Friday, November 22, 2024

ఎస్సీ, ఎస్టీ నిధులను దారి మళ్లించారు: కాగ్ నివేదిక విడుదల

- Advertisement -
- Advertisement -

రాబడి కన్నా వ్యయమే అధికం
సాగునీటి ప్రాజెక్టుల పైనే గత ఐదేళ్లలో ఎక్కువ ఖర్చులు
కాళేశ్వరం, మిషన్ భగీరథకే ఎక్కువ వ్యయం
రుణాలు చెల్లించేందుకు కార్పొరేషన్ల పేరుతో కొత్త అప్పులు
15వ ఆర్థిక సంఘం పరిమితి దాటి 6 శాతం ఎక్కువ రుణాలు
ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధులను దారి మళ్లించారు
ఎస్సీ అభివృద్ధి నిధుల్లో 58 శాతం, ఎస్టీలకు సంబంధించి 38 శాతం వినియోగం కాలేదు
గత ఆర్థిక సంవత్సరానికి కాగ్ నివేదిక విడుదల
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో రెవెన్యూ రాబడి కన్నా రెవెన్యూ వ్యయంలో ఎక్కువగా ఉందని కాగ్ నివేదిక పేర్కొంది. సాగునీటి ప్రాజెక్టుల పైనే గత ఐదేళ్లలో ఎక్కువ ఖర్చులు చేశారని తెలిపింది. ఇవాళ 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కాగ్ రిపోర్ట్ అసెంబ్లీలో ముందుకు వచ్చింది. మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టులకు భారీగా ఖర్చు చేసినట్టు పేర్కొంది. తీసుకున్న రుణాలు చెల్లించడానికే ఎక్కువ ఖర్చులు చేసినట్టు పేర్కొంది.

కార్పొరేషన్ల పేరుతో తీసుకున్న రుణాలను మళ్ళీ అప్పులు చెల్లించడానికి వినియోగించినట్టు తెలిపింది. గత ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిర్దేశించిన పరిమితి కన్నా 6శాతం ఎక్కువ రుణాలు తీసుకున్నదని తెలిపింది. గత సంవత్సరం బడ్జెట్ లో పన్నేతర రాబడి అంచనాలు ఎక్కువగా వేశారన్నారు. ఎస్సీ అభివృద్ధి నిధుల్లో 58శాతం, ఎస్టిలో నిధుల్లో 38శాతం వినియోగం కాలేదన్నారు. ఖర్చు అయిన ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధులను దారి మళ్లించారని కాగ్ నివేదిక లో వెల్లడైంది. 2021-22 ఆర్థిక ఏడాదితో పోల్చితే రాష్ట్ర జీఎస్డీపీ 2021- 22తో పోలిస్తే 2022- 23లో 16 శాతం పెరిగిందని కాగ్ పేర్కొంది.

రెవెన్యూ రాబడులు గణనీయంగా 25 శాతం మేర పెరిగాయని తెలిపింది. సొంత పన్నుల రాబడి 17 శాతం పెరిగిందని తెలిపింది. సొంత రాబడి లేని సంస్థలకు ప్రభుత్వం రుణాలు ఏర్పాటు చేసిందని పేర్కొంది. 2022 -23 బడ్జెట్ వెలుపలి రుణాలు రూ.1,18,629 కోట్లుగా అంచనా వేసిందన్నారు. రాష్ట్రాభివృద్ధి రుణాలపై వడ్డీపై ఖర్చును తక్కువగా అంచనా వేశారని తెలిపింది. కేంద్రం నుంచి భారీగా గ్రాంట్లు వస్తాయని అంచనా వేశారని తెలిపింది. ఏపీ నుంచి తెలంగాణ విద్యుత్ కంపెనీలకు బకాయిలు వస్తాయని పేర్కొన్నా రాలేదని తెలిపింది. ఇండ్లు, గొర్రెల పంపిణీ, ఆయిల్ పామ్ పథకాల నిధులు కేటాయించినట్టు చూపించినా ఖర్చు కాలేదని వివరించింది.

ఎజెండాపై ప్రతిపక్ష పార్టీల అసంతృప్తి: శాసనసభ ఎజెండాను అర్ధరాత్రి ఇవ్వడం పట్ల ప్రతిపక్ష పార్టీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఎజెండా ఒకటి ఇస్తున్నారని, సభలో మరొక దానిపై చర్చ నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రస్తావించారు. ఒక్క పొలిటికల్ పార్టీ కోరికల మీద, ఇష్టం మీద అసెంబ్లీ నడవకూడదని, అందరిని పరిగణలోకి తీసుకోవాలని ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ప్రభుత్వానికి సూచించారు. ప్రతి రోజు మాకు ఎజెండా ఒంటి గంటకు వస్తుంది..మొన్న మాత్రం 1:40 గంటలకు వచ్చింది. అప్పుడు వస్తే సబ్జెక్ట్ మీద మేం ఎప్పుడు ప్రిపేర్ కావాలి. 25 ఏండ్ల నా అనుభవంలో ఇలా సభ జరగడం నేను ఎప్పుడు చూడలేదని అక్బరుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News