Sunday, December 22, 2024

భారత్ నుంచి 41 మంది కెనడా దౌత్యవేత్తలు వాపసు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆదేశాల మేరకు కెనడా భారత్ నుంచి 41 మంది దౌత్యవేత్తలను, 42 మంది వారి సహాయకులు, డిపెండెంట్లను ఉపసంహరించుకోవడంతో వీసా సర్వీసులకు తీవ్ర విఘాతం ఏర్పడనున్నది. చండీగఢ్, ముంబై, బెంగళూరులోని తమ కాన్సులేట్ల నుంచి ప్రత్యక్ష సర్వీసులను నిలిపివేస్తున్నట్లు కెనడా విదేశాంగ మంత్రి మెలనీ జోలీ ప్రకటించారు. ఢిల్లీలో మాత్రం ప్రత్యక్ష సర్వీసులు అందుబాటులో ఉంటాయని ఆమె సూచించారు.

తమ దేశంలోని అన్ని దేశాలకు చెందిన దౌత్యపరమైన సిబ్బంది సంఖ్యను సమాన స్థాయిలో కుదించాలని భారత్ తన నిర్ణయాన్ని ఏకపక్షంగా ప్రకటించిందని, ఇందులో భాగంగా అక్టోబర్ 20 నాటికి ఢిల్లీ నుంచి 21 మంది మినహా మిగిలిన దౌత్యవేత్తలను, వారి సహాయకులను ఉపసంహరించాలని ఆదేశించిందని జోలీ విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ ఆదేశాలను పాటించడం మినహా తమకు వేరే గత్తంతరం లేదని, తమ దౌత్యవేత్తల భద్రతే తమకు అత్యంత ముఖ్యమని జోలీ తెలిపారు.

భారత్‌లో ప్రస్తుతం కేవలం 21 మంది కెనడా దౌత్యవేత్తలు మిగిలారని ఆమె చెప్పారు. కెనడాలో ఉన్న భారత దౌత్యవేత్తలతో పోలిస్తే భారత్‌లో ఉన్న దౌత్యవేత్తల సంఖ్య చాలా ఎక్కువ. దీనికి కారణం భారత్‌లో భారీ సంఖ్యలో వీసాలను పరిశీలించవలసి ఉండడం. కెనడాలో ఉన్నత విద్యను అభ్యసించడానికి భారత్ నుంచి వెళ్లే విద్యార్థుల సంఖ్య లక్షల్లో ఉంటుంది. 2022లో రికార్డు స్థాయిలో 2.26 లక్షల మంది విద్యార్థులకు వీసాలు మంజూరయ్యాయి. మొత్తంగా 6 లక్షలకు పైగా వీసాల పరిశీలన గత ఏడాది జరిగినట్లు జోలీ తెలిపారు.

తమ దేశాన్ని వీడని కెనడా దౌత్యవేత్తలకు భద్రతాపరమైన ఇబ్బందులు తలెత్తుతాయని భారత ప్రభుత్వం చెబుతోందని, తమ దౌత్యవేత్తల భద్రతే తమకు అత్యంత ముఖ్యమని ఆమె చెప్పారు. వారు సురక్షితంగా కెనడాకు తిరిగివచ్చేందుకు తగిన చర్యలు తీసుకున్నామని ఆమె వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News