Monday, January 20, 2025

మహిళా డాక్టర్ హత్య కేసు సిబిఐకి అప్పగించిన కలకత్తా హైకోర్టు

- Advertisement -
- Advertisement -

ఆదిలోనే హత్య కేసు ఎందుకు దాఖలు చేయలేదని ప్రభుత్వానికి ప్రశ్న
అసహజ మరణం కేసు ఎందుకు నమోదు చేశారని అడిగిన కోర్టు
కేసు డైరీ సిబిఐకి అప్పగించాలని కోల్‌కతా పోలీసులకు ఆదేశం
కోల్‌కతా: ఒక మహిళా డాక్టర్‌పై హత్యాచారం కేసు దర్యాప్తును సిబిఐకి బదలాయించాలని కలకత్తా హైకోర్టు మంగళవారం ఆదేశించింది. కేసు డైరీని వెంటనే కేంద్ర దర్యాప్తు సంస్థకు అందజేయాలని, అన్ని ఇతర పత్రాలను బుధవారం ఉదయం 10 గంటలకల్లా అప్పగించాలని కోల్‌కతా పోలీసులను కోర్టు ఆదేశించింది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆర్‌జి కర్ ఆసుపత్రిసెమినార్ హాల్ లోపల హత్యాచారానికి గురైన పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ మృతదేహం శుక్రవారం ఉదయం కనిపించింది. ఈ సందర్భంగా ఒక పౌర వాలంటీర్‌ను శనివారం అరెస్టు చేశారు. సమ్మె విరమించుకోవాలని ఆందోళనకారులైన వైద్యులకుహైకోర్టు విజ్ఙప్తి చేసింది. వారిది ‘పవిత్రమైన బాధ్యత’ అని కోర్టు తెలిపింది.

కాగా, ఆదిలోనే హత్య కేసు ఎందుకు దాఖలు చేయలేదని, అసహజ మరణం కేసు ఎందుకు నమోదు చేశారని హైకోర్టు ప్రశ్నించింది. హత్యపై వెంటనే ఫిర్యాదు ఏదీ రానందున అసహజ మరణం కేసు నమోదు చేసినట్లు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ న్యాయవాది చెప్పినప్పుడు ప్రధాన న్యాయమూర్తి టిఎస్ శివజ్ఞానం ఆయనకు ఆ ప్రశ్న వేశారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ మృతదేశం రోడ్టు పక్కన దొరకలేదని ప్రధాన న్యాయమూర్తి సారథ్యంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆసుపత్రి సూపరింటెండెంట్ గాని, ప్రిన్సిపాల్ గాని ఫిర్యాదు దాఖలు చేసి ఉండవలసిందని బెంచ్ అన్నది. న్యాయమూర్తి హిరణ్మయ్ భట్టాచార్య కూడా బెంచ్‌లో ఉన్నారు. ఈ కేసులో కోర్టు పర్యవేక్షిత దర్యాప్తు కోరుతూ పిజి ట్రైనీ తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు.

కేసుపై సిబిఐ దర్యాప్తు కోరుతూ పలు ఇతర పిల్‌లు కూడా దాఖలయ్యాయి. పిటిషన్లను బెంచ్ విచారిస్తూ, దర్యాప్తులో ‘ఏదో లోటు ఉన్నట్లు కనిపిస్తోంది’ అని వ్యాఖ్యానించింది. అప్పటి వైద్య కళాశాల ప్రిన్సిపాల సందీప్ ఘోష్ వాఙ్మూలాన్ని నమోదు చేశారా అని బెంచ్ ప్రశ్నించగా లేదని ప్రభుత్వ న్యాయవాది సమాధానం ఇచ్చారు. రాజీనామా చేసిన ఆర్‌జి కర్ ఆసుపత్రి ప్రిన్సిపాల్‌ను గంటల వ్యవధిలోనే కలకత్తా జాతీయ వైద్య కళాశాల, ఆసుపత్రి ప్రిన్సిపాల్‌గా ఎలా తిరిగి నియమించారని బెంచ్ ప్రశ్నిస్తూ, రాజీనామా పత్రాన్ని, ఆతరువాతి నియామక పత్రాన్ని సమర్పించాలని ఆయన న్యాయవాదిని కోరింది. ఘోష్‌ను మధ్యాహ్నం 3 లోగా దీర్ఘకాల సెలవుపై వెళ్లవలసిందని ఆయనను కోరవలసిందని, లేనిచో తామే తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని ఆయన న్యాయవాదితో హైకోర్టు చెప్పింది.

హత్య అత్యంత కిరాతకమని, వైద్యులు, ఇంటర్న్‌లు తమ ఆవేదనను వ్యక్తం చేయడం సమర్థనీయమేనని కూడా ప్రధాన న్యాయమూర్తి అన్నారు. పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు, ఇంటర్న్‌లు ఆ ఘటనకు నిరసన వ్యక్తంచేస్తూ, ఆసుపత్రి సిబ్బందికి తగిన రక్షణ కల్పించాలని కోరుతూ మంగళవారం తమ సమ్మె కొనసాగించారు. సమ్మె చేస్తున్న డాక్టర్లతో ప్రభుత్వం చర్చలు జరపాలని హైకోర్టు సూచించింది. ఇది ఇలా ఉండగా, కోల్‌కతా పోలీసులు ఈ కేసులో పారదర్శకంగా దర్యాప్తు సాగిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. పిటిషనర్ల న్యాయవాదులు కొందరు ఆరోపించినట్లుగా సాక్షాధారాలు ధ్వంసం కాకుండా ఎలా చూడగలరని ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించగా, కోల్‌కతా పోలీస్ అదనపు కమిషనర్ (ఐ) పర్యవేక్షణలో డిసిపి ర్యాంక్ అధికారి ఒకరు దర్యాప్తునకు సారథ్యం వహిస్తున్నారని ప్రభుత్వ న్యాయవాది సమాధానం ఇచ్చారు. బెంచ్ ఆదేశం మేరకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కేసు డైరీని మధ్యాహ్నం ఒంటి గంటకు సమర్పించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News