Friday, December 20, 2024

హెచ్-1బి వీసా హోల్డర్లకు కెనడా వెల్‌కమ్

- Advertisement -
- Advertisement -

టోరంటో : అమెరికాలో పనిచేస్తోన్న హెచ్1 బీ వీసాదారులకు కెనడా ప్రభుత్వం మంచి అవకాశం కల్పించింది. 10 వేల మంది హెచ్1 బీ వీసాదారులు తమ దేశానికి వచ్చి ఉద్యోగం చేసుకోడానికి వీలుగా ఓపెన్ వర్క్ పర్మిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ చర్యవల్ల భారత్‌కు చెందిన వేలాది మంది సాంకేతిక నిపుణులకు ప్రయోజనం కలుగుతుంది. అభివృద్ధి చెందుతున్న వివిధ సాంకేతికతలకు సంబంధించి ప్రపంచం మొత్తం మీద అగ్రదేశంగా రూపొందాలని కెనడా ఆకాంక్షిస్తోంది. అమెరికా సాంకేతిక దిగ్గజాలు భారీ ఎత్తున లేఆఫ్‌లు ప్రకటించడంతో ఉద్యోగాలు కోల్పోయిన సాంకేతిక వృత్తి నిపుణులను ఆకర్షించాలని చేస్తున్న ప్రయత్నాల్లో భాగమే ఈ ఓపెన్ వర్క్ పర్మిట్ల విధానం. హెచ్1 బి వీసా అంటే తాత్కాలిక వీసా. ఈ వెసులు బాటుతో అమెరికా కంపెనీలు విదేశీ కార్మికులను, ఉద్యోగులను తమకు అవసరమైన ప్రత్యేక ఉద్యోగాల్లో నియమించుకోగలుగుతున్నాయి.

అమెరికా సాంకేతిక సంస్థలు ఏటా భారత్, చైనా వంటి దేశాల నుంచి వేలాది మందికి తాత్కాలికంగా ఉద్యోగ అవకాశాలు కల్పించేవి. ఇప్పుడు కెనడా ప్రభుత్వం ఓపెన్ వర్క్ పర్మిట్ కూడా దాదాపు ఇదే విధంగా విదేశాలకు చెందిన ముఖ్యంగా అమెరికాలో పనిచేస్తోన్న హెచ్1 బి వీసాదారులకు అవకాశం కల్పించాలని ప్రయత్నిస్తోంది. జులై 16 నాటికి 10 వేల మంది హెచ్1 బీ వీసాదారులకు ఓపెన్ వర్క్ పర్మిట్ అవకాశం కల్పించడానికి నిర్ణయించింది. ఈ ప్రోగ్రామ్ కింద హెచ్1 బీ వీసాదారుల కుటుంబ సభ్యులు చదువు కోవడం, పనిచేసేందుకు అనుమతి కల్పిస్తామని కెనడా ఇమ్మిగ్రేషన్ మంత్రి సీన్ ఫ్రేజర్ వెల్లడించారు. హైటెక్ రంగాలకు చెందిన కొన్ని కంపెనీలు అమెరికా, కెనడా రెండు దేశాల్లోనూ పెద్ద ఎత్తున కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఈ కంపెనీల్లో పనిచేస్తున్న వేలాది మందిలో చాలా మంది హెచ్1 బీ వీసాదారులే. 2023 జులై 16 నాటికి హెచ్1 బీ వీసాలో అమెరికాలో పనిచేస్తున్నవారు, వీరితో వచ్చే కుటుంబసభ్యులు కెనడాకు వచ్చేందుకు దరఖాస్తు చేసుకోవచ్చని ఆ ప్రకటనలో వెల్లడించారు.

ఈ కొత్త ప్రోగ్రామ్ కింద, ఆమోదం పొందిన హెచ్1 బీ వీసాదారులకు మూడేళ్ల కాలవ్యవధితో ఓపెన్ వర్క్ పర్మిట్ లభిస్తుంది. వారు కెనడాలో ఎక్కడైనా , ఏ యజమాని వద్దనైనా పనిచేసేందుకు అవకాశం ఉంటుందని కెనడా ఇమ్మిగ్రేషన్ విభాగం వెల్లడించింది. ఇక వారి జీవిత భాగస్వాములు , వారిపై ఆధారపడేవారు కూడా కెనడాలో ఉద్యోగం లేదా చదువుకోడానికి తాత్కాలిక నివాస వీసాకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలియజేసింది. కరోనా మహమ్మారి సమయంలో ఐటీ కంపెనీలు భారీ ఎత్తున ఉద్యోగులను తాత్కాలికంగా తీసుకున్నాయి. కానీ ఇటీవల గూగుల్ ,మైక్రోసాఫ్ట్, అమెజాన్ , వంటి సంస్థలు వరుసగా లేఆఫ్‌లు ప్రకటించడంతో అమెరికాలో భారతీయులతోసహా అనేక మంది విదేశీయులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. గత ఏడాది నవంబర్ నుంచి ఈ విధంగా రెండు లక్షల మంది ఐటీ ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయినట్టు అమెరికా మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. వీరిలో 30 నుంచి 40 శాతం మంది భారతీయులు ఉన్నారు.

ఏటా అమెరికా ప్రభుత్వం 65,000 హెచ్ 1 బీ వీసాలను జారీ చేస్తోంది. ఈ వీసాల గడువు మూడేళ్లు. మరో మూడేళ్లు వీటిని రెన్యువల్ చేసుకోవచ్చు. 2022 ఆర్థిక సంవత్సరంలో ఆమోదం పొందిన హెచ్1 బీ వీసా దరఖాస్తుల్లో 72.6 శాతం భారతీయులవే .

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News