బీహార్ సిఎం నితీశ్ సవాలు
ప్రతిపక్ష ఐక్యతకు కృషి
ప్రధాని పదవిని ఆశించను
పాట్నా : బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన తరువాత నితీశ్‌కుమార్ బుధవారం ప్రధాని నరేంద్ర మోడీకి సవాలు విసిరారు. 2024 లోక్‌సభ ఎన్నికలను తట్టుకోగలరా, గెలవగలరా ? అని ప్రశ్నించారు. బిజెపికి షాక్ ఇచ్చి, బీహార్ సిఎంగా ఎనిమిదోసారి పగ్గాలు చేపట్టిన నితీశ్ కేంద్రంగా ఇప్పుడు జాతీయ స్థాయిలో ప్రతిపక్ష ఐక్యతా యత్నాలు వేగవంతం అయ్యే సంకేతాలు ఆయననే వెలువరించారు. తన కోసం ఎదురుచూస్తున్న విలేకరులతో ఆయన పలు విషయాలు ప్రస్తావించినప్పుడు తన దాడిని ఎక్కువగా ప్రధాని మోడీ సారధ్యపు బిజెపిపైనే తీవ్రతరం చేశారు. ‘ ఆయన (మోడీ) 2014లో గెలిచారు. 2024లో గెలుస్తారా’ అని నిలదీశారు. కేంద్రంలో బిజెపిని గద్దె దింపేందుకు ప్రతిపక్షాల సఖ్యతకు తాను పాటుపడుతానని నితీశ్ పదేపదే చెప్పారు. బీహార్‌లో ఇప్పటి తమ అధికారబంధం ఎక్కువ కాలం నిలవదనే బిజెపి నేతల వాదనను తోసిపుచ్చారు. ముందు వారు లోక్‌సభ ఎన్నికలలో వారి పరిస్థితి ఏమిటనేది చూసుకుంటే మంచిదన్నారు.
అయితే తాను ప్రధాని పదవితో పాటు ఏ పదవికి పోటీదారును కానని తేల్చిచెప్పారు. పదవులు ఆశించడం లేదన్నారు. బిజెపి అధికారానికి సవాలు విసిరే దిశలో అన్ని పక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడం జరుగుతుందన్నారు. రాజకీయాలలో తరువాత ఏం జరుగుతుందనేది చెప్పలేమని అయితే , 2024లో తాను సిఎంగా ఉండబోననేదే ఖచ్చితంగా చెప్పవచ్చునని అన్నారు. అప్పటికీ లోక్‌సభ ఎన్నికలు వస్తాయి కాబట్టి తాను జాతీయ స్థాయి రాజకీయాలను ఎంచుకుంటానని పరోక్షంగా తెలిపారు. తాను ప్రధాని అభ్యర్థినా అనేది ప్రశ్న ఇది కాదని, 2014లో అధికారంలోకి వచ్చిన వ్యక్తి 2024లో గెలుస్తారా? అనేదే కీలక ప్రశ్న అని స్పందించారు. కాలం దేనికైనా స్పష్టత ఇస్తుంది. సమాధానం చెపుతుందన్నారు.
వాజ్‌పేయికి మోడీకీ పోలికా …కుదరదు
అప్పటి ప్రధాని అటల్ వాజ్‌పేయికి ఇప్పటి ప్రధాని మోడీకి మధ్య ఉన్న వ్యత్యాసం గురించి విలేకరులు ప్రశ్నించగా వాజ్‌పేయి తమ పట్ల ఎంతో ప్రేమ ఆదరణ చూపారాని, దీనిని తాము మరిచిపోలేమని అన్నారు. అయితే ఇప్పుడు ఈ పరిస్థితి లేదన్నారు. బిజెపితో ఎందుకు విభేదించారని అడగగా వీటి వివరాలు త్వరలోనే తెలుస్తాయని అన్నారు. బిజెపితో కలిసి ఉండటం వల్ల అసెంబ్లీలో తమ పార్టీ సంఖ్యాబలం తగ్గుతూ వచ్చిందని, పార్టీ వర్గాలు వ్యక్తం చేసిన అభిప్రాయాలకు అనుగుణంగానే తాము నిర్ణయం తీసుకున్నామన్నారు.