Friday, January 24, 2025

57 లోక్‌సభ స్థానాలకు జూన్ 1న పోలింగ్

- Advertisement -
- Advertisement -

ఏడవ, చివరి దశ లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన ప్రచార పర్వం గురువారం సాయంత్రం పరిసమాప్తమైంది. ఏడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత చండీగఢ్‌లోని 57 లోక్‌సభ స్థానాలకు జూన్ 1వ తేదీన పోలింగ్ జరగనున్నది. పంజాబ్‌లోని మొత్తం 13 స్థానాలు, హిమాచల్ ప్రదేశ్‌లోని 4 స్థానాలు, ఉత్తర్ ప్రదేశ్‌లోని 13 స్థానాలు, పశ్చిమ బెంగాల్‌లోని 9 స్థానాలు, బీహార్‌లోని 8 స్థానాలు, ఒడిశాలోని 6 స్థానాలు, జార్ఖండ్‌లోని 3 స్థానాలతోపాటు చండీగఢ్‌లోని స్థానానికి పోలింగ్ జరగనున్నది. ప్రధాని నరేంద్ర మోడీ వరుసగా మూడవ పర్యాయం పోటీ చేస్తున్న ఉత్తర్ ప్రదేశ్‌లోని వారణాసి స్థానంలో కూడా జూన్ 1న పోలింగ్ జరగనున్నది. 28 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోని 486 సీట్లకు ఇప్పటికే ఓటింగ్ పూర్తయింది. మొదటి దశలో 66.14 శాతం, రెండవ దశలో 66.71 శాతం, మూడవ దశలో 65.68 శాతం, నాలుగవ దశలో 69.16 శాతం, ఐదవ దశలో 62.2 శాతం, ఆరవ దశలో 63.36 శాతం ఓటింగ్ నమోదైంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనున్నది.

ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో బిజెపి నాయకులు తమ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి నాయకులను అవినీతిపరులుగా, హిందూ వ్యతిరేకులుగా, ప్రజాధనాన్ని లూటీ చేసినవారుగా, వారసత్వ రాజకీయాలకు, బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతున్నవారిగా ఆరోపణలు గుప్పించారు. కాగా..బిజెపిని రైతు వ్యతిరేకిగా, యువత వ్యతిరేకిగా అభివర్ణించిన ఇండియా కూటమి బిజెపి మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చివేస్తుందని ఆరోపిస్తూ తమ ప్రచారాన్ని నిర్వహించాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఒడిశాలో జరిగిన ఒక ఎన్నికల సభలో ప్రసంగిస్తూ ప్రధాని నరేంద్ర మోడీని 11వ అవతారంగా చిత్రీకరించడానికి బిజెపి నాయకులు ప్రయత్నిస్తున్నారని, కాని దేశ ప్రజలు దీన్ని ఆమోదించరని వ్యాఖ్యానించారు. కాగా..మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం ప్రధాని మోడీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రధాని పదవి గౌరవాన్ని మోడీ దిగజారుస్తున్నారని, విద్వేష ప్రసంగాలు చేసి ప్రధాని కార్యాలయ ప్రతిష్టను మంటగలుపుతున్నారని ఆయన ఆరోపించారు.

ఇలా ఉండగా, చివరి దశ ఎన్నికల ప్రచారం కూడా ముగిసిపోవడంతో 48 గంటలపాటు ధ్యానం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ గురువారం సాయంత్రం తమిళనాడులోని కన్యాకుమారి చేరుకున్నారు. అక్కడ వివాకానంద మెమోరియల్ రాక్ వద్ద ఉన్న ధ్యాన మండపంలో ప్రధాని మోడీ ధ్యానం ప్రారంభించారు. మార్చి 16న ఎన్నికల కమిషన్ లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన నాటి నుంచి ప్రధాని మోడీ ర్యాలీలు, రోడ్‌షోలతోసహా 206 ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఇండియా కూటమిలో భాగస్వాములైనప్పటికీ ఆప్, కాంగ్రెస్ పంజాబ్‌లో విడివిడిగా పోటీ చేస్తుండడంతో రాష్ట్రంలో బహుముఖ పోటీ ఏర్పడింది. పంజాబ్‌లో ఉధృతంగా సాగిన ప్రచారంలో బిజెపి అగ్రనేతలు మోడీ నుంచి కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డాతోపాటు బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. కాంగ్రెస్ తరఫున ఖర్గేతోపాటు పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రచారానికి సారథ్యం వహించారు. ఎక్సైజ్ పాలసీ కేసులో మధ్యంతర బెయిల్‌పై విడుదలైన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌తో కలసి పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఉధృతంగా ప్రచారం నిర్వహించారు.

చివరి దశ ప్రచారం చివరిరోజు గురువారం పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో ప్రధాని మోడీ ప్రసంగిస్తూ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. ఎమర్జెన్సీ కాలంలో ప్రజాస్వామ్యం గొంతు నులిమి, 1984 అల్లర్లలో సిక్కుల ఊచకోతకు కారణమైన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాజ్యాంగం గురించి ప్రవచనాలు చెబుతోదని ఆయన ఆరోపించారు. ఉత్తర్ ప్రదేశ్‌లో సాగించిన ప్రచారంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అయోధ్య ఆలయానికి బాబ్రీ తాళం పెడుతుందని, బిజెపి ఆరోపించగా రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి తమకు ఓటు వేయాలని ప్రతిపక్ష ఇండియా కూటమి ఓటర్లను అభ్యర్థించింది. కోల్‌కతాలో మంగళవారం పార్టీ అభ్యర్థి తరఫున మోడీ ప్రచార సభ నిర్వహించగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా టిఎంసి అభ్యర్థుల తరఫున అనేక ప్రచార సభలు, రోడ్‌షోలు నిర్వహించారు. గురువారం నగరంలోని జాదవ్‌పూర్ ప్రాంతం నుంచి గోపాల్‌నగర్ వరకు 12 కిలోమీటర్ల దూరం వరకు సాగిన ర్యాలీలో మమతా బెనర్జీ నడిచారు. ఆమె వెంట టిఎంసి ఎంపి అభిషేక్ బెనర్జీ కూడా ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News