Monday, December 23, 2024

మానవ అక్రమ రవాణా ఆగేనా!

- Advertisement -
- Advertisement -

ప్రపంచ వ్యాప్తంగా అనాథలైన బాల, బాలికలను అపహరించే దొంగల ముఠాలు తయారయ్యాయి. వీరు కాసుల కోసం కక్కుర్తిపడి పిల్లలను సుదీర్ఘ ప్రాంతాలకు వివిధ పద్ధతుల్లో తరలిస్తున్నారు. ఇలా వీరిని అక్రమ రవాణా చేసి వివిధ అసాంఘిక చర్యలకు పాల్పడే అక్రమ వ్యాపారులకు వారిని అమ్మేస్తున్నారు. నేడు డ్రగ్స్, ఆయుధాల అక్రమ రవాణా సరసన, మానవ అపహరణ, రవాణా కూడా నేర ప్రపంచంలో లాభదాయక వ్యాపార వస్తువుగా చెలామణి అవుతున్నది. ఇలా అపహరణకు గురైన బాలబాలికలను బానిసలుగా మార్చి గనులలో, ఫ్యాక్టరీలలో వెట్టిచాకిరీ చేయిస్తారు. కొందరిని లైంగిక అవసరాలకు వాడుకుంటారు. ఇలా మనుషులను అక్రమ రవాణా చేసే ముఠాలకు ఇండియా కూడా ఒక లాభసాటి వ్యాపార అడ్డాగా మారిపోయింది. ఇదే విషయాన్ని 2018 లోనే అమెరికా విదేశాంగ శాఖ నివేదికలో వెల్లడించింది. ముఖ్యంగా అందంగా వున్న పేద, అనాథ యువతులను ఉద్యోగా లు, సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామని ప్రలోభపెట్టి వారిని లోబరచుకుంటారు. ఇటీవల బంగ్లాదేశ్ నుంచి అందమైన అమ్మాయిలను కోల్‌కతాకు తీసుకొచ్చి వ్యభిచార కూపంలో దించిన ఉదంతాలెన్నో పత్రికలలో చూశాము. వారిలో వయసు వుడిగిపోయాన వారి నుండి మూత్రపిండాలు, కాలేయాలు అంగట్లో సరుకులైనాయి. ఇలాంటి దారుణ దందా కథనాలు కూడా వెల్లడయ్యాయి. ఇలాగే నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్ నుండి ఇటువంటి తరలింపులు నేటికీ కొనసాగుతున్నట్టు తాజా కథనాలు తెలుపుతున్నాయి.

ఇలా ఇరుగు పొరుగు దేశాల నుండి తరలించిన అమ్మాయిల్ని ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ నగరాలకు చేర్చి ఆపైన పశ్చిమాసియా, ఆగ్నేయాసియా దేశాలకు అక్రమ రవాణా చేస్తున్నట్లు సంబంధిత అధికారులే వెల్లడిస్తున్నారు. ఇలా అక్రమ రవాణాలో చిక్కుకొని తెలివిగా తప్పించుకొన్న వారి కోసం వసతి గృహాలు ఏర్పరిచి వారికి జీవనోపాధి కల్పించాలన్న సూచనలు వినిపిస్తున్నాయి. ఆ స్ఫూర్తిని బలపరుస్తూ సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక వసతి గృహాలు ఏర్పాటు నిమిత్తం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వాలు ముందుకు వస్తే సహకరించడానికి కేంద్రం ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది.
ఈ పునరావాస కేంద్రాలలో బాధితులకు ఆశ్రయం, ఆహారం, దుస్తులు, ప్రాథమిక ఆరోగ్య సదుపాయాలు వంటివి సమకూర్చాలని నిర్ణయించారు. లోగడ బీహార్, మణిపూర్, మేఘాలయా తదితర రాష్ట్రాల్లోని బాలల సంరక్షణ కేంద్రాలు వెలిశాయి. అయితే అవి అసలు లక్ష్యాలను విస్మరించి ‘కంచే చేను మేసినట్లు’ గా వక్ర మార్గం పట్టాయి.ఉదా॥ ముజఫర్ పూర్ సంరక్షణ కేంద్రంలో ఆశ్రయం పొందిన 34 మంది బాధిత బాలికలపై లైంగిక దాడులు పాల్పడిన దురాగతాలు బయటపడ్డాయి. సుప్రీంకోర్టు ఈ కేసును అత్యంత తీవ్రమైన విషయంగా పరిగణించింది. ఈ మధ్య కొత్తగా సరిహద్దు ప్రాంతాల్లో నెలకొల్పుతామంటున్న వసతి గృహాల్లో ఇటువంటి నేరపూరిత సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు తగిన కట్టుదిట్టమైన చర్య లు చేపట్టాలి. నేటికీ దేశంలో రోజుకు సగటున వంద మందికి పైగా పిల్లలు అదృశ్యమైపోతున్నారంటూ ‘బచపన్ బచావో ఆందోళన్’ అనే స్వచ్ఛంద సంస్థ 2013లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అలాంటి వారిని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం ద్వారా వారి ఆచూకీ కనిపెట్టాలని కోరింది. పటిష్ట సంకల్పంతో, సరైన కార్యాచరణతో రాష్ట్రాలు పూనుకో కావాలని ఆ సంస్థ అభ్యర్ధించింది.

అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు తమ ఉదాసీనతను వీడడం లేదు. వారి నిర్లక్ష్యం, అసమర్ధత కారణంగా ఈ అక్రమ రవాణా ఇంకా కొనసాగుతున్నది. ఇప్పటికే భారత దేశం నుండి లక్షల సంఖ్యలో ఆడపిల్లలు వ్యభిచార కూపంలో చిక్కుకొని వుంటారని అంతర్జాతీయ కార్మిక సంస్థ అంచనా వేసింది. భారత్‌లోకి ఈశాన్య ప్రాంతాలైన నేపాల్, బంగ్లాదేశ్ యువతుల అక్రమ తరలింపు జరుగుతుందని ‘సశస్త్ర సీమా బాల్’ విశ్లేషణ చేసింది.
ఇటీవల దర్భంగ్, కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైళ్ళలో 45 మంది మగ పిల్లల్ని అక్రమంగా రవాణా చేస్తున్న 11 మంది దుండగులు పట్టుబడ్డారు.చిన్న పిల్లలతో అశ్లీల చిత్రాలు రూపొందించి, చలామణి చేస్తున్న వారిపై ‘ఆపరేషన్ మేఘచక్ర’ పేరిట దేశ వ్యాప్తంగా సిబిఐ విస్తృత దాడులు చేసింది. అయినా ఈ అక్రమ రవాణా ఆగడాలు తగ్గడం లేదు. దేశంలో ఇప్పటికీ ప్రతి 8 నిమిషాలకు ఒకరు చొప్పున చిన్నారులు తప్పిపోతున్నారు. వారి ఆచూకీ దొరకడం లేదు. వారిలో సగం మంది వరకు శాశ్వతంగా అదృశ్యమైపోతున్నారు. రోజుల పసి పిల్లల్ని సైతం గుడ్డలు చుట్టి బిస్కెట్లు సరఫరా చేసే పెట్టెలో వుంచి దొంగచాటుగా తరలించిన సంఘటనలు గతంలో వెలుగు చూశాయి. 8 నుంచి 10 ఏళ్ల బాలికలకు హార్మోన్ ఇంజెక్షన్ ఇచ్చి వారిని పడుపు వృత్తిలోకి నెట్టి వేస్తున్న దారుణాలు కోకొల్లలు.

బాల బాలికలపై లైంగిక దాడులకు తెగబడే వాళ్ళ భరతం పట్టేందుకు 2012లో ‘పోస్కో చట్టాన్ని’ కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. అయినా 2023 జనవరి నాటికి 2.43 లక్షల పోస్కో కేసులు కోర్టుల్లో అపరిష్కృతంగా పోగుపడి ఉన్నాయి. ఇలాంటి చట్టాన్ని రూపొందించడం ఒక ఎత్తైతే దాన్ని అమలు పరచడం మరో సవాలు. ప్రభుత్వాల అలసత్వ వైఖరి చట్ట స్ఫూర్తినే తూట్లు పొడుస్తున్నాయి. చిన్న పిల్లలు, అభాగ్యుల రక్తమాంసాలే ప్రధాన పెట్టుబడిగా, అమానుష దందాగా విస్తృతంగా వ్యాపిస్తున్నది. ఆ ముష్కర మూకల పీచమణచాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య, వివిధ దేశాల నడుమ అర్థవంతమైన సమన్వయం ఉండాలి. పటిష్టమైన ప్రణాళిక, ఉమ్మడి కార్యాచరణ ఉండాలి. ఈ దేశ భవిష్యత్తు నేటి బాల బాలికల సంరక్షణపై ఆధారపడి ఉంది.

డా. కోలాహలం రామ్ కిశోర్, 
9849328496

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News