మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి: జిల్లాలో శనివారం నిర్వహించిన టి.ఎస్. పి.ఎస్.సి గ్రూప్. 4 పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఈ మేరకు పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ కె. శశాంక పరిశీలించగా, జిల్లా ఎస్‌పి శరత్ చంద్ర పవార్ పోలీసు బందోబస్తును పరిశీంచారు. ఈ మేరకు జిల్లాలో ప్రశాంతమైన వాతావరణంలో సజావుగా జరిగాయని జిల్లా కలెక్టర్ కె. శశాంక తెలిపారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఉదయం, టిఎంఆర్‌ఎస్ బాలుర గురుకుల పాఠశాలలో మధ్యాహ్నం గ్రూప్. 4 పరీక్ష కేంద్రాలను కలెక్టర్ సందర్శించి పరిశీలించారు.
శనివారం జిల్లాలోని 46 పరీక్షా కేంద్రాల్లో ఏర్పాటు చేయగా ఉదయం 10 గంటలకు పేపర్. 1 పరీక్షకు 14,205 మంది అభ్యర్థులకు గాను 11,864 మంది అభ్యర్థులు హాజరు అయ్యారని కలెక్టర్ తెలిపారు. 2341 మంది గైర్హజరు అయ్యారని కాగా మొత్తంగా 83.52 శాతంగా హాజరు నమోదైందని పేర్కోన్నారు. మధ్యాహ్నం 2.30 గంటకు ప్రారంభమైన పేపర్.2 2387 మంది అభ్యర్థులు గైర్హజరు కాగా మొత్తంగా హాజరు 83.19 శాతంగా నమోదైనట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులకు కల్పించిన సౌకర్యాలను కూడా కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ ఇమ్మాన్యుల్, పరీక్షా కేంద్రాల లైజన్ అధికారులు వాసుదేవ్, శోభన్‌బాబు, రాజు, నరేష్ తదితరులున్నారు. అలాగే పరీక్ష జరిగే ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు తీరును, పోలీసు బందొబస్తును జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పట్టణంలోని పలు పరీక్షా కేంద్రాల వద్ద పరిశీలించారు.