Sunday, December 22, 2024

41 మంది కెనడా దౌత్యవేత్తల ఉపసంహరణ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఖలీస్థానీల వివాదం రగులుతున్న దశలో కెనడా శుక్రవారం భారతదేశం నుంచి తమ దేశానికి చెందిన 41 మంది దౌత్యవేత్తలను , వారి కుటుంబ సభ్యులతో సహా ఉపసంహరించుకుంది. ఖలీస్థానీ నేత నిజ్జర్ హత్యోదంతం ఇరుదేశాల నడుమ దౌత్య స్థాయి వివాదానికి దారితీసింది. ఇండియాలోని తమ దౌత్యవేత్తలకు శుక్రవారం నుంచి భద్రతాపరమైన రక్షణను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించినందున తమ దౌత్యవేత్తలను వెనకకు రప్పిస్తున్నట్లు కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ టొరంటోలో ప్రకటించారు. దౌత్యవేత్తలకు రక్షణ ఉపసంహరణ అనుచిత చర్య. అంతర్జాతీయ చట్టాలకు ఇది విఘాతం . అయితే భారత్‌లాగానే తాము స్పందించాలనుకోవడం లేదని, తప్పనిసరిగా తమ దౌత్యవేత్తలను ఉపసంహరించుకుంటున్నామని విదేశాంగ మంత్రి తెలిపారు. తమకు అందిన సమాచారం ప్రకారం కెనడా దౌత్యవేత్తలను ఇండియా నుంచి తిప్పిపంపించేందుకు లేదా వారికి ఉన్న రక్షణను తీసివేసేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిసిందని ఆమె వివరించారు. శుక్రవారంతో వీరిపై వేటుపడుతుందని, లేదా వీరు అభద్రతతో ఉండాల్సి వస్తుందని గుర్తించి ముందుగానే వీరిని వెనకకు తీసుకువస్తున్నట్లు విలేకరులకు తెలిపారు. దౌత్యవేత్తల విషయంలో అంతర్జాతీయ కట్టుబాట్లు ఉంటాయి. ఇవి అన్ని దేశాలకూ వర్తిస్తాయి. వీటిని కెనడా గౌరవిస్తుందని తెలిపిన మెలానీ మరో వైపు భారత్‌తో తమ సంప్రదింపులు సాగుతూ ఉంటాయని ప్రకటించారు.

తప్పుడు మాటలు… అర్థరహిత చర్యలు ః భారత్
దౌత్యవేత్తల విషయంలో కెనడా ఆరోపణలు అర్థరహితంగా, దురుద్ధేశపూరితంగా ఉన్నాయని భారతదేశం స్పందించింది. ఇక్కడున్న కెనడా దౌత్యవేత్తల సంఖ్యను క్రమబద్ధీకరించేందుకు , కేవలం 21 మంది వరకూ సిబ్బందిని పరిమితం చేసుకోవాలని తెలిపినట్లు, అయితే దీనిని ఇప్పుడు కెనడా వక్రీకరిస్తోందని , అంతర్జాతీయ సూత్రాలను ఉల్లంఘిస్తున్నట్లు దుష్ప్రచారానికి దిగుతోందని భారతదేశం స్పందించింది. భారత అంతర్గత వ్యవహారాలలో కెనడా దౌత్యసిబ్బంది అతిగా జోక్యం చేసుకుంటున్నదనే విషయం తమకు తెలిసిందని, అయినా ఏ దేశం అయినా దౌత్యవేత్తల సంఖ్య విషయంలో సమస్థాయిని పాటించాలనేదే భారతదేశ అభిప్రాయం అని తెలిపారు. ఇప్పుడు కెనడా విదేశాంగ మంత్రి చేసిన ప్రకటన అసందర్భంగా ఉందని విదేశాంగ శాఖ ప్రతినిధి తెలిపారు. చాలా నెలలుగా దౌత్యసిబ్బంది సంఖ్య తగ్గింపుపై మాట్లాడుతూనే ఉన్నామని, గత నెలలోనే సరైన విధంగా దీనిని అమలుచేసే కార్యాచరణ గురించి చర్చించినట్లు తెలిపారు. దౌత్యసిబ్బంది సంఖ్య సమతూకత విషయంలో భారతదేశం తీసుకుంటున్న చర్యలన్ని కూడా వియన్నా కన్వెన్షన్‌లోని నిబంధనలకు అనుగుణంగానే ఉన్నాయని, దీనిని కెనడా గుర్తుంచుకుంటే మంచిదని భారతదేశం స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News