యూజర్లకు ఎప్పటికప్పుడు అధునాతన, మెరుగైన ఫీచర్లను అందించే ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్’ మరొక సరికొత్త ఫీచర్ తీసుకురాబోతున్నది. యూజర్ల కాలింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరచడమే లక్షంగా ‘వాట్సాప్ యాప్’నుంచే సాధారణ కాలింగ్ ఆప్షన్ అందించేందుకు ‘మెటా’ కృషి చేస్తోంది. ఈ మేరకు త్వరలోనే ‘ఇన్ యాప్ డయలర్ ఫీచర్’ను సంస్థ జోడించబోతున్నది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే యూజర్ వాట్సాప్‌లోనే ఉండి, సాధారణ కాల్స్ చేసుకోవచ్చు. కాలింగ్ కోసం యాప్ నుంచి ఎగ్జిట్ కావలసిన అవసరం ఉండదు. నేరుగా వాట్సాప్ నుంచే కాల్స్ చేసుకోవచ్చు. ఈ మేరకు ఆండ్రాయిడ్ 2.24.13.17 అప్‌డేటెడ్ బీటా వెర్షన్‌లో అందుబాటులో ఉందని వాట్సాప్‌బీటా ఇన్ఫో తెలియజేసింది.
వాట్సాప్ యూజర్ యాప్ నుంచి ఎగ్జిట్ కాకుండానే కాల్స్ చేసుకోవచ్చు. ఇందు కోసం యూజర్లు కాంటాక్ట్ బుక్‌ను యాడ్ చేసుకోవలసిన అవసరం కూడా లేదని సంస్థ తెలిపింది. యాప్‌లో కుడి వైపు దిగువన కొత్త ఫ్లోటింగ్ యాక్షన్ బటన్ కనిపిస్తుందని, దీనికి యాక్సెస్ ఇస్తే కాల్స్ సులభంగా చేసుకోవచ్చునని వాట్సాప్ బీటా ఇన్ఫో వివరించింది, కాలింగ్‌తో పాటు మెసేజింగ్ షార్ట్‌కట్ డయలర్ స్క్రీన్ కూడా అందుబాటులోకి వస్తుందని సంస్థ తెలిపింది. పరిశీలన కోసం ఈ ఫీచర్ ప్రస్తుతం కొంత మందికే అందుబాటులో ఉందని, రాబోయే రోజుల్లో మరింత మందికి అందుబాటులోకి వస్తుందని సంస్థ తెలియజేసింది.