ఛత్రపతి శంభాజీనగర్: మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిని కూల్చేయాలని కొందరు డిమాండ్ చేస్తుండడంతో పోలీసులు, అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. మహారాష్ట్రలోని శంభాజీనగర్ జిల్లా ఖుల్దాబాద్‌లో ఉన్న ఔరంగజేబు సమాధి వద్దకు వెళ్లే సందర్శకులపై ఆంక్షలు విధించారు. ఇకపైన అక్కడికి ఎవరైనా వెళితే రిజిస్టర్‌లో సంతకం చేయడంతో పాటు, ఐడి కార్డును చూపించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. వివిధ ప్రభుత్వ కార్యాలయాల వద్ద విహెచ్‌పి కార్యకర్తలు నిరసనలు చేపట్టి, ఔరంగజేబు సమాధిని నిర్మూలించాలంటూ మెమోరాండంలు సమర్పించారు.
ఔరంగజేబు రాజ్యవిస్తరణను మరాఠులు గట్టిగా అడ్డుకున్నారన్నది ఇక్కడ గమనార్హం. ఇదిలావుండగా ఖుల్దాబాద్‌కు వెళ్లే దారిలో అనేక చోట్ల సెక్యూరిటీ పోస్ట్‌లను ఛత్రపతి శంభాజీనగర్ రూరల్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ఏర్పాటుచేసింది. సమాధి, తదితర ప్రాంతాల్లో 50 మంది సిఆర్‌పి, 30 మంది స్థానిక పోలీసులు, 20 హోంగార్డులను మోహరించారు. సమాధిని సందర్శించే పర్యాటకులు రిజిష్టరులో తమ పేరు వివరాలు రాయడమేకాక, ఐడి కార్డును చూయించాల్సి ఉంటుంది. కాగా ‘ఇక్కడ వాతావరణం ప్రశాంతంగానే ఉంది. ప్రజలు వదంతులను నమ్మకూడదు.
ఔరంగజేబు సమాధిని నిర్మూలించాలని డిమాండ్ మొదలయినప్పటి నుంచి పర్యాటకుల సందర్శన సంఖ్య ఇంకా బాగా పెరిగింది’ అని సమాధి కేర్‌టేకర్ పర్వేజ్ కబీర్ అహ్మద్ తెలిపారు. గమనించాల్సిన విషయం ఏమిటంటే ‘మతమార్పిడికి అంగీకరించకపోవడంతో ఔరంగజేబు సిక్కు గురువు గురు గోవింద్ సింగ్ ఇద్దరు కుమారులను చంపించాడు, మరాఠా యోధుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్‌ను చిత్ర హింసలు పెట్టి చంపాడు. అంతేకాక కాశీ, మథుర, సోమ్‌నాథ్‌లోని అనేక మందిరాలను కూల్చేశాడు’ అంటూ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు సమర్పించిన మెమోరాండంలో విహెచ్‌పి పేర్కొంది. ‘ఔరంగజేబుకు సంబంధించిన ఎలాంటి చిహ్నం అయినా బాధాకరమే’ అని కూడా పేర్కొంది.