ఆ నలుగురు గుజరాత్‌కు చెందిన వారిగా నిర్ధారణ
టొరంటో : కెనడా-అమెరికా సరిహద్దులో తీవ్రమైన గడ్డకట్టే చలి కారణంగా శిశువుతో సహా నలుగురు భారతీయులు మృతి చెందిన సంఘటన మనసుని కదిలించే విషాదంగా కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో పేర్కొన్నారు. ఈ మేరకు ట్రూడో శుక్రవారం మాట్లాడుతూ ‘అమెరికా సరిహద్దుల గుండా ప్రజల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం చేయగలిగినదంతా చేస్తోంది. ఇది పూర్తిగా మనసును కదిలించే విషాదం. మానవ అక్రమ రవాణాదారుల బాధితులు మెరుగైన జీవితాన్ని నిర్మించుకోవాలనే కోరిక నెరవేరకుండానే ఆ కుటుంబం అలా చనిపోవడం చాలా విషాదకరం. ప్రజలు అక్రమంగా సరిహద్దులు దాటకుండా కట్టడిచేసేలా తాము చేయగలిగినదంతా చేస్తున్నాం అని అన్నారు. అయితే మృతులంతా గుజరాత్‌కి చెందిన ఒకే కుటుంబానికి చెందినవారు అని, తీవ్రమైన చలికి గురికావడం వల్లే మరణించారని తెలిపారు. మంచుతుఫానులో ఈ కుటుంబం చిక్కుకున్నట్లు తాము గుర్తించాం అని చెప్పారు. ఈ మేరకు కెనడాలోని భారత హైకమిషనర్ అజయ్ బిసారియా మరణించిన వారి జాతీయతను ధృవీకరించడమే కాక, ఈ సంఘటనను తీవ్ర విషాదంగా అభివర్ణించారు.