Sunday, December 22, 2024

కెనడాతో సంబంధాలు!

- Advertisement -
- Advertisement -

నలభై మంది తమ దౌత్య సిబ్బందిని బహిష్కరించడం ద్వారా వియన్నా ఒప్పందాన్ని ఇండియా ఉల్లంఘించిందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తాజాగా మరో ఆరోపణ సంధించారు. దీనితో రెండు దేశాల సంబంధాలు మరింతగా దిగజారకపోయినా తక్షణమే తిరిగి కోలుకొనే అవకాశాలు తగ్గిపోతాయని మాత్రం చెప్పవచ్చు. కెనడాలో జరిగిన ఖలిస్థానీ టైగర్ ఫోర్స్ అధినేత హరదీప్ నిజ్జార్ హత్య వెనుక ఇండియా ఏజెంట్ల హస్తమున్నట్టు “విశ్వసనీయమైన ఆరోపణలు” వచ్చాయని ట్రూడో గత సెప్టెంబర్ 18న అక్కడి పార్లమెంటులో చేసిన ప్రకటన రెండు దేశాల మధ్య సంబంధాలను అధోగతికి దిగజార్చింది. అంతకు ముందు న్యూఢిల్లీలో జరిగిన జి20 సమావేశాల సందర్భంగా రెండు దేశాల ప్రధానులూ ముఖాముఖీ నుంచి అర్థంతరంగా నిష్క్రమించారు. భారత వ్యతిరేక టెర్రరిస్టులకు కెనడా ఆశ్రయమిస్తున్నదని ప్రధాని మోడీ ఆ భేటీలో అన్నారని దానిని తమ ఆంతరంగిక వ్యవహారాలలో విదేశీ జోక్యమేనని ట్రూడో తిప్పికొట్టారని వార్తలు తెలియజేశాయి.

కెనడాలో స్థిరపడిన సిక్కులు అక్కడ తరచూ ఖలిస్థానీ కార్యకలాపాలకు పాల్పడుతూ మనకు చికాకు కలిగిస్తూ వుండడమే రెండు దేశాల మధ్య సంబంధాలు ఇంతగా దిగజారిపోడానికి మూలకారణమని ప్రత్యేకించి చెప్పనక్కర లేదు. సాటి దేశ సార్వభౌమాధికారానికి ముప్పు వాటిల్లడానికి దారి తీసే ఏ చిన్న కార్యక్రమాన్నైనా తమ గడ్డ మీద అనుమతించకపోడం ప్రపంచ దేశాలపై వున్న బాధ్యత. అటువంటి శక్తులు తలెత్తితే వాటిని తక్షణమే శిక్షించడం ద్వారా ఆ ధోరణి ప్రబలకుండా చూడడం వాటి కర్తవ్యం. అయితే పంజాబ్‌లో గత సిక్కు వేర్పాటువాద ఆందోళనను అణచివేసిన తర్వాత దేశదేశాల్లోని సిక్కులు భారత దేశంపై కక్ష కట్టి తాముంటున్న చోట ఖలిస్థానీ జెండాలు ఎగురవేయడం, భారత దౌత్య కార్యాలయాల వద్ద ప్రదర్శనలకు తలపడడం వంటి చర్యలకు తెగిస్తున్నారు.

ఈ శక్తులు బ్రిటన్, అమెరికాల్లో కూడా ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారు. దశాబ్దాల కింద ఆయా దేశాల్లో స్థిరపడిపోయి సంపద గడించుకొన్న సిక్కు కుటుంబాల నుంచి ఈ శక్తులు బయలుదేరుతున్నాయి. ఇతర దేశాల ప్రభుత్వాలు ఇలాంటి ఆగడాలకు పాల్పడుతున్న వారిపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకొంటున్నాయి. కెనడా మాత్రం చూసీచూడనట్టు ఊరుకొంటున్నది. జి20 సమావేశాల సందర్భంగా కెనడా ప్రధాని ముఖం మీదనే మోడీ ఆ విధంగా కటువుగా వ్యాఖ్యానించడానికి కారణం ఇదే. అయితే ఉగ్రవాదుల పట్ల తాను కఠినంగా వ్యవహరిస్తున్నానని చాటుకోడానికే మోడీ కెనడా ప్రధానితో అలా వ్యవహరించారనే విమర్శ వున్నది. అదేమైనప్పటికీ రెండు దేశాల మధ్య సంబంధాలు ఇప్పట్లో పునరుద్ధరణకు నోచుకోని స్థాయిలో పతనంకావడం అత్యంత బాధాకరం.

కెనడా జనాభా దాదాపు 4 కోట్ల మంది కాగా, అందులో 14 లక్షల మంది అంటే 3.7% మంది భారతీయ సంతతి వారున్నారు. వీరిలో దాదాపు 9 లక్షల 50 వేల మంది సిక్కులు. అంటే అక్కడున్న భారతీయుల్లో సగానికి మించి సిక్కులే వున్నారు. అక్కడి రాజకీయాల్లో వీరి ప్రాధాన్యం గణనీయంగా వుంటుంది. కేవలం ఈ కారణం వల్లనే, అక్కడి సిక్కులను దూరం చేసుకోరాదని ట్రూడో భావిస్తున్నారు. అందుకే వారి అకృత్యాలను సహిస్తూ వస్తున్నారని భావించవచ్చు. భారత కెనడా మధ్య వాణిజ్యం క్రమక్రమంగా అభివృద్ధి చెందుతున్నది. 2022 23లో కెనడాకు మనం ఎగుమతి చేసిన సరకుల మొత్తం విలువ 4.1 బిలియన్ డాలర్లు కాగా, అక్కడి నుంచి మనం దిగుమతి చేసుకొన్న సామగ్రి విలువ 4.06 బిలియన్ డాలర్లు.

ఈ ద్వైపాక్షిక వాణిజ్యం పెరుగుతున్నదే గాని తగ్గడం లేదు. ఇంత వరకు ప్రశాంతంగా వున్న సంబంధాలు ఇప్పుడు దిగజారినప్పటికీ వాణిజ్య సంబంధాల మీద అది చెప్పుకోదగిన దుష్ప్రభావం చూపలేదని తెలుస్తున్నది. ముందు ముందు అది కూడా జరిగినా ఆశ్చర్యపోవలసిన పని వుండదు. అయితే అక్కడా ఇక్కడా గల రెండు దేశాల పౌరుల జీవితాలపై వ్యతిరేక ప్రభావం పడకుండా చూసుకోవాలి. 45 ఏళ్ళ సిక్కు తీవ్రవాది నిజ్జార్‌ను కెనడాలో హతమార్చిన ఘటన వెనుక భారత ఏజెంట్ల హస్తమున్నట్టు విశ్వసనీయ సమాచారం అందిందని ట్రూడో చేసిన ఆరోపణకు ఇంత వరకు ఆయన సాక్షాలు చూపించకపోడమే ఇందులో కీలకమైన అంశం.

తగిన ఆధారాలు లేకుండా అంతటి ఘోరమైన ఆరోపణ చేయడం ఎంత మాత్రం సమంజసం కాదు. ఒకవేళ జి20 సందర్భంగా ఢిల్లీలో జరిగిన దాని పట్ల అక్కసుతో ట్రూడో ఆ ఆరోపణ చేసి వుంటే దానిని వెనుకకు తీసుకోడం తనకు గౌరవ భంగమని ఆయన భావిస్తూ వుండవచ్చు. అటువంటి నేపథ్యంలో రెండు దేశాల మధ్య మంచి సంబంధాల పునరుద్ధరణకు అవకాశాలను ట్రూడో ప్రభుత్వం కల్పిస్తే బాగుంటుంది. లేని పక్షంలో ఆయన ప్రధాని పదవి నుంచి దిగిపోయే వరకు సంబంధాలు ఇలాగే కొనసాగవచ్చు. అమెరికా చొరవ తీసుకొని ఈ ప్రతిష్టంభనను తొలగిస్తుందేమో ఎదురు చూడాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News