Sunday, December 22, 2024

కశ్మీరులో ఎవరైనా భూమి కొనవచ్చా!

- Advertisement -
- Advertisement -

రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ద్వారా జమ్మూకశ్మీరు రాష్ట్రానికి కల్పించిన ప్రత్యేక హోదా, ఆర్టికల్ 35ఎ రద్దును సుప్రీం కోర్టు సమర్ధించింది. డిసెంబరు పన్నెండవ తేదీన ఇచ్చిన తీర్పు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యకు ఆమోదం తెలిపింది. అది తాత్కాలికమే గనుక రద్దు సబబే అన్నది. తీర్పు ఇచ్చిన కోర్టు, న్యాయమూర్తులకు దురుద్దేశాలను ఆపాదించకూడదు. తీర్పులపై అభిప్రాయం చెప్పే హక్కు ఉంది గనుక ఆ మేరకు అనేక మంది అనుకూలంగా, వ్యతిరేకంగానూ స్పందిస్తున్నారు. భిన్న అభిప్రాయం చెప్పడం దేశద్రోహం లేదా ఉన్నత న్యాయస్థానాన్ని ధిక్కరించడం కాదు. ఈ తీర్పుతో రాష్ర్టంలోని ఒక తరగతి జనం సంతోషించరు అని కశ్మీరు మాజీ రాజు హరిసింగ్ కుమారుడు, కేంద్ర మంత్రిగా పని చేసిన కాంగ్రెస్ నేత కరణ్ సింగ్ స్పందించారు. తీర్పుతో ఆశాభంగం చెందాం తప్ప నిరుత్సాహపడటం లేదని మాజీ సిఎం ఒమర్ అబ్దుల్లా చెప్పారు. కాంగ్రెస్ నుంచి వెలుపలికి వచ్చి బిజెపికి దగ్గరగా ఉంటున్న గులాం నబీ అజాద్ కూడా ఆశాభంగం చెందినట్లు ప్రకటించారు. తీర్పు వెలువరిస్తున్న సందర్భంగా కశ్మీరు లోయలో ఆర్టికల్ రద్దును వ్యతిరేకించిన రాజకీయ పార్టీలకు చెందిన వారిని పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. ఆ వార్తలను సహజంగానే ప్రభుత్వం కొట్టిపడవేసింది. కోర్టు తీర్పును ఆమోదించడం తప్పనిసరి అంటూ దీనికి వ్యతిరేకంగా అనవసరంగా గోడకేసి తలలను కొట్టుకోవాల్సిన పని లేదు. వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు శక్తిని సమీకరించుకోవాలని కరణ్ సింగ్ సలహా ఇచ్చారు.

ఆర్టికల్ 370 వలన దేశంలోని ఇతర ప్రాంతాల వారెవరూ అక్కడ ఉండటానికి, భూములు కొనుక్కొనేందుకు అవకాశం లేదని, కశ్మీరు వేరే దేశం అన్నట్లుగా ఉందని రకరకాల ప్రచారాలు చేశారు. కాళిదాసు కవిత్వానికి తమ పైత్యాలను జోడించారు. కశ్మీరుకు ప్రత్యేక హోదా తొలగించిన గత నాలుగున్నర సంవత్సరాలలో జరిగిందేమిటి? వాటిలో కొన్నింటిని చూద్దాం. ఆర్టికల్ 370 రద్దు చేసిన తరువాత ‘నూతన కశ్మీరు’ ఎంతో అభివృద్ధి చెందిందని ప్రచారం చేస్తున్నారు. 201819 కశ్మీరు రాష్ర్ట ఆర్థిక సర్వే నివేదిక ప్రకారం మానవాభివృద్ది రంగాల్లో గుజరాత్ కంటే ముందున్నట్లు పేర్కొన్నారు. అంటే ఇప్పుడు ఇంకా జరిగిందని చెబుతున్నట్లా? 2019 జూన్‌లో ఎకనమిక్ టైవ్‌‌సు ప్రచురించిన వార్త ప్రకారం 1529 సంవత్సరాల వారిలో నిరుద్యోగం 15.89 శాతం ఉంది. రాష్ట్రాన్ని కేంద్రం స్వాధీనం చేసుకున్న తరువాత 2020లో 17.8% ఉన్నట్లు లేబర్ సర్వేలో తేలింది.

ఇక తాజా సమాచారం ప్రకారం 18.3% ఉందని కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ పార్లమెంటులో చెప్పినట్లు హిందూస్తాన్ టైవ్‌‌సు పత్రిక 2023 జూలై 26న ప్రచురించింది. కేంద్ర పాలనలో సాధారణ పరిస్థితి ఏర్పడిందని, ఉపాధి పెరిగిందని చేస్తున్న ప్రచారానికి పొంతన కనిపించటంలేదు.ఉగ్రవాదులు చెలరేగుతూనే వున్నారు. ఆ కారణంగానే రాష్ర్ట ప్రతిపత్తిని ఇంకా పునరుద్ధరించలేదు. ఆర్టికల్ 370కు అనుబంధంగా రాష్ర్టపతి ఉత్తర్వు ద్వారా 1954 లో రాజ్యాంగానికి ఆర్టికల్ 35ఎ తోడైంది. అనేక రాష్ట్రాలలో కల్పించిన మాదిరి కశ్మీరులో వున్న శాశ్వత నివాసులకు కొన్ని ప్రత్యేక అవకాశాలు, హక్కులను ఇది కల్పించింది. రాష్ర్టం వెలుపల ఉన్న వారికి స్థిర ఆస్తులను కొనుగోలు చేసేందుకు అవకాశం లేదు. ఎవరు శాశ్వత నివాసులన్న నిర్వచనాన్ని మూడింట రెండువంతుల మెజారిటీతో రాష్ర్ట అసెంబ్లీ మాత్రమే మార్చగలదు. ఈ ఆర్టికల్ వలన దేశంలోని ఇతరులు కశ్మీరులో రెండవ తరగతి పౌరులుగా పరిగణించబడుతున్నట్లు, ఇది పౌరుల మౌలిక హక్కులకే విరుద్ధం అని రాష్ర్టం వెలుపలి వారిని వివాహం చేసుకున్న కశ్మీరీ మహిళకు జన్మించిన సంతానానికి కూడా ఆస్తిహక్కు ఉండదని ఇది వివక్ష కాదా అని కొందరు భాష్యం చెప్పారు.

నిజానికి కశ్మీరు శాశ్వత నివాసుల గురించి 1927లోనే నాటి రాజు హరిసింగ్ ఉత్తర్వులు జారీచేశారు. విలీనం సందర్భంగా వాటికి హామీ ఇచ్చినందున రాజ్యాంగంలో పొందుపరచినట్లు సమర్ధకులు చెబుతున్నారు. కొన్ని ప్రత్యేక హక్కులు మరికొన్ని ఇతర రాష్ట్రాలలో కూడా ఉన్నాయని వాటి సంగతేమిటని ప్రశ్నిస్తున్నారు. తాజాగా సవరించిన దాని ప్రకారం కశ్మీరులో స్థానికత నిర్ధారణకు నిబంధనలు ఇలా ఉన్నాయి. పదిహేను సంవత్సరాలు కశ్మీరులో నివసించిన వారు, రాష్ర్టంలో ఏడు సంవత్సరాల పాటు చదివి పది లేదా పన్నెండవ తరగతి పరీక్షకు హాజరైన వారు వలస వచ్చినట్లు పునరావాస, సహాయ కమిషనర్ వద్ద నమోదు చేయించుకున్నవారు, పదేండ్లకు పైగా కశ్మీరులో పని చేసిన ఆలిండియా సర్వీసు అధికారులు, ప్రభుత్వ రంగ సంస్థలు, బాంకులు, పరిశోధనా సంస్థలు, చట్టబద్ధ ఇతర సంస్థలలో వారు పని చేసినా స్థానికులుగా పరిగణించబడతారు.

అలాంటి వారి పిల్లలు రాష్ర్టం వెలుపల ఉపాధి, వాణిజ్యం వంటి వాటి కోసం ఉంటే వారినీ స్థానికులుగా పరిగణిస్తారు. ఒకే దేశం, పౌరులంతా సమానమే అని చెప్పినప్పటికీ కొన్ని రాష్ట్రాలలో వెలుపలి వారు భూములు కొనేందుకు వీలు లేదు. జమ్మూకశ్మీరులో నిబంధనలు సడలించినప్పటికీ భూముల కొనుగోలు మినహాయింపు అది పరిశ్రమలకే తప్ప ఎవరుబడితే వారు కొనుగోలు చేసేందుకు కాదని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా చెప్పారు. సవరించిన కశ్మీరు రెవెన్యూ చట్టం ప్రకారం వ్యవసాయదారులు కాని వారు సాగు భూమి కొనుగోలు చేసేందుకు లేదు. ఎవరు వ్యవసాయదారు అంటే స్వంతంగా చేసే వారు అని స్పష్టం చేశారు. ఎవరు కొనుగోలుకు అర్హులో నిర్ణయించాల్సి ఉంది. తిరిగి రాష్ర్టంగా ఏర్పడిన తరువాత ఏర్పడే ప్రభుత్వం తలచుకుంటే ఆంక్షలను తిరిగి ప్రవేశపెట్టవచ్చు. రాజ్యాంగంలో ఆర్టికల్ 371 ప్రకారం అనేక రాష్ట్రాలలో ప్రత్యేక హక్కులను కల్పించారు.

ఇరవై సంవత్సరాలకు పైగా నివాసం ఉన్నవారే హిమాచల్ ప్రదేశ్‌లో ఎక్కడైనా భూమి కొనుగోలుకు అర్హులు. ఎవరైనా నిజమైన స్థానికుడిని హిమాచలీ కాని మహిళ వివాహం చేసుకుంటే అలాంటి వారికి మినహాయింపు ఉంటుంది. స్థానికులైనా వ్యవసాయదారులు కాని వారు సాగు భూములు కొనడానికి లేదు. నివాసానికి కొనుగోలు చేయాలన్నా అనుమతి తీసుకోవాల్సి ఉంటుం ది. వ్యవసాయేతర భూమిని వెలుపలి వారు కొనుగోలు చేయాలంటే ప్రభుత్వ అనుమతి అవసరం. జలవిద్యుత్ ప్రాజెక్టులకు పెట్టుబడిదారులు భూమి కొనుగోలు చేయవచ్చు. నాగాలాండ్‌లో ఆర్టికల్ 371ఎ ప్రకారం అక్కడి భూముల బదిలీ, యాజమాన్య హక్కులపై కేంద్రం కూడా చట్టాలు చేయడానికి లేదు. భూమి పుత్రులు తప్ప ఇతరులు భూమికొనే అవకాశం లేదు.

సిక్కింలో ఆర్టికల్ 371 ఎఫ్ ప్రకారం వెలుపలి వారు భూమి, ఆస్తులు కొనుగోలు మీద ఆంక్షలు వున్నాయి. కొన్ని మునిసిపల్ ప్రాంతాల్లో తప్ప సిక్కిం వాసులు ఆస్తి కొనుగోలు చేయవచ్చు, వారు కూడా గిరిజన ప్రాంతాల్లో కొనడానికి లేదు. అక్కడి వారికి మాత్రమే కొనే అమ్మే హక్కు ఉంటుంది. ఎవరైనా పరిశ్రమలు పెడితే వెలుపలి వారు కొనుగోలు చేయవచ్చు. అసోం, మేఘాలయ, త్రిపుర, మిజోరం, పశ్చిమ బెంగాల్లో రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూలులో పేర్కొన్న స్వయం పాలిత గిరిజన ప్రాంతాల్లో ఇతరులు భూములు కొనడానికి లేదు. మిజోరంలో ఆర్టికల్ 371జి ప్రకారం గిరిజనేతర ప్రాంతాల్లో భూబదలాయింపుల్లో పరిమితులు వున్నాయి. అరుణాచల్‌ప్రదేశ్‌లో సాంకేతికంగా, సంప్రదాయంగా స్థానిక నివాసులు కాని వారికి ఎవరికీ భూమిపై హక్కులు లేవు.

2018లో చేసిన చట్టం ప్రకారం స్థానికులకు వ్యక్తిగత ఆస్తి హక్కులు కల్పించారు. వెలుపలి వారు, గిరిజనేతరులు స్వంత ఆస్తి కలిగి ఉండడానికి లేదు. జార్ఖండ్, ఒడిషా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లలో గిరిజనేతరులు గిరిజనుల భూములు కొనుగోలు చేయడంపై ఆంక్షలున్నాయి. ఉత్తరాఖండ్‌లో 2003లో చేసిన చట్టం ప్రకారం వెలుపలి వారు నివాసం కోసం కేవలం 250 చదరపు మీటర్ల భూమిని మాత్రమే కొనుగోలు చేయవచ్చు. వాట్సాప్‌లో కాషాయదళాలు అనేక తప్పుడు ప్రచారాలు చేశాయి. కశ్మీరులో హిందువులు, సిక్కులు మైనారిటీలు, వారికి అక్కడ రిజర్వేషన్లు లేవు అన్నది ఒకటి. హిందూ మతం దేశంలో మైనారిటీ కాదు.

రాష్ట్రాలలో ఉన్న జనాభా ప్రాతిపదికను బట్టి నిర్ణయిస్తే ఈశాన్య రాష్ట్రాలలో అనేక చోట్ల క్రైస్తవులు మెజారిటీ, కానీ అక్కడ హిందువులకు రిజర్వేషన్లు అడగలేదు. మత ప్రాతిపదికన ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తే మా ప్రాణాలైనా ఇస్తాంగానీ అమలు జరగనివ్వం అని చెబుతున్న బిజెపి వారు కశ్మీర్‌లో మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఎలా అడుగుతారు? కశ్మీరు 2005 రిజర్వేషన్ చట్ట ప్రకారం వెనుకబడిన ప్రాంతాల వారికి 20, షెడ్యూల్డ్ తరగతులకు 10, షెడ్యూల్డ్ కులాలవారికి 8, మాజీ సైనికులకు 6, వికలాంగులకు 3, వాస్తవాధీన రేఖ సమీపంలో వున్నవారికి 3, వెనుకబడిన తరగతులకు 2 శాతం వున్నాయి.

వీటిని 2020లో కేంద్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ద్వారా షెడ్యూల్డ్ తరగతులకు 10, షెడ్యూల్డ్ కులాలకు 8, ఇడబ్ల్యుఎస్ 10, వెనుకబడిన ప్రాంతాల వారికి 10, మాజీ సైనికులకు ఆరు, పహారీ భాష మాట్లాడే వారికి, వికలాంగులు, వాస్తవాధీన రేఖ వెంబడి ఉండే వారికి, బలహీన వర్గాల (సామాజిక కులాలు)కు నాలుగేసి శాతాల చొప్పున సవరించారు. మొత్తం రిజర్వేషన్లు 60 శాతం ఉన్నాయి. వర్తమాన పార్లమెంటు సమావేశాల్లో వాటిని చట్టబద్ధం చేస్తూ బిల్లులను ఆమోదించారు. కేంద్ర ప్రభుత్వం కశ్మీరులో హిందువులకు ప్రత్యేక రిజర్వేష్లన్లను ఎందుకు పెట్టలేదో బిజెపి వారు చెప్పగలరా?

ఎం కోటేశ్వరరావు
8331013288

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News