Wednesday, January 22, 2025

గుజరాత్‌లో కుప్పకూలిన కేబుల్ బ్రిడ్జి.. 91మంది జల సమాధి

- Advertisement -
- Advertisement -

Cable Bridge Collapses in Gujarat

గుజరాత్‌లో కుప్పకూలిన మోర్బీ కేబుల్ బ్రిడ్జి
40 మంది దుర్మరణం.. నదిలో పడ్డ 500 మంది
100 మందివరకూ జలసమాధి?
ఆదివారం సందర్శకుల తాకిడిలో దుర్ఘటన
ప్రధాని మోడీ వడోదరా పర్యటన రోజే ప్రమాదం

అహ్మదాబాద్: గుజరాత్‌లోని మోర్బీ పట్టణంలో మచ్చూ నదిపై ఉన్న తీగల వంతెన ఆదివారం కుప్పకూలింది. ఈ ఘటనలో దాదాపు 40 మంది మృతి చెందారు. 500మంది వరకూనదిలో పడిపోయారు. వీరి పరిస్థితి ఏమిటనేది వెల్లడికాలేదు. అయితే వీరిలో వంద మందికి పైగా జలసమాధి అయి ఉంటారని ఆందోళన చెందుతున్నారు. ఘటన జరిగిన సమయంలో ఈ వంతెనపై 500 మంది వరకూ ఉన్నారని వెల్లడైంది. ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్‌లోని వడోదరాలో సి 295 రవాణా విమానం తయారీ కేంద్రానికి శంకుస్థాపన చేసిన కార్యక్రమం తరువాత కొద్ది గంటలకే ఈ కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటన జరిగింది. ఈ ప్రాంతంలోకి అనేక సహాయక బృందాలు తరలివెళ్లాయి. అంబులెన్స్‌లలో పలువురిని చికిత్సకు సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఈ బ్రిడ్జి కూలిన ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేందర్ పటేల్ స్పందించారు. తక్షణం అక్కడికి అధికారులు చేరుకుని, సహాయక చర్యలను పర్యవేక్షించాలని, గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించాలని ఆదేశించారు. మోర్బీలో ఈ సస్పెన్షన్ బ్రిడ్జి విరిగిపడ్డ ప్రమాదం తనను కలిచివేసిందని, వెంటనే సహాయక బృందాలు అక్కడికి తరలివెళ్లుతున్నాయని పటేల్ ఓ ప్రకటన వెలువరించారు. నదిలో పడ్డ పలువురు ఈదుకుంటూ గట్టుకు చేరుకుంటున్నప్పటి ఫోటోలు, ఈ ప్రాంతంలో అరుపులు కేకలుతో పరిస్థితి భయానకంగా మారింది. స్త్రీలు పిల్లలు తెగిపడ్డ తీగల వంతెనపై నుంచి వేలాడుతూ నడుం లోతు నీళ్లలో చాలా సేపటివరకూ వెలాడుతూ, చావుబతుకుల మధ్య గడపాల్సి వచ్చింది.

ఈ ప్రాంతానికి హుటాహుటిన స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి అయిన బ్రిజేష్ మీర్జా తరలివెళ్లారు. రవాణా విమానం ప్రాజెక్టు ఇతర పనుల శంకుస్థాపనకు ఆదివారం గుజరాత్‌కు చేరుకున్న ప్రధాని మోడీ ఈ విషయం తెలియగానే సిఎంతో మాట్లాడారు. పరిస్థితిని సమీక్షించారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. మోర్బీకేబుల్ బ్రిడ్జి 140 ఏళ్ల క్రితంబ్రిటిషర్ల కాలంలో మణిమందిర్ వద్ద నిర్మించిన చారిత్రక కట్టడం. ఆరునెలల క్రితం మరమ్మతుల కోసం బ్రిడ్జిని మూసివేసి పనుల తరువాత నాలుగైదు రోజుల క్రితమే ఈ నెల 26న గుజరాతీల సంవత్సరాది పండుగ నేపథ్యంలో తిరిగి రాకపోకలకు అనుమతించారు. ఇప్పుడు ఈ దారి ప్రజలకు ముప్పు తెచ్చిపెట్టింది. దాదాపు రెండు కోట్ల రూపాయల వరకూ వెచ్చించి మరమ్మతు పనులు చేపట్టారు. మరమ్మతు పనుల టెండర్‌ను ఓదవ్‌జీ పటేల్‌కు చెందిన ఒరేవా నిర్మాణ కంపెనీకి అప్పగించారు. దర్బార్ గఢ్ నాజర్ బాగ్‌ను కలుపుతూ నిర్మించిన ఈ తీగల వంతెనను 1879 ఫిబ్రవరి 20న అప్పటి బొంబాయి గవర్నర్ బ్రిటిషరు రిచర్డ్ టెంపుల్ ఆరంభించారు. అయితే నాలుగురోజులకే ఇది కుప్పకూలింది . ఆదివారం ఒకేసారి వందల మంది రావడం, పరిస్థితిని గమనించకుండా అధికారులు వీరిని అనుమతించడంతో బ్రిడ్జి కుప్పకూలిందని వెల్లడైంది. ఘటనా ప్రాంతానికి గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘ్వీ బయలుదేరి వెళ్లారు.
గుజరాత్ ప్రభుత్వానిదే ఈ ప్రమాద బాధ్యత: రాష్ట్ర మంత్రి బ్రిజేష్ మిర్జా
ఇప్పుడు మోర్బీ బ్రిడ్జి కుప్పకూలి పలువురు మృతి చెందిన ఘటనకు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి వ్యవహారాల మంత్రి బ్రిజెష్ మిర్జా తెలిపారు. ఈ వంతెనను మరమ్మత్తుల తరువాత ఇటీవలే తిరిగి సందర్శకుల కోసం తెరిచారు. అయితే ఇప్పుడు ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటన తమకు దిగ్భ్రాంతిని కల్గించింది. అన్ని అంశాలను పూర్తిగా ఆరా తీసుకుని తరువాత స్పందిస్తామని, ముందు సహాయక చర్యలు చేపడుతామని మంత్రి వివరించారు. అయితే గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తూ ఉండటంతో చాలా తొందరపడి పనులు పూర్తికాకుండానే బ్రిడ్జిని తిరిగి సందర్శకుల కోసం ప్రతిష్టకు పాకులాడి తెరిచారని, దీనితో ఈ విషాదం జరిగిందని స్థానిక బిజెపి నేతలే విమర్శించారు.

Cable Bridge Collapses in Gujarat

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News