Thursday, January 23, 2025

తేదీ మార్చకుండా రాజ్యాంగ పీఠికను సవరించవచ్చా?

- Advertisement -
- Advertisement -

పిటిషనర్లను ప్రశ్నించిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: పార్లమెంట్ ఆమోదించిన నవంబర్ 26, 1949 అనే తేదీని తేదీని యథాతథంగా ఉంచుతూ రాజ్యాంగ పీఠికను సవరించవచ్చా అన్న సందేహాన్ని సుప్రీంకోర్టు శుక్రవారం వ్యక్తం చేసింది. రాజ్యాంగంలోని పీఠిక నుంచి సోషలిస్టు, సెక్యులర్ అన్న పదాలను తొలగించాలని కోరుతూ మాజీ రాజ్యసభ సభ్యుడు సుబ్రమణియన్ స్వామి, న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ చేపట్టిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం పిటిషనర్లకు ఈ ప్రశ్నను సంధిస్తూ విషయ పరిజ్ఞానం కోసం తాము ఈ ప్రశ్న వేస్తున్నామని తెలిపింది. రాజ్యాంగ పీఠికలో దాన్ని ఆమోడించిన తేదీ ఉందని, ఆ తేదీని మార్చకుండా పీఠికను సవరించడం సాధ్యమేనా అని జస్టిస్ దత్తా ప్రశ్నిస్తూ అలా చేయవచ్చు అని తేలితే పీఠికను సవరించడంలో ఎటువంటి సమస్య లేదని అన్నారు.

ఈ కేసులో అదే అసలైన ప్రశ్నని సుబ్రమణియన్ స్వామి అభిప్రాయం వ్యక్తం చేశారు. తాను చూసిన రాజ్యాంగ పీఠికలలో తేదీ పొందుపరిచిన రాజ్యాంగ పీఠిక ఇదొక్కటేనని జస్టిస్ దత్తా అన్నారు. ఫలానా రోజున ఈ రాజ్యాంగాన్ని అందచేస్తున్నామని మాత్రమే రాజ్యాంగ పీఠికలలో సాధారణంగా ఉంటుదని ఆయన చెప్పారు. అయితే సోషలిస్టు, సెక్యులర్ అన్న పదాలు రాజ్యాంగ పీఠిక మొదట్లో ఆమోదించినపుడు లేవని న్యాయవాది జైన్ తెలిపారు. ఒకనిర్దిష్టమైన తేదీతో భారత రాజ్యాంగ పీఠిక అమలులోకి వచ్చిందని, చర్చించకుండా పీఠికను సవరించడం సాధ్యం కాదని ఆయన తెలిపారు. దేశంలో ఎమర్జెన్సీ(1975-77) ఉన్న కాలంలో 42వ సవరణ చట్టం ఆమోదం పొందిందని ఈ సందర్భంగా స్వామి జోక్యం చేసుకుంటూ తెలిపారు.

ఈ రోజు ఉదయమే కేసు ఫైళ్లు తమ వద్దకు వచ్చాయని, సమయాభావం కారణంగా వీటిని లోతుగా పరిశీలించలేదని సామికి జస్టిస్ ఖన్నా తెలిపారు. ఈ కేసును సవివరంగా చర్చించాల్సి ఉందని, అందుకోసం తదుపరి వాదనలను ఏప్రిల్ 29వ తేదీకి వాయిదా వేస్తున్నామని ధర్మాసనం తెలిపింది. ఇలా ఉండగా..బలరాం సింగ్ అనే వ్యక్తితోపాటు మరికొందరు వేసిన పిటిషన్‌కు స్వామి పిటిషన్‌ను 2022 సెప్టెంబర్ 2న ధర్మాసనం జతచేసింది. రాజ్యాంగ పీఠిక నుంచి సోషలిస్టు, సెక్యులర్ అనే రెండు పదాలను తొలగించాలని స్వామి, బలరాం సింగ్ తమ పిటిషన్లలో కోరారు.

1976లో అప్పటి ఇందిరా గాంధీ ప్రభుత్వం 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ పీఠికలో సోషలిస్టు, సెక్యులర్ అన్న పదాలను చేర్చింది. ఈ సవరణతో రాజ్యాంగ పీఠికలో భారతదేశ నిర్వచనం సావరిన్, డెమోక్రటిక్, రిపబ్లిక్ నుంచి సావరిన్, సోషలిస్టు, సెక్యులర్, డెమోక్రటిక్, రిపఇ్లక్‌గా మారింది. పీఠికను మార్చడం, రద్దు చేయడం, సవరించడం సాధ్యం కాదని స్వామి తన పిటిషన్‌లో వాదించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News