Monday, December 23, 2024

గ్రీన్ కోసం అన్ని కోట్లా?

- Advertisement -
- Advertisement -

 ఆశ్చర్యం కలిగిస్తున్న ఆర్‌సిబి నిర్ణయం!

బెంగళూరు: వచ్చే ఐపిఎల్ సీజన్ కోసం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌స్‌బి) రూ.17.5 కోట్లు వెచ్చించి ముంబై ఇండియన్స్ నుంచి ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. గ్రీన్ మంచి ఆల్‌రౌండర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. కిందటి సీజన్‌లో ముంబై అతన్ని రూ.17.5 కోట్లు వెచ్చించి సొంతం చేసుకుంది. గ్రీన్ కూడా తనపై జట్టు యాజమాన్యం ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాడు. 16 మ్యాచుల్లో 50.23 సగటుతో 452 పరుగులు చేశాడు. అంతేగాక ఆరు వికెట్లను కూడా పడగొట్టాడు.

అయినా కూడా అతన్ని విడిచి పెట్టేందుకు ముంబై ఇండియన్స్ ముందుకు వచ్చింది. గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ పాండ్యను తీసుకోవడంతో ముంబైకి భారీ మొత్తంలో డబ్బులు అవసరమయ్యాయి. ఈ పరిస్థితుల్లో గ్రీన్‌ను వదులు కోవడమే మంచిదని నిర్ణయించింది. దీని కోసం ఆయా ఫ్రాంచైజీలను ముంబై సంప్రదించింది. ఇక ముంబై ప్రాతిపదినకు బెంగళూరు టీమ్ యాజమాన్యం అంగీకరించింది. రూ.17.5 కోట్లను వెచ్చించి గ్రీన్ దక్కించుకుంది. అయితే బెంగళూరు తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది. బ్యాటింగ్ ఆల్‌రౌండర్‌గా ఉన్న గ్రీన్‌ను భారీ మొత్తం వెచ్చించి ఎందుకు సొంతం చేసుకుందో ఎవరికీ అర్థం కావడం లేదు.

కోహ్లి, డుప్లెసిస్, మ్యాక్స్‌వెల్, దినేశ్ కార్తీక్, రజత్ పటీదార్ తదితరులతో బెంగళూరు చాలా బలంగా ఉంది. బౌలింగ్‌లో మాత్రం చాలా బలహీనంగా ఉంది. ఇప్పటికే హాజిల్‌వుడ్, హర్షల్ పటేల్, హసరంగ, పార్నెల్, డేవిడ్ విల్లీ వంటి స్టార్ బౌలర్లను వదులుకుంది. ఈ పరిస్థితుల్లో అందరూ బౌలింగ్‌ను పటిష్టపరిచేందుకు ఆర్‌సిబి యాజమాన్యం దృష్టి పెడుతుందని భావించారు. కానీ బెంగళూరు మేనేజ్‌మెంట్ మాత్రం అనూహ్యంగా గ్రీన్ కోసం భారీ మొత్తాన్ని ఖర్చు చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News