Friday, November 15, 2024

నేతలకు క్రీడా పదవులు ఉండొద్దు

- Advertisement -
- Advertisement -

Cabinet sub-committee meeting on new sports policy

నేను కూడా ఆ పదవులకు రాజీనామా చేస్తా
రాష్ట్రంలో కొత్త క్రీడా విధానం భేష్
ప్రాథమిక పాఠశాల నుంచి క్రీడలపై ఆసక్తి
కల్పించాలి : కేబినెట్ సబ్ కమిటీ
సమావేశంలో మంత్రి కెటిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్ : కొత్త క్రీడా విధానం సమగ్రంగా ఉందని, ఇది దేశంలోనే అత్యుత్తమ విధానం అవుతుందని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. మంగళవారం కొత్త క్రీడా పాలసీకి సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు కెటిఆర్, శ్రీనివాస్‌గౌడ్, సబితారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావుతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ క్రీడా పాలసీలో కొన్ని మార్పులు అవసరం ఉందన్నారు. ప్రాథమిక పాఠశాలల నుంచి క్రీడల పట్ల విద్యార్థులకు ఆసక్తి కలిగించాలన్నారు. కేవలం పని, చదువు మీదే కాదనీ, ఆటలు, ఫిజికల్ ఫిట్‌నెస్, ఫిజికల్ లిట్రసీ మీద తప్పనిసరిగా ధ్యాస ఉండాలన్నారు. హైదరాబాద్‌లో అనేక పాఠశాలలకు ప్లే గ్రౌండ్స్ లేవన్నారు.

రాజకీయ నాయకులకు క్రీడా పదవులే ఉండవద్దు

స్టేట్ ఒలింపిక్ కమిటీతో పాటు ఆల్ గేమ్స్ కమిటీలు రాష్ట్రంలో ఉన్నా అవి ఏమీ చేస్తున్నాయో ఎవరికీ తెలియదన్నారు. వాటి పదవులు రాజకీయ పునరావాస కేంద్రాలు అయ్యాయన్నారు. క్రీడల్లో రాజకీయాల జోక్యం ఉండకూడదన్నారు. రాజకీయ నాయకులకు క్రీడా పదవులే ఉండవద్దని, తాను కూడా తన క్రీడల పదవులకు రాజీనామా చేస్తానని ఆయన తెలిపారు. క్రీడా సంస్థలు ప్రభుత్వంతో కలిసి పనిచేసేలా చూడాలని మంత్రి కెటిఆర్ సూచించారు. దీనికి సంబంధించి సమన్వయ సమావేశం నిర్వహించాలన్నారు. జాగింగ్, వాకింగ్ లేకుండా పిల్లలు ఎలా చురుగ్గా ఉంటారని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. గ్రామ, పట్టణ, నగర స్థాయిలో విద్యార్థులకు ఆటల మీద అవగాహన ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఒడిశా రాష్ట్రం ఆటల విషయంలో ప్రణాళికలతో ముందుకెళుతుందని, దేశంలో ఎక్కడా అలా జరగడంలేదన్నారు. అక్కడకు అధికారుల బృందం వెళ్లి పరిశీలించి నివేదిక తయారు చేయాలన్నారు.

అహ్మదాబాద్ వంటి నగరాల్లో క్రికెట్‌పైనే అధిక దృష్టి

అహ్మదాబాద్ వంటి నగరాల్లో అక్కడి ప్రభుత్వం క్రికెట్‌పై ఎక్కువ దృష్టి పెట్టిందని, వాళ్లు కేవలం వ్యాపారం మాత్రమే చేస్తున్నారని మంత్రి కెటిఆర్ ఆరోపించారు. మనరాష్ట్రంలో హాకీ, క్రికెట్ వంటి క్రీడల మీద దృష్టి సారించాలని ఆయన అధికారులకు సూచించారు. దీనికి సంబంధించి ఒక మోడల్‌ను తయారు చేయాలన్నారు. పారా అథ్లెట్స్‌పై ఎక్సైర్‌సైజ్ చేయాలని, దీనికి ప్రభుత్వం తరపున సపోర్ట్ చేస్తామన్నారు.

క్రీడా మౌలిక వసతుల భవన నిర్వహణ సరిగ్గా లేదు

క్రీడా మౌలిక వసతుల భవనం ఉన్నా దానికి తగినట్టుగా నిర్వహణ ఉండటం లేదని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. ఇక్కడ కూడా సమన్వయం అవసరమన్నారు. స్పోర్ట్ యూనిఫాంపై క్యాంపెయినింగ్ జరగాలన్నారు. గ్రామం నుంచి నగరం వరకు అన్ని శాఖల సమన్వయంతో జరగాలని మంత్రి కెటిఆర్ సూచించారు. ప్రైవేటు రంగంలో స్పోర్ట్ యూనివర్సిటీలను ప్రోత్సహించాలని కొరియా దేశంలో ఇలాగే ఉంటుందని దానిని పరిశీలించాలన్నారు. పంచాయతీరాజ్ శాఖ నుంచి గ్రీన్‌బడ్జెట్‌ను ప్రవేశపెట్టినట్టుగానే, స్పోర్ట్ బడ్జెట్ ప్రవేశ పెడదామని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు.

మంచి కోచ్‌లు ఉంటేనే క్రీడాకారుల ప్రతిభ వెలుగులోకి….

మంచి కోచ్‌లు ఉంటే మంచి క్రీడాకారులు వస్తారని, క్రీడాకారులు మాత్రమే కాదనీ, కోచ్‌లను గుర్తించి, గౌరవించాలని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. గాంబ్లింగ్, బెట్టింగ్‌ల మీద సిఎం కెసిఆర్ సీరియస్‌గా ఉన్నారని దీనిపై అధికారులు దృష్టి సారించాలని మంత్రి కెటిఆర్ తెలిపారు. క్రీడాపాలసీలో దీనికి సంబంధించి విధి, విధాలను స్పష్టంగా రాయాలన్నారు. స్విమ్మింగ్‌ను గ్రామాల్లో ప్రోత్సహించాలని మంత్రి కెటిఆర్ సూచించారు. ఛాంపియన్స్ ఎక్కడి నుంచో రారని, మనమే తయారు చేయాలన్నారు.

ఫిజికల్ ఫిట్‌నెస్‌పై అవగాహన పెంచుకోవాలి

వ్యక్తిగత ఆటల్లో మన రాష్ట్రం నుంచి అనేక మంది ప్రతిభ ఉన్నవారు ఉన్నారని, ఎవరైనా క్రీడా సంస్థలు పెడితే, వాళ్లకు మన క్రీడా విధానం వల్ల మాత్రమే లాభం జరగాలని మంత్రి కెటిఆర్ సూచించారు. అందరూ ఫిజికల్ ఫిట్ నెస్ అవగాహన పెంచుకోవాలని అందులో అందరినీ భాగస్వాములను చేసే విధంగా క్రీడా విధానం ఉండాలని మంత్రి కెటిఆర్ సూచించారు. సిఎం కెసిఆర్ సాధ్యమైనంత త్వరగా కొత్త సమగ్రమైన క్రీడా విధానాన్ని అమల్లోకి తీసుకురావడంతో పాటు దేశానికి ఆదర్శంగా ఉండాలని సూచించారని ఆయన తెలిపారు.

స్థలాన్ని దుర్వినియోగం చేస్తున్నారు: మంత్రి శ్రీనివాస్‌గౌడ్

మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఖాళీ స్థలాల వివరాలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తానన్నారు. మంత్రి కెటిఆర్ నానక్‌రామ్‌గూడలో స్నూకర్ కోసం 7 ఎకరాలు ఇచ్చారని, ఒకరు షెడ్డు వేసుకున్నారని, క్రీడా శాఖ ద్వారా తీసుకున్న భూములను కొంతమంది ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు దుర్వినియోగం చేస్తున్నారని, వాటిని వెంటనే స్వాధీనం చేసుకోవాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచించారు. సిఎం కెసిఆర్ కప్‌ను జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో నిర్వహించాలని ఆయన సూచించారు.

కరోనాతో స్పోర్ట్ నిర్వహించడం లేదు: మంత్రి సబిత

మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ స్కూల్స్‌లో కరోనా కారణంగా స్పోర్ట్ లేకుండా పోయాయని మంత్రి ఆవేదన వ్యక్త చేశారు. గురుకులాల్లో స్పోర్ట్, ప్రైవేటు స్కూల్స్ ప్లే గ్రౌండ్స్‌కు ఇన్సెంటివ్స్ ఇస్తే బాగుంటుందన్నారు. స్టేడియం నిర్వహణ భారంగా మారుతుందని అలాకాకుండా చూడాలని ఆమె విజ్ఞప్తి చేశారు. జిహెచ్‌ఎంసి ఇండోర్ స్టేడియం నిర్వహణ బాగాలేదన్నారు. మైలార్ దేవ్‌పల్లిలో స్టేడియం కాంప్లెక్స్‌ను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. క్రీడలను పాఠ్యాంశంగా తీసుకురావాలని, వికలాంగులకు ప్రోత్సాహాం అందించాలన్నారు.

కేబినెట్ సబ్ కమిటీ అభిప్రాయాలు

గ్రామీణ ప్రాంతాల మంచి క్రీడాకారులు రావాలంటే, స్పోర్ట్ కిట్స్ గ్రామాల్లో యూత్‌కు ఇవ్వాలని మంత్రుల కమిటీ అభిప్రాయాలను వ్యక్తం చేసింది. రాష్ట్రంలో యూత్ మొత్తానికి గ్రామీణ ఉపాధి హామీ పథకంలో గ్రామాల్లో భాగంగా క్రీడా మైదానాల నిర్మాణంలో సహకారాన్ని తీసుకోవాలని కమిటీ పేర్కొంది. క్రీడాశాఖ ద్వారా ప్రోత్సాహం అందించాలని సబ్ కమిటీ సూచించింది. క్రీడా పాలసీలో ఎదురయ్యే సమస్యలను సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకెళ్లాలని కమిటీ నిర్ణయించింది. ప్రతి పాఠశాలలో క్రీడలను తప్పనిసరి చేయాలని పేర్కొంది. అవసరమైతే దీనికి సంబంధించిన కోర్సును డెవలప్‌మెంట్ చేద్దామని కేబినెట్ సబ్ కమిటీ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

మంత్రుల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకుంటాం: సిఎస్

అథ్లెటిక్స్ మరింత ప్రోత్సాహాన్ని అందించాలని కేబినెట్ సబ్ కమిటీ పేర్కొంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం బ్యాడ్మింటన్, టెన్నిస్, బాక్సింగ్, షూటింగ్, రోయింగ్ లాంటి క్రీడల రాజధానిగా దేశంలోనే పేరుగాంచిందన్నారు. అలాగే మిగతా క్రీడల్లోనూ అంతర్జాతీయ స్థాయిలో పేరు తీసుకొచ్చేలా చూడాలని క్యాబినెట్ సబ్ కమిటీ తెలిపింది. వచ్చే సబ్ కమిటీ మీటింగ్‌లో డ్రాఫ్ట్ పాలసీను పూర్తిగా రూపొందించి వచ్చే అసెంబ్లీ సమావేశాల కంటే ముందు కేబినెట్ సమావేశంలో పాలసీని ఆమోదం తీసుకోవాలని శాట్స్ అధికారులకు సబ్ కమిటీ సూచించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News