హైదరాబాద్ : మన సౌర వ్యవస్థ గ్రహశకలాల వ్యర్థాల మయం. గ్రహం ఆవిర్భవించిన తొలినాటి నుంచీ ఆ శకలాలు అలాగే ఉండిపోయాయి. భూమికి పొరుగునున్న గ్రహం చుట్టూ దాదాపు 31,360 గ్రహ శకలాలు సంచరిస్తున్నాయి. వీటిలో చాలా గ్రహ శకలాలపై ముఖ్యంగా కిలోమీటర్ పరిమాణం ఉన్న గ్రహ శకలాలపై మనకు అదుపు ఉన్నప్పటికీ అవి కానీ భూమిని ఢీకొంటే మానవజాతి మొత్తం నశించిపోతుంది. అయితే చాలా గ్రహ శకలాలు బాగా చిన్నవి. వీటిని కనుగొనడం చాలా కష్టం. పదేళ్ల క్రితం 18 మీటర్ల పొడవున్న గ్రహశకలం మన వాతావరణంలో రష్యా లోని చెల్యాబిన్‌స్క్ మీద పేలిపోయింది. వీటి ప్రమాద ప్రకంపనలు వేల కొలది కిటికీలను నాశనం చేసాయి. పెద్ద విధ్వంసం సృష్టించాయి. 1500 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. డైమార్ఫోస్ వంటి 150 మీటర్ల పొడవున్న గ్రహశకలం మన నాగరికతను తుడిచిపెట్టలేదు. కానీ సామూహిక ప్రాణ నష్టం జరుగుతుంది. ప్రాంతీయ విధ్వంసం సంభవిస్తుంది.
ఏదెలాగైనా ఈ చిన్నపాటి అంతరిక్ష శిలలను కనుగొనడం చాలా కష్టం. ఇలాంటి వాటిలో 40 శాతం వరకే ఇప్పటివరకు మనం కనుగొనగలిగామని భావిస్తున్నారు. భూమిని ఢీకొనే ఈ పరిమాణం కలిగిన గ్రహ శకలాన్ని మనం కనుగొనగలమా ? వేరే దారికి దాన్ని మళ్లించగలమా ? విపత్తు నుంచి దూరంగా దాన్ని ఉంచగలమా ? ఈ ప్రశ్నలు మన ముందు కదులుతుంటాయి. గ్రహ శకలం కక్ష మార్గాన్ని మార్చడానికి తగినంత శక్తితో గ్రహ శకలాన్ని ఢీకొనడం సిద్ధాంతపరంగా సాధ్యం కావచ్చు. కానీ వాస్తవానికి సాధ్యం అవుతుందా ? అదే నాసాకు చెందిన డార్ట్ మిషన్ (double asteroid redirection test) నిర్ణయించ గలుగుతుంది. గత ఏడాది సెప్టెంబర్ 26న డైమార్పోస్ అనే గ్రహ శకలాన్ని డార్ట్ వ్యోమనౌక ఢీ కొట్టిన సంగతి తెలిసిందే. దీనివల్ల వెయ్యి టన్నుల ధూళి, రాతి శిలలు, ఎగిశాయి. ఈ సంఘటన తరువాత కొన్ని రోజుల పాటు ఈ శకలాలు సంక్లిష్టరీతిలో ఎలా చెల్లాచెదురయ్యాయి ? అనే విషయమై హబుల్ టెలిస్కోప్ వీడియో కీలక ఆధారాలను అందించ గలిగింది.
డార్ట్ వ్యోమనౌక ఢీకొట్టినప్పుడు రోదసీ లోని హబుల్ టెలిస్కోప్ వరుసగా ఫోటోలు తీయగలిగిందని నాసా చెబుతోంది. వాటన్నిటినీ గుదిగుచ్చి టైమ్ ల్యాప్స్ వీడియోను సిద్ధం చేసినట్టు నాసా వెల్లడించింది. అందులో ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగు చూశాయి. ఢీ వల్ల గ్రహ శకలం నుంచి అంతరిక్షం లోకి ఎగసిన ధూళి , శకలాలు కళ్లకు కట్టినట్టు కనిపించాయి. ఈ సమయంలో గంటగంటకూ జరిగిన మార్పులు స్పష్టంగా కనిపించాయి. ఇప్పుడు డిడిమోస్ అనే భారీ గ్రహ శకలం చుట్టూ డైమార్ఫోస్ పరిభ్రమిస్తోంది. డార్ట్ ఢీకొట్టడం వల్ల డైమార్ఫోస్ కక్షలో ఏదైనా మార్పు వస్తుందా ? అన్న విషయాన్ని శాస్త్రవేత్తలు పరిశీలించాలనుకుంటున్నారు. ఈ పరిశీలన వల్ల భవిష్యత్తులో భూమి వైపు దూసుకువచ్చే ప్రమాదకర గ్రహ శకలాలను దారి మళ్లించే విధానం కొంతవరకు అవగాహన అవుతుందని భావిస్తున్నారు.