బెంగళూరు: మా కొత్త కూటమి పేరు ఇండియా (INDIA – ఇండియన్, నేషనల్, డెవలప్ మెంట్, ఇన్‌క్లూసివ్, అలయన్స్ ) అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. ఇండియాను బిజెపి ఎదుర్కోగలదా? అని సవాలు విసిరారు. బెంగళూరులో జరుగుతున్న ప్రతిపక్షాల సమావేశంలో టిఎంసి అధినేత మమతా మాట్లాడారు. ఇకపై తమ ప్రచారం, పోరాటం అంతా ఇండియా పేరు మీదే ఉంటుందన్నారు. తాము దేశం కోసం కలిశామన్నారు. బిజెపి ఎన్‌డిఎ కలిసి ఇండియా కటమిని ఎదుర్కోగలదా? అని ప్రశ్నించారు. ఇండియా గెలుస్తుందని, బిజెపి ఓడిపోతుందని మమతా చురకలంటించారు. ఇండియా కూటమి విజయం సాధించడంతో దేశం గెలుస్తుందన్నారు.
రాజ్యాంగ పరిరక్షణ కోసం అందరం ఒక్కటయ్యామని ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. విపక్షాల కూటమికి ఇండియాగా పేరు పెట్టామన్నారు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ చాలా ముఖ్యమని, విపక్షాల భేటీకి 26 పార్టీలు హాజరయ్యాయని, ఇండియా పేరును అన్ని పార్టీలు అంగీకరించాయని ఖర్గే వెల్లడించారు.