ఓఆర్ఆర్ పై గరిష్ఠ స్పీడ్ 120 కిమీ.కు పెంపు
హైదరాబాద్ : ఇక నుంచి ఔటర్ రింగ్‌రోడ్డుపై 120 కి.మీల వేగంతో వెళ్లేలా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. గతంలో ఉన్న 100 కి.మీల వేగాన్ని సవరిస్తున్నట్టు హెచ్‌ఎండిఏ కమిషనర్ అర్వింద్‌కుమార్ పేర్కొన్నారు. మంగళవారం మంత్రి కెటిఆర్‌తో జరిగిన సమీక్ష సమావేశం తరువాత అర్వింద్‌కుమార్ ఈ ఆదేశాలు జారీ చేశారు. పెరిగిన వేగానికి తగ్గట్టుగా ప్రమాదాలు జరగకుండా ఏర్పాట్లు చేయాలని మంత్రి కెటిఆర్ ఆదేశాలిచ్చారని కమిషనర్ అర్వింద్‌కుమార్ పేర్కొన్నారు.
నిజానికి ఓఆర్‌ఆర్ మొత్తం ఫోర్ లైన్స్ ఉండగా, రెండు లైన్లను 100 కిలోమీటర్ల స్పీడ్ కోసం, మరో రెండు లైన్లను 80 కిలోమీటర్ల గరిష్ట వేగానికి పరిమితం చేశారు. 100 కిలోమీటర్ల గరిష్టవేగానికి 1, 2వ లైన్‌ను కేటాయించగా, 80 కిలోమీటర్ల వేగానికి 3, 4వ లైన్ ఉండేది. ఈ స్పీడ్ కంట్రోల్ చేసేందుకు స్పీడ్ గన్‌లు కూడా ఉండేవి. అయితే ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు మీద స్పీడ్ లిమిట్ పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఇక వాహనదారులు 120 కి.మీల స్పీడ్‌తో ఔటర్‌పై ప్రయాణించడానికి సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే 100 కి.మీల కంటే అధిక వేగంతో వాహనాలు ప్రయాణిస్తుండగా వాటి వేగాన్ని స్పీడ్ గన్‌తో ఫొటో తీసి ట్రాఫిక్ అధికారులకు హెచ్‌ఎండిఏ అధికారులు పంపించేవారు. ఈ నేపథ్యంలోనే కొంతమేర ప్రమాదాల తప్పినా ప్రస్తుతం ప్రభుత్వం 120 కి.మీల వేగంతో ప్రయాణించవచ్చని పేర్కొనడంతో వాహనదారులు మరింత స్పీడ్‌తో ఔటర్‌పై ప్రయాణించేందుకు రెడీ అవుతున్నారు.