Wednesday, October 16, 2024

అసంబద్ధ అభియోగాలు…. కెనడా దౌత్య లేఖ తిరస్కరణ

- Advertisement -
- Advertisement -

రాజకీయ అజెండాతోనే ట్రూడో ఆరోపణ అన్న భారత్
భారత హైకమిషనర్‌పై నిందలకు ఆక్షేపణ

న్యూఢిల్లీ : కెనడాలోని భారత హైకమిషనర్, ఇతర దౌత్యాధికారులు ఒక కేసులో ‘ఆసక్తికర వ్యక్తులు’ అని సూచిస్తూ కెనడా జారీ చేసిన దౌత్యపరమైన వర్తమానాన్ని భారత్ సోమవారం ‘దృఢంగా’ తిరస్కరించింది. దానిలోని అంశాలు ‘అసంబద్ధ ఆరోపణలు’ అని, జస్టిన్ ట్రూడో ప్రభుత్వ రాజకీయ అజెండాలో భాగమని భారత్ ఆక్షేపించింది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో నిరుడు సెప్టెంబర్‌లో కొన్ని ఆరోపణలు చేశారని, అయితే, పలు మార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ భారత ప్రభుత్వంతో ఒక్క సాక్షాధారాన్నీ కెనడా ప్రభుత్వం పంచుకోలేదని విదేశాంగ మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. ‘ఆ దేశంలో ఒక దర్యాప్తు సంబంధిత వ్యవహారంలో భారత హైకమిషనర్‌ను.

ఇతర దౌత్యాధికారులను ‘ఆసక్తికరమైన వ్యక్తులు’గా సూచిస్తూ ఆదివారం కెనడా నుంచి మాకు ఒక దౌత్యపరమైన వర్తమానం అందింది. భారత ప్రభుత్వం ఆ అసంబద్ధ ఆరోపణలను దృఢంగా తిరస్కరిస్తోంది. వోటు బ్యాంకు రాజకీయాలే కేంద్రంగా ఉన్న ట్రూడో ప్రభుత్వ రాజకీయ అజెండాగా వాటిని భారత ప్రభుత్వం పేర్కొంటున్నది’ అని ఎంఇఎ తన ప్రకటనలో తెలియజేసింది. ‘ప్రధాని జస్టిన్ ట్రూడో 2023 సెప్టెంబర్‌లో కొన్ని ఆరోపణలు చేసినందున మా వైపు నుంచి అనేక మార్లు అభ్యర్థనలు చేసినప్పటికీ లవలేశమైనా సాక్షాధారాన్ని కెనడా ప్రభుత్వం పంచుకోలేదు. సంప్రదింపుల తరువాత తాజా చర్య జరిగింది. ఇందులో కూడా వాస్తవాలు లేని వ్యాఖ్యలే ఉన్నాయి.

దర్యాప్తు సాకుతో రాజకీయ లబ్ధి కోసం భారత్‌ను తూలనాడే ఉద్దేశపూర్వక వ్యూహంతోనే ఇది చేస్తున్నారనేది నిస్సందేహం’ అని ఎంఇఎ పేర్కొన్నది, ట్రూడో శత్రుత్వ వైఖరి చాలా కాలంగా స్పష్టమవుతోందని ఎంఇఎ ఆరోపించింది. భారత్‌కు సంబంధించి వేర్పాటువాద అజెండాతో ఉన్న, ఒక తీవ్రవాదితో బాహాటంగా అనుబంధం ఉన్న వ్యక్తులను ఆయన మంత్రివర్గంలో చేర్చుకున్నారని కూడా ఎంఇఎ ఆరోపించింది. 2020 డిసెంబర్‌లో భారత అంతర్గత రాజకీయాల్లో కెనడా ప్రధాని ‘విస్పష్ట జోక్యం’ ఈ విషయంలో ఆయన ఎంతకైనా తెగిస్తారనేది సూచించిందని ఎంఇఎ వ్యాఖ్యానించింది.

ట్రూడో పూర్వపు చర్యలను ఎంఇఎ గుర్తు చేస్తూ, ‘ప్రధాని ట్రూడో శత్రుత్వ వైఖరి చాలా కాలంగా స్పష్టంగా కనిపిస్తోంది. 2018లో వోటు బ్యాంకు సానుకూలత లక్షంగా సాగిన ఆయన భారత పర్యటన ఆయనకే బెడిసికొట్టింది. భారత్ విషయమై తీవ్రవాద, వేర్పాటువాద అజెండాతో బాహాటంగా సంబంధం ఉన్న వ్యక్తులను ఆయన మంత్రివర్గంలో చేర్చుకున్నారు. ఈ విషయంలో ఆయన ఎంత దూరమైనా వెళతారనేది 2020 డిసెంబర్‌లో భారత అంతర్గత రాజకీయాల్లో ఆయన విస్పష్ట జోక్యం సూచించింది’ అని ఎంఇఎ వివరించింది. ‘భారత్‌కు సంబంధించి వేర్పాటువాద సిద్ధాంతాన్ని ప్రవచించే నాయకుని రాజకీయ పార్టీపై ఆయన ప్రభుత్వం ఆధారపడి ఉండడం పరిస్థితులను మరింత జటిలం చేసింది’ అని ఎంఇఎ ఆరోపించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News