Friday, November 15, 2024

317 జిఒపై కేబినెట్ సబ్ కమిటీ

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని కొత్త జోన్లు, కొత్త జిల్లాలకు అనుగుణంగా ఉద్యోగుల సర్దుబాటు కోసం ఉద్దేశించిన జిఒ 317పై ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల అభ్యంతరాల దృష్టా మంత్రి దామోదర రాజనర్సింహ అధ్యక్షతన ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్‌గా మంత్రి దామోదర రాజనర్సింహ, సభ్యులుగా మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ ఉన్నారు. 2021లో ఇచ్చిన జిఒ 317, జిఒ 46పై వివాదాలు, ఉద్యోగుల అభ్యంతరాలపై కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి సిఫార్సులు చేయనుంది.
పిఆర్‌టియుటిఎస్ హర్షం
కొత్త జిల్లాలకు అనుగుణంగా ఉద్యోగ, ఉపాధ్యాయుల సర్దుబాటు కోసం గత ప్రభుత్వం జారీ చేసిన జిఒ 317పై ఉద్యోగుల అభ్యంతరాలను అధ్యయనం చేయడానికి రాష్ట్ర ప్రభత్వుం కేబ్‌నెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయడం పట్ల పిఆర్‌టియుటిఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, బీరెల్లి కమలాకర్‌రావులు హర్షం వ్యక్తం చేశారు.
317 జిఒ కారణంగా పలువురు ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోయారు : టిఎస్ యుటిఎఫ్
జిఒ 317 ద్వారా అమలు జరిపిన ఉద్యోగుల విభజనలో ఏర్పడిన సమస్యలను అధ్యయనం చేసి పరిష్కారాలను సిఫారసు చేయటం కోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడం పట్ల తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టిఎస్ యుటిఎఫ్) హర్షం వ్యక్తం చేసింది. రాష్ట్రపతి ఉత్తర్వులు 2018 అమలులో భాగంగా ఉద్యోగుల శాశ్వత కేటాయింపు కోసం గత ప్రభుత్వం జిఒ 317 ద్వారా ఏకపక్షంగా విడుదల చేసిన మార్గదర్శకాల కారణంగా పలువురు ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోయారని సంఘం అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులు కె జంగయ్య, చావ రవిలు పేర్కొన్నారు. భార్యాభర్తలను వేర్వేరు జిల్లాలకు కేటాయించారని అన్నారు. నిబంధనల ప్రకారం భార్యాభర్తలను ఒకే జిల్లాకు బదిలీ చేయాల్సి ఉండగా 19 జిల్లాల్లో అనుమతించి 13 జిల్లాలను బ్లాక్ చేశారని తెలిపారు. మంత్రివర్గ ఉపసంఘం జిఒ 317 అమలు కారణంగా ఉత్పన్నమైన సమస్యలను ఉపసంఘం అధ్యయనం చేసి సత్వరమే సానుకూల పరిష్కారాలను ప్రభుత్వానికి సిఫారసు చేస్తుందని సంఘం అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులు కె జంగయ్య, చావ రవిలు ఆశాభావం వ్యక్తం చేశారు.
జిఒ 46పై నిరుద్యోగులో తీవ్ర వ్యతిరేకత వచ్చింది : బల్మూరి వెంకట్
జిఒ నెంబర్ 46 పై క్యాబినెట్ సబ్ కమిటీ వేయడంపై ఎంఎల్‌సి బల్మూర్ వెంకట్ హర్షం వ్యక్తం చేశారు. ఉద్యోగ నియామకాల్లో జిఒ 46పై నిరుద్యోగులో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని పేర్కొన్నారు. ఈ జిఒ వల్ల గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉందనే వ్యతిరేకత వచ్చిందని అన్నారు. ఈ జిఒ అనేక సందర్భాల్లో అప్పటి ప్రభుత్వానికి తాము సూచనలు,సలహాలు చేసినా పట్టించుకోలేదని చెప్పారు. కానీ ఇప్పుడు ప్రజల ప్రభుత్వం సబ్ కమిటీ వేయడానికి బల్మూర్ వెంకట్ స్వాగతించారు. రానున్న రోజుల్లో నిరుద్యోగులకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారికి ఉద్యోగ అవకాశాలలో ఎలాంటి అన్యాయం జరగకుండా సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ జిఒలో ఉన్న లోటుపాట్లపై కేబినెట్ సబ్ కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలని కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News