కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో లిబరల్ పార్టీ సారథిగా ఈ వారం రాజీనామా చేయవచ్చునని ఒక మీడియా వార్త సూచించింది. పార్టీలో అంతర్గత వైరుధ్యం, ప్రజామోద రేటింగ్‌లు తక్కువగా ఉండడం నేపథ్యంలో ఆయన పార్టీ సారథ్యం నుంచి తప్పుకోవచ్చునని మీడియా సూచించింది. 2015 నుంచి కెనడా ప్రధానిగా ఉన్న ట్రూడో ఎప్పుడు తప్పుకుంటారో స్పష్టం కావడం లేదని, అయితే, బుధవారం జాతీయ కాకస్ సమావేశానికి ముందే ఆయన రాజీనామా చేయవచ్చునని ‘ది గ్లోబ్ అండ్ మెయిల్’ దినపత్రిక కొన్ని వర్గాలను ఉటంకిస్తూ తెలిపింది. 53 ఏళ్ల ట్రూడో లిబరల్ కాకస్‌తో భేటీకి ముందే తాను ఒక ప్రకటన చేయడం అవసరమని,
దాని వల్ల సొంత ఎంపిలే తనను సాగనంపినట్లు కనిపించరాదని భావిస్తున్నట్లు ప్రధానితో మాట్లాడిన ప్రతినిధుల్లో ఒకరు తెలిపారు. అధినేతగా ట్రూడోను మార్చడానికి లిబరల్ పార్టీ జాతీయ కార్యవర్గం ఏమి ఆలోచిస్తోందో తమకు తెలియదని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఆయన వెంటనే నిష్క్రమిస్తారా లేక కొత్త నేతను ఎంపిక చేసేంత వరకు ప్రధానిగా కొనసాగుతారా అన్నది అస్పష్టంగా ఉన్నదని వారు తెలిపారు. నాయకత్వ అంశాలపై నిర్ణయం తీసుకునే లిబరల్ పార్టీ జాతీయ కార్యవర్గం ఈ వారంలో సమావేశం కావాలని యోచిస్తోందని, కాకస్ సెషన్ తరువాత ఆ సమావేశం జరిగే అవకాశం ఉందని మీడియా వార్త పేర్కొన్నది.