Monday, December 23, 2024

భారత దౌత్యంపై కెనడా నీడలు

- Advertisement -
- Advertisement -

ఈ మధ్యనే ఢిల్లీలో జి20 సదస్సును ఓ పెద్ద సంబరంగా జరుపుకొని, నేడు మొత్తం ప్రపంచం భారతదేశ మార్గదర్శనం కోసం ఎదురు చూస్తుందని చెప్పుకొంటూ పొంగిపొయాము. భారత దౌత్య విధానం గడిచిన 30 రోజుల్లో నూతన శిఖరాలకు చేరిందని ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా ప్రకటించుకున్నారు. జీ20 సదస్సులో తీసుకున్న కొన్ని నిర్ణయాలకు 21వ శతాబ్ధపు ప్రపంచ దశ, దిశను మార్చే శక్తి ఉందని చెప్పుకొచ్చారు. అంతర్జాతీయంగా ప్రస్తుత మున్న పరిస్థితుల నేపథ్యంలో అనేక దేశాలను ఒక వేదికపైకి తీసుకురావడం ఆషామాషి కాదంటూ గడిచిన 30 రోజుల్లో తాను 85 మంది ప్రపంచ నేతలతో సమావేశమయ్యానని తెలిపారు. అయితే దౌత్య విధానం అంటే సంబరాలు, అంతర్జాతీయ వేదికలపై ప్రసంగాలకు పరిమితం కాదని గ్రహించాలి. సమస్యలు ఎదురైనప్పుడు భారత్ వైపు ఏయే దేశాలు ఉంటాయి అన్నది కీలకం.

జి20 అధ్యక్ష పదవిని అంతర్జాతీయంగా దౌత్యపరమైన వ్యవహారాలను బలోపేతం చేసుకోవడం కాకుండా స్వదేశంలోని ఓటర్లను దృష్టిలో ఉంచుకొని ఎన్నికల ప్రచారం మాదిరిగా ఉపయోగించుకోవడంతో అనూహ్యమైన ప్రతికూలతకు దారితీసిన్నట్లు స్పష్టం అవుతుంది. జి20 ముగియగానే ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యలో భారత్ ప్రమేయం ఉందంటూ తమ దేశ పార్లమెంటులో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్రమైన ఆరోపణలు చేయడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది.సుదీర్ఘకాలంగా భారత్ లో వేర్పాటువాద కార్యకలాపాలు జరుపుతున్న ఖలిస్థాన్ ఉగ్రవాద బృందాలకు ఆశ్రయం కలిపిస్తున్న కెనడాతో దౌత్యపరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. ఉగ్రవాదంను ఎదుర్కోవడంలో పరస్పరం సహకరించుకోవాలని పలు అంతర్జాతీయ వేడుకలలో ఉమ్మడి ప్రకటనలు వెలువడుతునా కెనడా వంటి దేశాధినేతలు తమ దేశంలోని రాజకీయ ప్రయోజనాలకోసం పెడచెవిన పెడుతూ వస్తున్నారు.

అయితే, ఈ పర్యాయం ట్రూడో కేవలం తమ దేశంలో రాజకీయ ప్రయోజనాలకోసం ఇటువంటి ఆరోపణలు చేయలేదని, అంతర్జాతీయంగా భారత్ ను దౌత్యపరంగా ఏకాకిగా చేసే ప్రయత్నంలో భాగంగా చేశారని ఇప్పుడు భావించాల్సి వస్తుంది. పైగా, ట్రూడో అకస్మాత్తుగా ఇప్పుడు ఈ ఆరోపణ చేయలేదు. కొద్దీ నెలలుగా కెనడా అధికారులు ఈ విషయమై భారత అధికారులతో మాట్లాడుతూనే ఉన్నారు. వారి ప్రయత్నాలను కట్టడి చేయడంలో భారత్ నిస్సహాయంగా ఉండాల్సి వస్తుంది.
మరోవంక, అమెరికా అందించిందని నిఘా సమాచారం ఆధారంగానే కెనడా భారత్ పై ఇటువంటి ఆరోపణలు చేస్తున్నట్లు న్యూయార్క్ టైమ్స్ పేర్కొనడం గమనార్హం. అమెరికా నుంచి తమకు ఈ ఇంటెలిజెన్స్ సమాచారం అందిన తర్వాత కెనడా ప్రభుత్వం మరింత లోతుగా విచారణ చేపట్టి, అదనపు సమాచారాన్ని సమకూర్చిందని ఆ పత్రిక పేర్కొంది.
తన విచారణలో భాగంగా భారత దౌత్యవేత్త కమ్యూనికేషన్లలోకి కెనడా చొరబడి కీలక సమాచారాన్ని సేకరించిందని, అదే ఇప్పుడు కచ్చితమైన ఆధారంగా మారిందని ఆ కథనం వెల్లడించింది. అంటే, అమెరికా తోడ్పడుతోనే ట్రూడో భారత్ పై ఇటువంటి తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నట్లు స్పష్టం అవుతుంది.

కెనడా ప్రధాని ఆరోపణపై అమెరికా, ఇంగ్లాండ్ స్పందించిన తీరు సహితం భారత్ కు సానుకూలంగా లేదు. ఈ విషయంలో కెనడా దర్యాప్తుకు భారత్ సహకరించాలని హితవు చెప్పడం ద్వారా భారత్ ను ఓ నిందితునిగా వారు పరిగణిస్తున్నట్లు స్పష్టం అవుతుంది. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ఇంగ్లాండ్ ప్రధాని రిషి సనాక్ లతో ప్రధాని నరేంద్ర మోదీకి గల ౠవ్యూహాత్మక సాన్నిహిత్య సంబంధాలు’ లోగుట్టు ఈ ఉదంతంతో ప్రశ్నార్థకంగా మారాయి.అమెరికా, కెనడా, న్యూజీలాండ్, ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్‌డమ్స్ కలిసి ఫైవ్ ఐస్ గ్రూప్‌గా ఏర్పడ్డాయి. ఇది ఒక గూఢచార కూటమి. ఈ దేశాలన్నీ ఇంటెలిజెన్స్‌ను పంచుకుంటాయి. ఇది భారీ మొత్తం ఇంటర్‌సెప్టెడ్ కాల్స్, ఇతర మార్గాల్లో సేకరించిన సమాచారం ఉంటుంది. ఈ క్రమంలోనే నిజ్జర్ హత్యకు సంబంధించిన ఇంటెలిజెన్స్‌ను కెనడాకు అమెరికా అందజేసింది. అదే ఇప్పుడు భారత్, కెనడా మధ్య దౌత్య వివాదానికి దారి తీసింది. ఈ దేశాలు అన్నింటితో భారత్ కు మంచి సంబంధాలు ఉన్నప్పటికీ అవన్నీ కేవలం వాణిజ్య అవసరాలకోసమే భారత్ తో స్నేహం కోసం ప్రయత్నం చేస్తున్నాయి గాని వ్యూహాత్మక అంశాలపై కలిసి పనిచేసేందుకు సిద్ధంగా లేవని భావించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నేడు భారత్ – కెనాడాల మధ్య నెలకొన్న దౌత్యపరమైన ప్రతిష్టంభనలో ఆయా దేశాల సానుభూతి భారత్ కు లేదని స్పష్టం అవుతుంది.

దౌత్య సంబంధాలను స్వదేశీ రాజకీయ అవసరాలకోసం ఓ ప్రచార కార్యక్రమంగా మార్చే ప్రయత్నమే నేడు కెనడాతో ఏర్పడిన ప్రతిష్టంభనకు మూల కారణంగా చెప్పవచ్చు. విదేశాలలో తలదాచుకొంటున్న మనదేశానికి చెందిన కరడుగట్టిన నేరస్థులను గోప్యంగా అంతం చేయడమో, భారత్ కు తీసుకు రావడమో నెహ్రు కాలం నుండి మనం చేస్తున్నాము. కానీ అటువంటి రహస్య కార్యకలాపాలకు ఎవ్వరూ రాజకీయ ప్రచార అస్త్రంగా మార్చుకొనే ప్రయత్నం చేయలేదు.కానీ, ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జార్ కెనడాలో హత్యకు గురికాగానే ప్రధాని మోదీ, జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ జేమ్స్ బాండ్ మాదిరిగా వ్యవహరించారని అంటూ పొగడ్తలు గుప్పిస్తూ సోషల్ మీడియాలో విశేషంగా ప్రచారం చేశారు. ఒక టివి ఛానల్ లో ఉగ్రవాదులను అంతం చేసేందుకు యుద్ధనౌకలనే కాకుండా అణ్వాయుధాలను సహితం విదేశీ గడ్డపైకి పంపగల ధీరుడు మోదీ అంటూ ఒక వ్యక్తి పేర్కొన్నారు.అంతేకాదు, వారు ఆ విధంగా మరెందరో ఉగ్రవాదులను హతమార్చారని అంటూ పాకిస్తాన్, అమెరికా, యుకె తదితర దేశాలలో హత్యలకు గురైన వారి జాబితాను కూడా ప్రచారం చేశారు. ఇటువంటి తెలివితక్కువ సంకుచిత ధోరణులు ఇప్పుడు భారత్ – కెనడా సంబంధాలలో చిచ్చు రేపాయని గుర్తించాలి. ప్రధాని మోదీ మెప్పుకోసం, ఆయన స్వదేశీ రాజకీయ ప్రయోజనాలకోసం ఈ విధంగా ప్రచారం చేస్తున్నవారే నేడు భారత్ దౌత్యవిధానంకు శత్రువులుగా మారుతున్నారని గ్రహించాలి.

‘తెలివితక్కువ స్నేహితుడికన్నా నిఖ్సాన శత్రువే మేలైన మిత్రుడు‘ అంటూ ఒక హిందీ సినిమాలో అంటారు. నేడు సోషల్ మీడియా, ఇంటర్ నెట్ కారణంగా వార్తలు అత్యంత వేగంగా పరిగెత్తుతున్నాయి. ఢిల్లీలో ఉన్న విదేశీ రాయబారులు మనదేశంలోని ఇటువంటి తెలివితక్కువ ప్రచారాన్ని తేలికగా తీసుకోరని గ్రహించాలి. వాస్తవానికి నిజ్జర్ ను హత్యలో కీలక పాత్ర వహించిన దౌత్యవేత్త పేరును ఇప్పటివరకు కెనడా భారత్ కు అందీయలేదు.అంటే, కెనడా ప్రధాని వద్ద నిర్దుష్టమైన ఆధారాలు లేవని భావించాల్సి వస్తుంది. పైగా, ఈ హత్యలో ఐఎస్‌ఐ పాత్ర ఉన్నట్లు కొన్ని అమెరికా మీడియా నివేదికలు వెల్లడిస్తున్నాయి. నిజంగా ప్రధాని మోదీకి బిడెన్, రిషి సునాక్ లతో సాన్నిహిత్యం ఉంటె నిర్దుష్ట ఆధారాలు లేకుండా, భారత్ పై ఎందుకు అపనిందలు వేస్తున్నావని కెనడా ప్రధానిని నిలదీసి ఉండేవారు. కానీ ఈ విషయంలో వారి కెనడా వైపే ఉన్నట్లు వెల్లడి అవుతుంది.ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్ కావడంతో తమ ఉత్పత్తులకు భారత్ అవసరం ఆయా దేశాలకు ఉంది. పైగా, భారత్ అతిపెద్ద ఆయుధాల కొనుగోలుదారుడు కావడంతో అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాలకు ఆయుధాలు అమ్ముకోవడం వరకే భారత్ తో మైత్రి పరిమితమై ఉంది. ఈ విషయాన్నీ గ్రహించలేక దౌత్యాన్ని రాజకీయ ప్రచార అంశంగా మారుస్తూ ప్రధాని మోదీ పొరపాటు చేస్తున్నారా? అనే అనుమానం కలుగుతుంది.

జి20 సదస్సుకు వచ్చిన అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, సౌదీ అరేబియా వంటి దేశాలు వాణిజ్య ఒప్పందాలకు ఇచ్చిన ప్రాధాన్యత దౌత్య సంబంధ అంశాలకు ఇవ్వలేదు. జో బిడెన్ అయితే రెండో రోజు సమావేశానికి ఉండకుండా వియత్నాం వెళ్లిపోయారు. వియత్నంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి భారత్ ప్రధాని మోదీతో మానవ హక్కులు, పత్రికా స్వాతంత్రం, సహనం వంటి అంశాలపై తమ ఆందోళనలను వివరించానని చెప్పారు. పరోక్షంగా భారతదేశంలోని పరిస్థితుల పట్ల ఆసనాన్ని ప్రదర్శించారు. అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశాలు భారతదేశ ప్రజాస్వామ్యం పట్ల అసంతృప్తితో ఉన్నట్లు వారి ధోరణులు వెల్లడి చేస్తున్నాయి.ముఖ్యంగా చైనా ఆధిపత్య ధోరణులతో ఆందోళన చెందుతున్న ఈ దేశాలు చైనాను ఎదుర్కోవడానికి ఆసియా, పసిఫిక్ లో బలమైన భాగస్వామిగా భారత్ వైపు చూస్తున్నారు. అయితే తన దేశ భూభాగాలను చైనా ఆక్రమించుకొంటున్న విషయమై చైనాను ప్రశ్నించే సాహసం జో బిడెన్ చేయడం లేదు.మరోవంక, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యాను ఏకాకి చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలకు భారత్ కలసి రాకపోవడం, ఐక్యరాజ్యసమితి వేదికలలపై ఉక్రెయిన్ పై రష్యా దాడిని స్పష్టంగా ఖండించలేక పోవడం సహితం వారిని అసంతృప్తికి గురిచేస్తున్నాయి.

వాస్తవానికి జి20 సదస్సులో టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ పేరుపెట్టి భారత్ పై విమర్శలు గుప్పించారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ కు శాశ్వత స్థానం విషయంలో వ్యతిరేకతను వ్యక్తం చేశారు.చైనా పట్ల భారత్ విధానం సహితం ప్రశ్నార్థకంగా మారుతుంది. మన భూభాగాలను ఆక్రమించుకొంటున్నట్లు శాటిలైట్ చిత్రాలు వెలుగులోకి వస్తున్నా మనం నిలదీయలేకపోతున్నాము. ౠచైనా వస్తువులు బహిష్కరించండి’ అనే ఆకర్షణీయ ప్రచారంతో చిన్న, చిన్న వస్తువుల దిగుమతులను రద్దు చేసుకుంటున్నా చైనా నుండి భారీ ఎగుమతులు కొనసాగుతూనే ఉన్నాయి. భారత్ – చైనా వాణిజ్య లోటు భారీగా పెరుగుతుంది. మన దేశంలో అధికార వర్గాలకు సన్నిహితంగా వ్యవహరిస్తున్న కొన్ని కార్పొరేట్ వర్గాలకు చైనాతో గల వ్యాపార ప్రయోజనాల కారణంగా భారత్ ఆ దేశం పట్ల కఠినంగా వ్యవహరింపలేక పోతున్నదని విమర్శలు సహితం ఈ సందర్భంగా చెలరేగుతున్నాయి.

 చలసాని నరేంద్ర 9849569050

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News