Monday, December 23, 2024

సేంద్రియ సాగు మేలేనా?

- Advertisement -
- Advertisement -

ప్రపంచ వ్యాప్తంగా 67 శాతం ప్రజలు వ్యవసాయరంగం పైననే ఆధారపడి ఉన్నారు. భూమండలంపై నేలల్లో 11 శాతం వ్యవసాయానికి, 26 శాతం జంతు నివాసాలకు వినియోగపడుతున్నది. ప్రపంచ దేశాల్లో అత్యధిక వ్యవసాయ ఉత్పత్తులు ఉన్న 10 దేశాల్లో చైనా, ఇండియా, అమెరికా, బ్రెజిల్, రష్యా, ఫ్రాన్స్, మెక్సికో, జపాన్, జర్మనీ, టర్కీలకు పేరుంది. ఇండియాలో 58 శాతం ప్రజలు వ్యవసాయరంగంపై ఆధారపడి ఉంటూ, 18 శాతం జిడిపికి (60 శాతం జిడిపికి వ్యవసాయ ఆధారరంగాలు) కారణం అవుతున్నారు.1960కి పూర్వం భారత దేశంలో ఆహార పదార్థాల కొరత విపరీతంగా వెంటాడేది. నాడు ప్రజల ఆకలిని తీర్చడానికి ఆహార పదార్థాల దిగుమతుల ఆవశ్యకత అతిగా ఉండేది.

గత ఆరు దశాబ్దాల్లో హరిత విప్లవం, పారిశ్రామిక ప్రగతి కారణంగా దేశంలో ఆహార పదార్థాల ఉత్పత్తులు అనేక రెట్లు పెరిగి మిగులు స్థాయికి చేరాయి. నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు సంక్షేమ పథకాల అమలు, ప్రజా పంపిణీ వ్యవస్థల పటిష్టతతో బడుగుల ఆకలిని అంతం చేసే యజ్ఞంలో కొంత మేరకు సఫలీకృతం అయ్యారనే చెప్పాలి. అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాలు వేరువేరు వ్యవసాయ పథకాల అమలుతో సఫలం లేదా విఫలం కావడం చూస్తున్నాం, నేర్చుకుంటున్నాం.

ఉరుగ్వే అపూర్వ అనుభవాలు
దేశ ప్రజలకు ఆహార భద్రత కల్పించడానికి ఆహార ఉత్పత్తులు పెంచడం ఒక్కటే మార్గం కాకూడదని, పోషకాహార లభ్యతకు అధిక ప్రాధాన్యతలు ఇవ్వాలని గుర్తించాలి. సంప్రదాయ సాగు పద్ధతులు మాత్రమే సమస్యకు పరిష్కారం కాదని ఉరుగ్వే అనుభవాలు స్పష్టం చేస్తున్నాయి. ఉరుగ్వేలో వ్యవసాయంతో పాటు పాల ఉత్పత్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వబడింది. ఉరుగ్వే జనాభా 3.3 మిలియన్ల ఉండగా, 12 మిలియన్ల ఆవుల సంపద ఉండడంతో సగటున ఒక్కొక్కరికీ 4 ఆవుల చొప్పున పశుసంపద వర్ధిల్లుతున్నది. దీనితో పాలు, పెరుగు, నెయ్యి, ఇతర పాల ఉత్పత్తుల నిల్వలు పెరిగి పెద్ద ఎత్తున ఎగుమతులు చేస్తున్నది. పశుసంపద పెరిగినపుడు జంతు వ్యర్థాలలో సాగు నేల నాణ్యత కూడా పెరుగుతుందని గమనించాలి.

శ్రీలంక చేదు అనుభవాలు
గతంలో శ్రీలంక తీవ్ర ఆహార పదార్థాల కొరతను ఎదుర్కొన్నది. రసాయన, కృత్రిమ ఎరువుల వినియోగంతో ఆహార పదార్థాల ఉత్పత్తి పెరగడం జరిగింది. అతిగా రసాయన ఎరువుల వినియోగంతో దీర్ఘకాలిక దుష్ప్రభాలను ఎదుర్కోవలసి వస్తుంది. పరిస్థితి తీవ్రతను గమనించిన శ్రీలంక ప్రభుత్వం దశలవారీగా రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించే ప్రయత్నం చేసింది. రసాయన ఎరువుల స్థానంలో ఆర్గానిక్ సాగు పద్ధతుల్ని అమలు చేయడం ప్రారంభించారు. రసాయన ఎరువుల దిగుమతులు తగ్గించడంతో ఆహార పదార్థాల దిగుబడులు కూడా పడిపోయి మరోసారి ఆహార కొరత, ద్రవ్యోల్బణాలకు దారి తీసింది.

దీని ఫలితంగా ఒక కిలో బియ్యం ధర రూ. 115, గోధుమలు రూ. 100 -కు చేరడంతో పాటు యల్‌పిజి సిలిండర్ ధర రూ. 2,500 వరకు పెరగడం జరిగింది.ఈ దుష్పరిణామాలతో పాటు కొవిడ్-19 కల్లోలంతో శ్రీలంకలో పర్యాటక పరిశ్రమపడిపోవడం, ఆదాయ మార్గాలు తగ్గడం, విదేశీ నిల్వలు క్షీణించాయి. తాత్కాలిక ఉపశమనాలకు అనాలోచిత పథకాల అమలుతో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటున్న శ్రీలంక అనుభవాలు ఇతర దేశాలకు గుణపాఠం కావాలి.
పాకిస్థాన్‌లో ఏర్పడిన ఆహార సంక్షోభంలో గోధుమలు, చక్కర వంటి పదార్థాలను తక్కువగా వాడుకోవాలని మంత్రులే ప్రజలను కోరే దుస్థితి వచ్చింది. పాకిస్థాన్‌లో పోషకాహార లోపం, ఆహార పదార్థాల తీవ్ర కొరతలతో ఆకలి చావులను నిస్సహాయంగా చూడాల్సి వస్తున్నది. ఈ చేదు అనుభవాలు ఇతర దేశాలకు కనువిప్పు కావాలి.

ప్రపంచ పాస్ఫరస్ నిల్వల్లో దాదాపు 75 శాతం మొరాకోలోనే లభిస్తోంది. రసాయన ఎరువుల తయారీలో పాస్ఫరస్ వినియోగం అధికంగా ఉంటుంది. మొరాకోలో రసాయన ఎరువుల వినియోగం అపరిమితంగా ఉంటుంది. పాస్ఫరస్ అధిక నిల్వలున్న మొరాకో దేశం రసాయన ఎరువుల తయారీని తగ్గించి, పాస్ఫరస్ నిల్వలను అధిక ధరలకు ఎగుమతి చేసుకునే సదాలోచనలు చేయాలి. అసంబద్ధ పాలసీల అమలుతో దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలి పోవడం చూస్తున్నాం. అధిక చమురు నిల్వలున్న వెనెజులాలో అనాలోచితంగా ఉచిత /సబ్సీడీ ఆహార పదార్థాల పంపిణీతో ప్రజలు కూర్చొని తినడానికి అలవాటుపడిన కారణంగా నిరుద్యోగం పెరగడం, విదేశీ పెట్టుబడులు తగ్గడం, ఆహార ద్రవ్యోల్బణం పెరగడం, ప్రభుత్వాలు అతిగా కరెన్సీ ముద్రించడంతో సంచి నిండా డబ్బులతో వెళితే పిరికెడు సరుకులు దొరకడం కష్టం అవుతున్నది. జింబాబ్వే కూడా ఇలాంటి చేదు అనుభవాలనే ఎదుర్కొంటున్నది.

భారత్ నేర్చుకోవలసిన సాగు పాఠాలు
రసాయన ఎరువులు, ఆర్గానిక్ ఫార్మింగ్ విధానాలతో సమతుల్యత సాధించి వ్యవసాయ ఉత్పత్తులను పెంచుకుంటూ, సుస్థిరాభివృద్ధి దిశగా అడుగులు వేయాలి. నేడు అత్యంత సమస్యగా నిలిచిన వరి కొనుగోలు కేంద్రాల వైఫల్యాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పరస్పర ధూషణలను గుణపాఠంగా చేసుకొని, సాగు విధానాలను సవరించుకుంటూ, రైతుల వ్యథలను మనసులో పెట్టుకొని ముందడుగు వేయాలి. పర్యావరణహిత వ్యవసాయమే ప్రాణికోటి మనుగడకు ఊపిరని గుర్తుంచుకోవాలి. సారవంతమైన సాగు నేలల్లో ఆర్గానిక్ పరిమాణం 3-6 శాతం ఉండాలి. అత్యధిక దిగుబడులు సాధిస్తున్న పంజాబ్ సాగు నేలల్లో ఆర్గానిక్ పరిమాణం 0.5 శాతం మాత్రమే మిగిలి ఉండడంతో నేలలు ఇసుక తిన్నెలుగా మారుతున్నాయి.

ఇండియాలోని కనీసం 25 శాతం సాగు భూములు రాబోయే 10- 15 ఏండ్లలో ఎడారులుగా మారనున్నాయని అంచనా. నేలలో ఆకులు, చెట్ల వ్యర్థాలు, జంతు వ్యర్థాలు, పెంట మన్ను లాంటివి కలిస్తేనే ఆర్గానిక్ శాతం పెరిగి నేల నాణ్యత నిలుస్తుంది. రసాయన ఎరువులు, క్రిమి సంహారకాల విచ్చలవిడి వాడకంతో సారవంతమైన పంట భూములు ఎడారులుగా మారే ప్రమాదం పొంచి ఉందని మరువరాదు. నేల ఎడారీకరణను కట్టడి చేయడానికి, కార్బన్ పరిమాణం పెంచడానికి చెట్లను పోషించడం, రసాయన ఎరువులను మితంగా వాడడం, క్రిమిసంహారకాలను తగ్గించడం, జీవ వ్యర్థాలను నేలలో ఎరువుగా వేయడం, సుస్థిర శాస్త్రీయ సాగు పద్ధ్దతులు పాటించడం, పంట మార్పిడి అలవాటుగా మారడం, పశుసంపదను కాపాడుకోవడం లాంటి విధానాలు పాటించాలి.ఆకలిని జయించాలనే నెపంతో పర్యావరణాన్ని విచ్ఛిన్నం చేయరాదు. సుస్థిరాభివృద్ధి దిశగా వ్యవసాయ రంగం అడుగులు వేస్తూ నేలలు ఎడారులుగా మారకుండా జాగ్రత్త పడదాం.

డా. బుర్ర మధుసూదన్ రెడ్డి- 9949700037

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News