Monday, December 23, 2024

36 గంటల నిరీక్షణ తర్వాత భారత్ నుంచి వెళ్లిన కెనడా ప్రధాని..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దాదాపు 36 గంటల నిరీక్షణ తర్వాత కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో ఎట్టకేలకు భారత్‌ను వీడారు. జి20 సదస్సు కోసం భారత్ వచ్చిన ఆయన విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో భారత్ లోనే చిక్కుకుపోయారు. ఆ సాంకేతిక లోపాన్ని సరిదిద్దినట్టు కెనడా ప్రధాన మంత్రి కార్యాలయం మంగళవారం వెల్లడించింది. దాంతో మంగళవారం మధ్యాహ్నం ఆయన భారత్ వీడారు. ఆయనకు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వీడ్కోలు పలికారు. “ కేంద్ర ప్రభుత్వం తరఫున కెనడా ప్రధానికి విమానాశ్రయంలో వీడ్కోలు పలికాను. జీ20 సదస్సుకు హాజరైనందుకు కృతజ్ఞతలు తెలియజేశాను” అని మంత్రి వెల్లడించారు. దీనికి ముందు ప్రధాన మంత్రి విమానానికి తలెత్తిన సాంకేతిక లోపం పరిష్కారమైనట్టు కెనడా పీఎంఓ ప్రెస్ సెక్రటరీ వెల్లడించిన సంగతి తెలిసిందే.

ఒకవైపు ట్రూడోను తీసుకెళ్లడానికి మరో విమానం భారత్‌కు వస్తోన్న తరుణంలో ఈ సమస్య కొలిక్కి రావడం గమనార్హం. ఆదివారం సదస్సు ముగిసిన తరువాత ట్రూడో ఢిల్లీ నుంచి కెనడా బయలుదేరాల్సి ఉంది. అయితే ఆయన ప్రయాణించాల్సిన విమానంలో సాంకేతిక లోపాన్ని గుర్తించిన సిబ్బంది చివరి నిమిషంలో ప్రయాణాన్ని రద్దు చేశారు. ఇక అప్పటినుంచి సమస్యను పరిష్కరించేందుకు సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించారు. చివరికి మంగళవారం విమానం లోని సాంకేతిక సమస్య పరిష్కారం కావడంతో విమానం గాల్లోకి ఎగిరేందుకు అనుమతి లభించింది. దీంతో ఆయన సుమారు 36 గంటల నిరీక్షణ తర్వాత తిరిగి కెనడా బయలుదేరి వెళ్లారు. మరోవైపు కెనడా నుంచి ట్రూడో కోసం బయలుదేరిన బ్యాకప్ విమానాన్ని లండన్‌కు దారి మళ్లించారు.

అయితే ఈ విమానాన్ని ఎందుకు దారి మళ్లించారనే వివరాలు వెల్లడి కాలేదు. జి20 సదస్సు కోసం ట్రూడో శుక్రవారం భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే. శని, ఆదివారాల్లో ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన జీ20 సదస్సులో పాల్గొన్నారు. సమావేశాలు ముగిసిన తరువాత షెడ్యూల్ ప్రకారం ఆదివారం రాత్రి 8 గంటలకు ట్రూడో ఆయన బృందం న్యూఢిల్లీ నుంచి కెనడా బయలుదేరాలి. విమానంలో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా వారంతా భారత్ లోనే ఉండిపోయారు. కెనడాలో ఖలిస్థానీ సానుభూతిపరుల ఆందోళనలపై భారత్ అభ్యంతరం వ్యక్త చేసినప్పటికీ , ట్రూడో ప్రభుత్వం చూసీచూడనట్టుగా వ్యవహరిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ట్రూడో ఢిల్లీలో ఉండగానే కెనడా లోని భారత దౌత్య కార్యాలయానికి బెదిరింపులు రావడం, మరింత ఇబ్బందికరంగా మారింది. ఈ క్రమం లోనే జీ 20 సదస్సుకు వచ్చిన ట్రూడో పర్యటన సాంతం అసౌకర్యంగానే కనిపించారు. ఈ సమయంలో ఆయనను తన విమానమే ఇబ్బంది పెట్టేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News