అస్సాం సిఎం హిమంత్ శర్మ
సిఎం శర్మపై అవినీతి ఆరోపణలను వదలని కాంగ్రెస్
ఆ పార్టీ శర్మ ఎదురు విమర్శలు
గువాహటి : అస్సాంలో ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మపై అవినీతి ఆరోపణలను కాంగ్రెస్ సాగిస్తుందగా ఆయన శనివారం ఆ పార్టీపై ఎదురు విమర్శలకు దిగారు. గాంధీలను మించిన ‘అవినీతిపరులు’ ఎవ్వరూ ఉండజాలరని హిమంత్ శర్మ అన్నారు. అస్సాంలో భారత్ జోడో న్యాయ్ యాత్రను మూడవ రోజు సాగించిన కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ గడచిన రెండు రోజులలో పలు బహిరంగ సభలలో శర్మను ‘డేశంలోనే అత్యంత అవినీతిపరుడైన సిఎం’గా అభివర్ణించారు.
‘గాంధీ కుటుంబం నుంచి వచ్చే ఎటువంటి నింద అయినా నేను ఒక ఆశీస్సుగానే పరిగణిస్తాను. ఎందుకంటే అది తమను తాము అత్యంత శక్తిమంతమైన కుటుంబంగా చెప్పుకునేవారిపై పోరాటానికి నాకు శక్తి ఇస్తుంది’ అని శర్మ ‘ఎక్స్’లో చేసిన పోస్ట్‌లో తెలిపారు. ‘అయితే. నేను ఒకే ఒక ప్రశ్న అడగాలని అనుకుంటున్నాను. గాంధీల కన్నా అవినీతిపరులు ఎవరైనా ఉండగలరా? బోఫోర్స్ కుంభకోణం, నేషనల్ హెరాల్డ్ కుంభకోణం, భోపాల్ గ్యాస్ దుర్ఘటన, ఆండర్సన్ పరారీ, 2జి కుంభకోణం, బొగ్గు కుంభకోణం మొదలైనవి (ఆ జాబితా భారీగా ఉంది)’ అని కూడా శర్మ అన్నారు. ‘అవినీతికి ఎలా పాల్పడాలో’ ఇతర బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు శర్మ ‘పాఠాలు చెప్పగలరు’ అని రాహుల్ గాంధీ పేర్కొన్న విషయం విదితమే. శర్మ గురువారం కూడా ఆ ఆరోపణలను తిరస్కరించారు. గాంధీ కుటుంబాన్ని ‘అత్యంత అవినీతిమయమైనది’గా శర్మ అభివర్ణించారు.