Saturday, November 16, 2024

ముదురుపాకాన దౌత్యయుద్ధం

- Advertisement -
- Advertisement -

ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసులో భారత దౌత్యాధికారులను ‘పరిశీలించవలసి ఉన్న వ్యక్తుల జాబితా’ లో కెనడా ప్రభుత్వం చేర్చడంతో అసలే అంతంత మాత్రంగా ఉన్న కెనడా- భారత్ సంబంధాలు మరింత క్షీణించాయి. కెనడా ప్రభుత్వ నిర్ణయంతో ఆగ్రహించిన భారత్.. ఆ దేశానికి చెందిన ఆరుగురు దౌత్యవేత్తలను దేశం విడిచి వెళ్లిపోవాలంటూ ఆదేశాలు జారీ చేయడంతోపాటు కెనడాలో ఉన్న భారత దౌత్యవేత్తలను వెనక్కి రప్పించాలని నిర్ణయం తీసుకుంది. బ్రిటిష్ కొలంబియాలోని ఒక గురుద్వారా వద్ద ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను గత ఏడాది గుర్తు తెలియని దుండగులు కాల్చిచంపారు. ఈ హత్యకు భారత ఏజెంట్లే కారణమంటూ కెనడా ప్రభుత్వం చేసిన ఆరోపణలు ఇరు దేశాల మధ్య అగ్గిరాజేశాయి.

అది మొదలు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అడపాదడపా భారత ప్రభుత్వంపై నోరు పారేసుకుంటున్నారు. నిజ్జర్ హత్య కేసులో తమ ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు అందించవలసిందిగా భారత ప్రభుత్వం చేసిన విజ్ఞప్తులను పెడచెవిన పెడుతూ వస్తున్న ట్రూడో, భారత్‌పై తన విమర్శలకు పదను పెడుతున్నారే తప్ప, పకడ్బందీగా దర్యాప్తు జరిపి నిజానిజాలను వెలికితీసే ప్రయత్నం చేయడం లేదు. ట్రూడో 2015లో ప్రధానిగా అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచీ భారత ప్రభుత్వానికి వ్యతిరేక వైఖరినే అవలంబిస్తున్నారు. ఈ విషయంలో ఆయన తన తండ్రి, మాజీ ప్రధాని పిరే ట్రూడో అడుగుజాడల్లో నడుస్తున్నారు. 1985 లో ఎయిరిండియా విమానం కనిష్కను దారి మళ్లించి, లండన్‌లో దిగడానికి ముందు పేల్చివేసిన ఖలిస్థానీ ఉగ్రవాది పర్మార్‌ను పిరే ట్రూడో వెనకేసుకు వచ్చే ప్రయత్నం చేసి, ఇంటాబయటా అప్రదిష్టపాలయ్యారు. ఇప్పుడు ఆయన కుమారుడు జస్టిన్ ట్రూడో కూడా కెనడాలో తిష్ఠ వేసుకుకూర్చుని, భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఖలిస్థానీ నేతలకు కొమ్ముకాస్తున్నారు.

ఇందుకు కారణం లేకపోలేదు. భారతదేశానికి స్వాతంత్య్రం రాకముందునుంచే సిక్కు సంతతి ప్రజలు కెనడాకు వలసవెళ్లడం మొదలైంది. 1970 దశకంలో అక్కడి వలస చట్టాలను సరళతరం చేయడంతో సిక్కుల వలసలు మరింత పెరిగాయి. అదే సమయంలో ఖలిస్థాన్ ఉద్యమంపై భారత ప్రభుత్వం ఉక్కుపాదం మోపడంతో అనేకమంది ఉగ్రవాద నేతలు కెనడాకు వలస వెళ్లిపోయారు. నిజ్జర్, పర్మార్ వంటి వారు ఆ కోవకే చెందినవారే. ప్రస్తుతం కెనడాలో ఏడున్నర లక్షల మందికి పైగా సిక్కులు నివసిస్తున్నారు. అక్కడి ఓటు బ్యాంకు రాజకీయాలపై సిక్కుల ప్రభావం ఎంతో ఎక్కువ. దీంతో అధికారంలోకి ఎవరు వచ్చినా సిక్కుల మద్దతుకోసం వెంపర్లాడటం పరిపాటిగా మారింది. ప్రస్తుతం అధికారం లో ఉన్న లిబరల్ పార్టీ మంత్రివర్గంలో నలుగురు సిక్కులు ఉన్నారంటే సిక్కులకు ట్రూడో ప్రభుత్వం ఎంత ప్రాముఖ్యతనిస్తోందో అర్థం చేసుకోవచ్చు. సిక్కుల ఓటు బ్యాంకును సొంతం చేసుకునేందుకు ట్రూడో చేయవలసిందంతా చేస్తున్నారు.

ఖలిస్థానీ ఉగ్రవాదుల కొమ్ము కాస్తూ, వారు అక్కడి హిందువులపైనా, హిందూ దేవాలయాలపైనా దాడులకు పాల్పడుతున్నా పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అంతేకాదు, భారత్‌ను వేధించేందుకు విదేశీ విద్యార్థులకు ఇచ్చే స్టడీ పర్మిట్లపైనా కెనడా కోత విధిస్తోంది. అమెరికా తరువాత భారతీయ విద్యార్థుల సంఖ్య కెనడాలోనే ఎక్కువ. గత పదేళ్లలో కెనడాలో భారతీయ విద్యార్థుల సంఖ్య ఏకంగా 260 శాతం పెరిగిన విషయం ఈ సందర్భంగా గమనార్హం. కెనడాలో వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ట్రూడో నాయకత్వంలోని లిబరల్ ప్రభుత్వం వెనుకంజలో ఉన్నట్లు తాజా సర్వేలు చెబుతున్నాయి. దీంతో దిద్దుబాటు చర్యలకు దిగిన ట్రూడో, భారత్‌పై వేధింపు చర్యలకు పాల్పడుతూ, సిక్కు ఓట్లు కొల్లగొట్టేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. భారత దౌత్యాధికారులను నిజ్జర్ హత్య కేసులో ఇరికించేందుకు పూనుకోవడం ఇందులో భాగమే.

తమ దేశంలోని ఖలిస్థానీ వేర్పాటువాదులను భారత ఏజెంట్లు లక్ష్యంగా చేసుకున్నారని, బిష్ణోయ్ గ్యాంగ్ సహకారంతో వారిని తుదముట్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు తాజాగా ఆరోపించినా, అందుకు తగిన ఆధారాలను మాత్రం చూపించకపోవడం ప్రభుత్వం ఒంటెత్తు పోకడలకు నిదర్శనం. కెనడాలో స్థిరనివాసం ఏర్పరచుకుని భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలను ఎగదోస్తున్న ఖలిస్థానీ ఉగ్రవాదులను అప్పగించాలంటూ భారత ప్రభుత్వం పదేపదే చేస్తున్న విజ్ఞప్తులను పెడచెవిన పెడుతూ, ఒక ప్రణాళిక ప్రకారం భారత్‌పై విషం కక్కుతున్న ట్రూడో వైఖరి గర్హనీయం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News