజింగ్ డైరెక్టర్‌గా సర్ఫరాజ్ అహ్మద్
కరీంనగర్ మున్సిపల్ కమిషనర్‌గా చాహత్ బాజ్ పాయ్
మన తెలంగాణ / హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో చేరిక సందర్భంగా బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. అంతకు ముందు చెప్పినట్లుగానే ఆయనకు తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడిగా నియమించి, కేబినెట్ హోదాను కల్పించారు. అలాగూ గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తరఫున టికెట్ ఆశించి భంగపడిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్‌రెడ్డిని తెలంగాణ డెయిరీ కో-ఆపరేటివ్ ఫెడరేషన్‌కు చైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పార్లమెంట్ ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న బీఆర్‌ఎస్‌లో ఉంటే తనతో పాటు కుమారుడి రాజకీయ భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకం అవుతుందనే ఉద్దేశంతో పోచారం సొంతగూటికి వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు.

ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీలోకి రావాలంటూ ఆహ్వానించారు. దీంతో ఆయన జూన్ 21న సీఎం రేవంత్, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. చేరిక సమయంలో పార్టీలో సముచిత గౌరవం కల్పిస్తామని, కేబినెట్ హోదా పదవి ఇస్తామని కూడా హామీ ఇచ్చారు. అదేవిధంగా బీఆర్‌ఎస్ నుంచి మునుగోడు టికెట్ ఆశించిన గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్‌కు కేసీఆర్ మొండిచేయి చూపించారు. దీంతో తీవ్ర ఆసంతృప్తితో కొన్నాళ్ల పాటు సైలెంట్‌గా ఉన్న అమిత్ అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన చేరికను బీఆర్‌ఎస్‌లో కొనసాగుతున్న తండ్రి గుత్తా సుఖేందర్ రెడ్డి సైతం సమర్ధించారు. అయితే ఇచ్చిన మాట మేరకు పోచారంకు కేబినెట్ హోదాచ గుత్తా అమిత్ భవిష్యత్తును దృష్టిలో పెట్టకుని కార్పొరేషన్ పదవి ఇవ్వడం పట్ల రేవంత్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారనే టాక్ కాంగ్రెస్ పార్టీలో మారుమోగుతోంది.

ఆమ్రపాలికి అదనపు బాధ్యతలు తొలగింపు: ఐఏఎస్ ఆమ్రపాలికి ఉన్న అదనపు పోస్టులను తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హెచ్‌ఎండిఏ జాయింట్ కమిషనర్, మూసీ రివర్ బోర్డ్‌కు ఎండీ, గ్రోత్ కారిడార్‌కు ఎండీగా ఉన్న పోస్టులను తొలగిస్తూ జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఆమ్రపాలి పూర్తి స్థాయి బాధ్యతలను రేవంత్ రెడ్డి సర్కార్ అప్పగించింది. ఇక మీదట జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఆమ్రపాలి పూర్తి స్థాయిలో పని చేయనున్నారు. నగర ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు పెరిగిపోతుండటం,హైదరాబాద్‌పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టడంతో ఆమ్రపాలికి ఉన్న అదనపు పోస్టులను తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌lగా ఆమ్రపాలి సిటీలోని పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం పరిధిలో పని చేస్తున్న ఐఏఎస్ అధికారిణి అమ్రపాలి ఇటీవల రాష్ట్ర సర్వీసులకు వచ్చిన విషయం విదితమే.

ఆరుగురు ఐఎఎస్ అధికారుల బదిలీ: తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఆమ్రపాలి కాటా, హెచ్‌ఎండీఏ జాయింట్ కమిషనర్‌గా కోట శ్రీవాత్స, మూసీ రివర్ డెవలప్ మెంట్ ఎండీగా దాన కిషోర్, హెచ్‌ఎండబ్లుఎస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా మయాంక్ మిట్టల్, హెచ్‌ఎండిఏ మేనేజింగ్ డైరెక్టర్‌గా సర్ఫరాజ్ అహ్మద్, కరీంనగర్ మున్సిపల్ కమిషనర్‌గా చాహత్ బాజ్ పాయ్‌ను ప్రభుత్వం నియమించింది. చాహత్ బాజ్ పాయ్ ఐటీడీఏ పీవోగా కూడా గతంలో పనిచేశారు. అసిఫాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా కూడా విధులు నిర్వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News